మాకూ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పదు
ABN , First Publish Date - 2020-02-07T17:22:54+05:30 IST
ప్రత్యేక సీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో..
రాయలసీమకు రాజధాని రావాల్సిందే
ఇక్కడ నుంచే ఆరుగురు సీఎంలు, ఓ రాష్ట్రపతి
అయిన ఒరిగిందేమీ లేదు
ఓట్లు, సీట్లు కోసమే జగన్ సమైక్య (విభజన) వాదం
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి
ప్రత్యేక సీమ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్య క్రమంలో తన మనోభావాలను పంచుకున్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్- జట్టులో పన్నెండో ఆటగాడని, ఆయనకు ఆడే చాన్స్ లేదని, నీళ్లందించడానికే పరిమితమని తేల్చి పారేశారు. వైసీపీ అధినేత జగన్‌ది సమైక్య- విభజన వాదమని ఎద్దేవా చేశారు. సీమకు రాజధాని సాధించడానికి పోరాడతామ ని, అంతిమలక్ష్యం మాత్రం రాయలసీమ రాష్ట్ర సాధనేనని స్పష్టంచేశారు .09-12-2013న ఏబీఎన్ ఛానెల్‌లో ప్రసారమయిన ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమ వివరాలు...
నమస్కారమండీ రాజశేఖరరెడ్డిగారు. ఈ మధ్య బాగా ఆవేశంతో ఉన్నట్టున్నారు?
నమస్కారం. పరిస్థితులను అలా తెచ్చారు. రాష్ట్ర విభజనలో సీమను విచ్ఛిన్నం చేయాలనుకోవడం.. మా నాయకులే మోసం చేయడం బాధించింది.
పది జిల్లాల తెలంగాణ వచ్చింది కదా.. మీ లక్ష్యం ఏమిటి?
మా గొంతుపైన పెట్టిన కత్తి తొలగిపోయింది. ఇప్పుడు సీమకు రాజధాని సాధించడం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం.
కానీ, రాయల తెలంగాణ అడిగింది మీ 2 జిల్లాల వాళ్లే కదా?
కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లా నాయకులు దీన్ని నడిపించారు. అది సోనియా వరకూ పోలేదు. దీంతో అసదుద్దీన్ ఒవైసీ ద్వారా ముందుకు తీసుకెళ్లారు.
అదీ ఓ రకంగా మంచిదే కదా? హైదరాబాద్ మీకు చెందుతుంది, నీటి సమస్యా పరిష్కారమవుతుంది...
నీటి సమస్య ఎట్లా పరిష్కారమవుతుందండీ? సీమలో ప్రాజెక్టులు అక్రమంగా కట్టారని, జలచౌర్యానికి పాల్పడుతున్నారని, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను అక్రమంగా కడుతున్నారని కేసీఆర్‌సహా తెలంగాణవాదులు పదేపదే అంటున్నారు. అలాంటప్పుడు 28 సీట్లున్న మా ప్రాంతంలోగల ఈ ప్రాజెక్టులు 119 సీట్లున్న తెలంగాణ రాజ్యంలో ఎలా మనగలుగుతాయి.
తెలంగాణ ప్రభుత్వానికి మీ 28 మందే కీలకం కావచ్చుకదా?
ఈ నంబర్ గేమ్‌లో మా ప్రాంతంనుంచే ఆరుగురు సీఎంలు, ఓ రాష్ట్రపతి వచ్చారు. అయినా మా ప్రాంతానికి చేసిందేమీ లేదు. ప్రతిసారి తెలంగాణ ప్రాజెక్టుల కోసం, ఓట్లు సీట్ల కోసం అన్నీ చేసుకున్నారు. అలాగే కోస్తా కూడా. పోయినేడాది అనుకుంటా... శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీన్ని ముట్టుకుంటే ప్రాజెక్టుకే ముప్పు. అయినా కోస్తా నేతలు, రైతుల ఒత్తిడితో కృష్ణా డెల్టాకు డెడ్ స్టోరేజీ నీటిని వదిలారు. కోస్తాలో 122 మంది ఎమ్మెల్యేల బలంతో ఎవరు సీఎంగా ఉన్నా నంబర్ గేమ్‌దే కీలక పాత్ర.
