పొలిటికల్‌ గ్రిప్‌ కోసమే లిక్కర్‌ వ్యాపారం

ABN , First Publish Date - 2020-02-07T17:03:50+05:30 IST

బొత్స సత్యనారాయణ. ముద్దుపేరు సత్తిబాబు. పాలిటిక్స్‌లో కుటుంబ నియంత్రణ పాటించని ఉదారవాది. ఆయన ఇంట్లో కనీసం అరడజను..

పొలిటికల్‌ గ్రిప్‌ కోసమే లిక్కర్‌ వ్యాపారం

సెటిల్‌మెంట్లు అన్న మాటకు అర్థమే తెలియదు

అక్కినేని ఫ్యాన్‌ను కనుకనే కాంగ్రెస్‌లో ఉన్నా

యాక్సెప్టెన్సీ తెచ్చుకుంటున్నా... సీఎం పదవే నా లక్ష్యం

వొక్స్‌వ్యాగన్‌‌పై ఆరోపణలతో బాధ పడ్డా.

ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కేలో బొత్స సత్యనారాయణ


బొత్స సత్యనారాయణ. ముద్దుపేరు సత్తిబాబు. పాలిటిక్స్‌లో కుటుంబ నియంత్రణ పాటించని ఉదారవాది. ఆయన ఇంట్లో కనీసం అరడజను మంది ఏదో ఒక పదవిలో ఉన్నారు. సత్తిబాబు మహా గడుసు పిండం. మాట తూటాలా పేలుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి పదవికి నాకేటి తక్కువ అని ప్రశ్నించగలిగిన ఈ ఉత్తరాంధ్ర ఉక్కుమనిషి బొత్సతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 23-11-2009న జరిపిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. లిక్కర్‌ వ్యాపారంపై ఉన్న ఆరోపణలకూ వివరణలిచ్చారు. ఆ వివరాలు ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం..


మీపేరు బొత్స సత్యనారాయణ. కానీ ముద్దుగా సత్తిబాబు అంటారు. మీకు ఆ ముద్దుపేరు ఎవరు పెట్టారు?

మాది జాయింట్‌ ఫ్యామిలీ. ఇంట్లో పెద్దవాడ్ని నేనే. సత్యనారాయణ అంటే పిలవడానికి పెద్దగా ఉంటుందని ఇంట్లో సత్తిబాబు అని పిలుచుకునేవారు.


మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? 70 మంది అని విన్నాను. ఇంతమందిని కలిపి ఉంచుతున్న ఫ్యాక్టర్‌ ఏమిటి?

మా నాన్నగారికి మేం 11 మందిమి. ఏడుగురు అన్నదమ్ములు. నలుగురు చెల్లెళ్లు. ఇక ఇంకో చిన్నాన్న గారికి ముగ్గురు. ఇంకో చిన్నాన్న గారికి ముగ్గురు. మాది ఉమ్మడి కుటుంబమే. మా మేనత్త పిల్లలు కూడా ఇంట్లోనే చదువుకుంటూ ఉంటారు. ఇంట్లో 40 మంది వరకు ఉంటాం.


జిల్లాలో ఇప్పుడు మీ మాటకు దాదాపు ఎదురు లేదు...

అందరితోనూ కలిసి మెలసి ఉంటాం. నిజంగా చెబుతున్నా.. ఎవరికి కష్టం వచ్చినా సరే 24 గంటలూ మా ఇంటిల్లిపాదీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాం.


మీ కుటుంబం పెద్దది. దానికి అనుగుణంగానే మీ కుటుంబంలోనే.. నాకు తెలిసి ఆరు పదవులు ఉన్నట్టున్నాయి.

ఆరు లేవు కానీ.. నలుగురం ఉన్నాం. నా భార్య ఎంపీ, నేను మంత్రిని అయ్యాను. ఇంకో ఎమ్మెల్యే. ఝాన్సీ సోదరి భర్త ఎమ్మెల్యే.