పోతిరెడ్డిపాడును టీఆర్‌ఎస్ వాళ్లు మాత్రమే వ్యతిరేకించారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ మాట్లాడలేదు కదా?
శ్రీశైలంలో 854 అడుగులకు చేరిన తర్వాతే హంద్రి-నీవా, తెలుగుగంగకు గానీ, ఎస్‌ఆర్‌బీసీ, వెలుగోడు రిజర్వాయర్‌కు గానీ నీళ్లు వదలాలని జీవో తెచ్చారు. కానీ టీఆర్‌ఎస్ వ్యతిరేకించి చాలాసార్లు వివాదానికి దిగింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కడియం శ్రీహరిగారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండేవారు. మామూలుగా మనిషి పల్స్‌రేట్ 72. కానీ రాయలసీమ వాళ్ల పల్స్ రేట్ 854. ఎక్కడైనా నన్ను చూస్తే శ్రీహరిగారు నన్ను 854 అని పిలిచే వారు. దురదృష్టం ఏంటంటే రాయలసీమకు గ్రావిటీ ఫ్లో లేదు. బ్రిటిష్‌వారు తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడు మెకంజీ రెండు స్కీములు తయారుచేశారు. తుంగభద్ర నీటిని పెన్నలో కలపడం.. కృష్ణా, పెన్నాను కలిపి కృష్ణా- పెన్నార్ ప్రాజెక్టు కట్టాలనుకున్నారు. ప్రణాళిక సంఘం కూడా ఆమోదించింది. ఈ రెండూ పూర్తయి ఉంటే రాయలసీమలో లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి. కానీ, వీటివల్ల తమిళనాడు బాగుపడుతుందని రాయలసీమ కాదని చెప్పి మా వాళ్లతోనే ఉద్యమా లు చేయించి నాగార్జునసాగర్‌ను కట్టారు.
ఇప్పుడేం చేయాలంటారు? సీమను విడగొట్టాలంటారా?
మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే.. ప్రత్యేక ప్రాంతమైన రాయలసీమను ప్రత్యేకంగా చూడాల్సిందే.
మీరు కర్నూలును రాజధానిని చేయాలంటున్నారా?
నేను చేయమనట్లేదు. శ్రీభాగ్ ఒప్పందం ఒకసారి చూడాలి. దాంట్లో రాయలసీమలో రాజధాని అని ఉంది. అందరూ కలిసి కర్నూలును ఎన్నుకున్నారు. మూడేళ్ల తర్వాత మార్చారు.
సీమ రాజకీయాల్లో జగన్ ముందు వరసలో ఉన్నారు కదా?
ఇంతకుముందంటే వైఎస్... ఆయన కుమారుడు జగన్.. ఇన్నాళ్లూ ఏదో జరిగింది. ఇప్పుడు సీనంతా రాజధాని, రాయలసీమ, ఆత్మగౌరవంపైనే.. ఏమొస్తే సీమ బాగుపడుతుందన్నదే ప్రధానమైంది. అంతేగానీ, జగన్ ముందు వరసలో, చంద్రబాబు రెండో స్థానంలో... వంటివి నమ్మే మాటలు కాదు.
విభజన వాదానికి జగన్ సహకరిస్తున్నారని భావిస్తున్నారా?
జగన్ పైకి సమైక్యం మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆయన పడవ మునిగిపోయింది. ఈ పదమూడు జిల్లాల్లో మనుగడ కోసం సమైక్యమంటే ఓట్లు పడతాయని ఆ దారిపట్టాడు. ఆర్టికల్ 3 ప్రకారం రాషా్ట్రన్ని విడదీయాలని లెటరిచ్చినవాడు.. ఆయన తండ్రి కాంగ్రెస్ మానిఫెస్టోలో తెలంగాణను చేర్చడం, విజయమ్మ పున్నూరులో జై తెలంగాణ అని నినదించి, తెలంగాణ ఇవ్వాలని చెప్పలేదా?
కేంద్రం నిర్ణయం.. సమైక్యవాదం.. మీ సీమ నినాదం ఓట్లు.. సీట్లు కోసమే కదా?