జిల్లాలో మీపై కొన్ని ఆరోపణలున్నాయి. మీ కుటుంబం ఓ మినీ కేబినెట్‌ నడుపుతుందని ఈ విమర్శ దృష్టికి వచ్చిందా?

200 శాతం నా దృష్టికి వచ్చింది. మా జిల్లాలో కాంట్రాక్టులు, ఇతర పనులు మేమేం చేయం. స్థానికులకే అప్పగిస్తాం.


ఇక, రెండో ఆరోపణ..మీ బ్రదర్స్‌ సెటిల్‌మెంట్లు చేస్తారనేది.

నిజం చెబుతున్నా మాకు ఆ మాటకు అర్థమే తెలియదు. జిల్లావాళ్లకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకపోతే ఎలా? మొత్తం నేనే చేయాలి అనుకుంటే నాశనమైపోతాం.



లిక్కర్‌ వ్యాపారంలోకి ఎప్పుడు వచ్చారు?

మా నాన్నగారు, మా తాతగారు ఉన్నప్పటి నుంచీ మాది బియ్యం వ్యాపారం. నేను వచ్చిన తర్వాత లిక్కర్‌ వ్యాపారంలోకి వచ్చాను. దీనికి, కింద ఉన్న మందీమార్బలానికీ లింకు ఉంది. డబ్బు కన్నా పొలిటికల్‌ గ్రిప్‌ ఉంటుంది. అందుకని దానిని పోనీయకుండా లైవ్‌లో ఉంచుతాం.


మీ ఎదుగుదలకు వైఎస్‌ కారణమా? స్వయంకృషా?

వైఎస్‌ నన్ను ఎక్కువ ప్రోత్సహించేవారు. ప్రోత్సాహం కంటే కూడా ఎక్కువగా ఇష్టపడేవారు.


అధిష్ఠానానికి విధేయులుగా ఉంటారా? వ్యక్తులకా?

కాంగ్రెస్‌లో అధిష్ఠానానికి విధేయులుగా లేకపోతే కష్టం. వ్యక్తులను ప్రేమించాలి. పార్టీకి విధేయతగా ఉండాలి.


వైఎస్‌ మరణం తర్వాత అధిష్ఠానం రోశయ్యను సీఎం ని చేయడం సరైనదేనని మీరు అనుకుంటున్నారా?

ఇక్కడ రెండు విషయాలు. రోశయ్యను సీఎంని చేయడంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కొనసాగించే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాలాంటి వాళ్లందరికీ కూడా వైఎస్‌ గారి అబ్బాయి సీఎం అవ్వాలన్నది ఉండేది. దానిని హైకమాండ్‌ ముందు పెట్టాం.


ఇప్పుడు పరిస్థితి ఏమిటి? హైకమాండ్‌ మనసుని మీరు చేసిన రీడింగ్‌ ప్రకారం రోశయ్యగారు ఎంతకాలం ఉండవచ్చు?

రోశయ్యను కొనసాగిస్తారు కనక మంత్రిగా మన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తే పార్టీకి, ప్రభుత్వానికీ మంచిది.


గతంలో సీఎంలు చనిపోయినప్పుడు వాళ్ల కుమారులు సీఎంలు కావాలని డిమాండ్‌ రాలేదు?

అంటే.. గతంలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు పొలిటికల్‌ సినారియో చాలా మారింది. పూర్వం హైకమాండ్‌ పట్టు ఎక్కువగా ఉండేది. వైఎస్‌గారు కాంగ్రెస్‌ను అధికారంలోకి రావడానికి శాయశక్తులా కృషి చేశారు. అధిష్ఠానాన్ని మెప్పించాడు. పార్టీపై పట్టు వచ్చింది. ఆయన లేకపోతే పార్టీ ఏమైపోతుందన్న పరిస్థితిని కూడా తీసుకొచ్చారు.


కానీ, ఓ జాతీయ పార్టీకి అది వాంఛనీయమా?

వ్యక్తి, వ్యక్తి తాలుకు బలం, చిత్తశుద్ధి, కృషి ఇక్కడ ముఖ్యం. ఆయన పెరిగితే పార్టీకే కదా పేరు వచ్చేది. అందుకే అధిష్ఠానం కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ల అబ్బాయి కూడా ఎంపీగా గెలిచాడు. వైఎస్‌ వల్ల కొత్తగా 50 మంది రావడం, సీనియర్లమైన మాకు ఆయనతో ఉన్న అనుబంధం కారణంగా వాళ్ల అబ్బాయి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం ఏర్పాటైంది.


జగన్‌ తప్ప కాంగ్రెస్‌లో సీఎం పదవికి అర్హులు లేరా?

లేరని ఎవరన్నారు. కాంగ్రెస్‌లో అర్హులు లేకపోవడం ఏమిటి? అర్హతకు పెట్టింది పేరు కాంగ్రెస్‌ పార్టీ. పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖ్యమంత్రే. ప్రతి ఒక్క ఎంపీ ముఖ్యమంత్రే.



సీఎం పదవికి అర్హులుగా మిమ్మల్ని భావించుకుంటున్నారా?

ప్రతి వ్యక్తి ప్రతీదీ కావాలనుకుంటాడు. కోరుకునేది సరైనదా కాదా అనేది ఎదుటివాడు నిర్ణయిస్తాడు. ఓ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ పోవాలి.


లక్ష్యాన్ని ఎప్పటిలోగా చేరుకోవాలని టార్గెట్‌ పెట్టుకున్నారు?

లక్ష్యాన్ని చేరుకోవడానికి 25 ఏళ్లు పట్టిందని వైఎస్‌ చెప్పారు. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పట్లో చంద్రబాబు మంచివాడు కాదు. ఏ రాత్రిపూటో ఏ రాయో రప్పో విసిరేస్తాడు. జాగ్రత్త అని చెవిలో చెప్పాను. ఎమ్మెల్యే క్వార్టర్లలో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు రాత్రిళ్లు పడుకుంటే మధ్యలో అప్పుడప్పుడు వెళ్లి చూసేవాళ్లం.


సీఎం అయే అవకాశం మీకూ ఉందా?

దేవుడి దయ.


సీఎంగా రోశయ్య తృప్తికరంగా లేరన్నది ఒక వర్గం వాదన. అవకాశం వస్తే మీరు కూడా పోటీదారుడిగా మారతారా?

అవకాశం అంటే, ఉన్నవాళ్లని దించాలన్న ఆలోచన లేదు.


పార్టీలో రెడ్డి ఫ్యాక్టర్‌ను ఛేదించడానికి ప్రయత్నం చేస్తారా?

కాంగ్రెస్‌లో నేడు గ్రూపు, ఫ్యాక్షన్‌, వర్గ రాజకీయాల్లేవు. మొత్తం అధిష్ఠానమే. మన ఎలివేషన్‌, వ్యక్తిత్వాన్ని పెంచుకుని.. ఇతను ఉంటే బాగుంటుందన్న ఏకాభిప్రాయాన్ని రెడ్డి అయినా కాపు అయినా తెస్తేనే తప్ప ఇవన్నీ జరగవు.


రాష్ట్రంలో కాపులకి ఇంతవరకు అవకాశం రాలేదు. అదేమైనా నినాదంగా... లేదా అర్హతగా మీరు వెళతారా?

నినాదం పని చేయదిక్కడ. కులంతో పదవులు రావాలంటే కష్టం. రోశయ్య గారికి అన్నికులాల వాళ్లమందరం మద్దతు ఇచ్చాం. కులం కీలక భూమిక అయిందన్నది వాస్తవమే. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఈ కోణంలో తీసుకోవడం లేదు. రేపు కూడా అధిష్ఠానం నిర్ణయం వస్తే.. ఎవరూ ఏమీ చేయలేరు. మనమంటే అంగీకారం ఉండాలి. నడవడిక మార్చుకుని 154 మందికీ సత్తిబాబు పరవాలేదురా అనిపించి.. ఆయన దగ్గరకు వెళితే పని జరుగుతుంది. ఆయనైతే పార్టీని నడిపించగలడు అనే యాక్సెప్టెన్సీని తెచ్చుకుని విశ్వాసాన్ని కల్పించకపోతే ఎలా?