మేం దానికోసం కాదు.. మేమేం పదవుల్లోకొచ్చేది కాదు.
జగన్‌ను దాటిపోతామంటే పదవుల్లోకి వస్తామన్నట్లే కదా?
జగన్ సీఎం పదవిని టార్గెట్ చేస్తున్నారేమో.. లేదా చంద్రబాబు చేస్తున్నారేమో.. మేం 52ఎమ్మెల్యేలు, 8లోక్‌సభ స్థానాల్లో పోటీ చే సేది ముఖ్యమంత్రి అయ్యేందుకు కాదు.
మీరు.. కిరణ్‌తో, బాబుతో సన్నిహితంగా ఉంటారంటారు?
నా నైజమే అదికాదు. చంద్రబాబు మీతో ఆడిస్తున్నారని నాతోనూ అన్నారు. ఆయనో పెద్ద డైరెక్టర్, నేనో యాక్టర్‌ను మరి ఆయనకు సీమలో వేరే హీరోలే లేరా? నా మాదిరిగా నాటకమాడించడానికి. కిరణ్ నాకు పరిచయమున్నవారే. మీరు జర్నలిస్టులుగా ఓ టీముగా ఉన్నప్పుడు, మా ఎమ్మెల్యేలంతా ఓ టీముగా ఏర్పడి క్రికెట్ ఆడినవాళ్లమే. అటువంటి సంబంధమే తప్ప ఆయనతో నేను చేతులు కలిపి కుట్రలు పన్నుతున్నామన్నది లేనేలేదు. సీమలోని వస్తాదులైన బాబు, జగన్, కిరణ్‌ల వల్ల ఈ రోజు మాకొంపలు కూలే పరిస్థితి వచ్చింది. వీళ్లకు సీమలోనే కాదు.. వాళ్ల నియోజకవర్గాల్లోనూ చుక్కెదురు కావాల్సిందే.
ఆంధ్రోళ్లుపోయి లుంగీలోళ్లు వస్తారని వీహెచ్ అంటున్నారు?
వైఎస్ సీఎంగా ఉన్నపుడు నిజంగా కడపకు చెందిన వారు.. ముఖ్యంగా గౌరు వెంకట రెడ్డి, మొద్దు శీను, సూరి వంటి వాళ్లు జైల్లోనే సెటిల్‌మెంట్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. ఎవరెవరు ఇక్కడి లాడ్జిల్లో దిగారో ఒక్కసారి లెక్కలు తీయమనండి. వాళ్లంతా కడప వారే అయి ఉంటారు. ఆయన శిష్యులే ఉంటారు. మా వాళ్లు పది మందికి అన్నం పెట్టేవాళ్లు.
టీడీపీకి ఎందుకు దూరమయ్యారు?
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న సీమను కూడా ప్రస్తావించమని అడిగాను. అయితే, ఇద్దరం కూర్చున్నప్పుడు రాయలసీమ గురించే ఆలోచనచేసే పరిస్థితి లేనట్లు అర్థమై బయటకు వచ్చేశా. వాస్తవానికి టీడీపీ పుట్టేనాటికి నేను అందులో లేను.
కేసీఆర్‌లాగా ఎదగాలని ఆయన్ని కాపీ కొడుతున్నారా?
కాపీ కొట్టాల్సిన పనిలేదు. ఎప్పటికీ బైరెడ్డి బైరెడ్డే. కడుపు మండి ఈ రోజు బయటకు వచ్చాం. అన్నిచోట్లా పోటీ చేస్తాం.
సీమను విడగొట్టొద్దంటారు. విభజిస్తే మొత్తం చేయాలంటారు?
ఇప్పుడు చేసిందదే కదా! రాయలసీమను తెచ్చి కోస్తాలో కలిపారు. ఇన్నాళ్లూ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు సీమాంధ్ర అని నామకరణం చేశారు. అందుకే నేను ఖండిస్తూ వచ్చాను. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడిందనుకుంటే..1956కు ముందున్న ఆంధ్రరాష్ట్రమో, కోస్తాంధ్ర రాష్ట్రమో ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెబుతున్నాను. రాష్ట్రపతికి కూడా అదే చెప్పాను.