ప్రజారాజ్యం, కాంగ్రెస్‌ మధ్య పొత్తు విలీనానికి మీరు కూడా ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. నిజమేనా?

నిజమే. వార్తలు వచ్చాయి. అసలు ఇది ఇప్పటిది కాదు. 2009 ఎన్నికలు అయ్యాక రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే మా పార్టీలో చర్చలు ప్రారంభించారు. చిరంజీవితో పొత్తు పెట్టుకోవాలి. లేకపోతే విలీనం చేసుకోవాలని.


చర్చలు జరిపారా ఎప్పుడైనా?

నేనేమీ మధ్యవర్తిత్వం చేయలేదు కానీ... ప్రతిపాదనను మా అధిష్ఠానానికి తెలియజేశానంతే. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కాకతాళీయంగా చర్చల్లో రెండు వైపుల నుంచీ ప్రతిపాదన వచ్చింది. పెద్దాయన ఉన్నప్పుడు జరిగింది కదా ఇప్పుడెందుకు జరగకూడదని అధిష్ఠానానికి తెలియజేశాను. ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అన్నాను.


కానీ, రాజశేఖరరెడ్డి వర్గం నుంచి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది?

తెలియక కొందరు. తెలిసి కొందరు మాట్లాడేశారు. ఆ తర్వాత విలీనానికి ఒప్పుకున్నారు కదా. భేదాభిప్రాయం లేదు.



గ్రేటర్‌ ఎన్నికలయ్యే వరకు ఇది పెండింగ్‌లో ఉంటుందా?

అంతే కదా. ఒకరికొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నప్పుడు విలీనమూ పొత్తు అన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది..


ఓ పక్క రాజకీయం. మరోపక్క వ్యాపారం. ఎంతోకొంత బిజీగా ఉంటారు. రిలాక్స్‌ అవడానికి ఏం చేస్తారు?

సిటీలో ఉంటే సాయంత్రం అయ్యేసరికి స్నేహితులతో బాతాఖానీ, ఎవరింటికైనా డిన్నర్‌కు వెళతాం. 1996 వరకు కార్డ్స్‌ ఎక్కువగా ఆడేవాడిని. ఆ తర్వాత మానేశాను. ఎందుకంటే నాది లూజింగ్‌ హ్యాండ్‌. ఎంపీనయ్యాక కార్డ్స్‌ ఆడడం ఏమిటి నాన్సెన్స్‌ అని మానేశాను. మంత్రి అయిన తర్వాత ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడూ ఆడుతున్నాను. ఇప్పుడు విన్నింగ్‌ హ్యాండ్‌ అయిపోయింది.


తదుపరి అడుగు ఎటు? ముఖ్యమంత్రేనా?

యాక్సెప్టెన్సీని తెచ్చుకోవడం. ఈ పదవిని సత్తిబాబే చేయాలని అనిపించుకోవడం. అప్పుడు అవకాశం ఉంటే ఉంటుంది.


మీ జీవితంలో బాగా సంతోషం కలిగించింది ఏమిటి?

2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినరోజే. ఆరోజే ఝాన్సీతో అన్నా.. వైఎస్‌ సీఎం అవుతారు. మనకు మంత్రి పదవి వస్తుంది అని.


బాధ పెట్టినవి..

రాజకీయంగా వోక్స్‌వ్యాగన్‌. వ్యక్తిగత జీవితంలో కళ్లంట నీళ్లు పెట్టుకున్నది మూడే మూడుసార్లు. మా నాన్నగారు చనిపోయినప్పుడు. రాజీవ్‌గాంధీ చనిపోయినప్పుడు. రాజశేఖరరెడ్డిగారు చనిపోయినప్పుడు.


సినిమాల్లో బాగా ఎవరిని ఇష్టపడతారు?

కాంగ్రెస్‌ పార్టీలో ఉండిపోవడానికి అదో కారణం. మొదటినుంచీ నేను అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్‌ని. అందుకే కాంగ్రెస్‌లో ఉండిపోయాను.


మీరు రాకముందు రాజకీయాల్లో మీ కుటుంబంలో ఎవరూ లేరు కదా? తొలుత ఎవరి అండతో వచ్చారు?

నేనే ఫస్ట్‌ జనరేషన్‌. కాలేజీ రోజుల్లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా రెండేళ్లు ఉన్నాను. రాష్ట్రంలోనే వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నారంటే మా మూడు జిల్లాల్లోనే. మా వైజాగ్‌ సిటీని తీసేస్తే మొత్తం వెనకబాటుతనం అక్కడ ఉంది. అందులో పుట్టినవాడ్ని. అప్పుడు స్కాలర్‌షిప్స్‌ తక్కువ. మా ఎంఆర్‌ కాలేజీలో 2600 మంది విద్యార్థులం ఉంటే హాస్టల్లో 120 మాత్రమే. సీటడిగితే లేదంటారు. ఆనందగజపతి రాజుగారు ఛైర్మన్‌ దానికి. అశోక్‌గజపతిరాజుగారు ఎమ్మెల్యే. వీళ్లు ఎంతసేపూ వాళ్ల ఆధిపత్యం పేరుతో చదువులకు అవకాశాలు లేకుండా చేసేవారు.


అప్పుడు తొలిగా బీసీ ఆందోళనను మొదలుపెట్టాం. 1992లో సెంట్రల్‌ బ్యాంకు అధ్యక్షుడిని అయ్యాను. వాస్తవానికి, 1991లోనే ఎంపీ అభ్యర్థిగా నేదురుమల్లి గారు నన్ను ప్రపోజ్‌ చేశారు. కానీ,రాజీవ్‌గాంధీ ఆనందగజపతిరాజుకే టికెట్‌ ఇచ్చారు. జిల్లా పరిషత్తు ఎన్నికలు వస్తే జడ్పీ ఛైర్మన్‌ అవుదామనుకున్నా. నా లక్ష్యమది. అయితే ఎన్నికలే జరగలేదు. 83, 85, 89లో మూడుసార్లు అసెంబ్లీకి నిలబడమన్నారు. మూడుసార్లూ నిలబడలేదు. 94లో నేను అడిగాను. ఇవ్వలేదు. 96 లోక్‌సభ ఎన్నికల్లో ఆనందగజపతిరాజును మార్చి నాకు టికెట్‌ ఇచ్చారు. ఓడిపోయాను. 98లో మళ్లీ ఇచ్చారు. మళ్లీ ఓడిపోయాను. 99లో మళ్లీ ఇస్తే అప్పుడు గెలిచాను.


వోక్స్‌వ్యాగన్‌ మీకో మచ్చగా మారింది. ఇక్కడ పది కోట్లు పోయాయా వచ్చాయా అన్నదానికంటే.. ఓ మంత్రిగా మోసపోవడాన్ని మీరెలా భావిస్తున్నారు?

చాలా బాధపడ్డాను. 200 శాతం మోసపోవడాన్ని నేను చాలా ఫీల్‌ అయ్యాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ మచ్చలేకపోతే ఇప్పటికి ఇంకా బుర్ర తిరుగుడుగా మాట్లాడేవాడ్ని. దానివల్ల ఆగి తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


మీరెప్పుడన్నా టీడీపీలో చేరాలని అనుకున్నారా?

ఏమిటీ కాంగ్రెస్‌లో.. అని ఓసారి నాకు అనిపించింది. మరోసారి నన్ను చేర్పించుకోవడానికి బాబుగారు చాలా ప్రయత్నం చేశారు. ఆయనకు, మాకు మధ్య చాలా చర్చలు నడిచాయి. కానీ మనసులు కలవలేదు.

Updated Date - 2020-02-07T17:03:50+05:30 IST