నేనెప్పుడూ క్లాసులో కూర్చోలేదు.. సైకిల్ షెడ్‌లో రాజకీయాలు చేసేవాడిని
ABN , First Publish Date - 2020-02-07T18:31:41+05:30 IST
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, కాలేజి లైఫ్‌లో మాంఛి సరదా రాయుడే! ఆయన చదువులో ముందుంటూనే, గ్రూ పులూ మెయింటెన్ చేసేవారు! ‘తొమ్మిదేళ్ల సీఎం’ తొలి రాజకీయాలు..
ఆ రోజుల్లో ఏం చేయాలో అన్నీ చేశాం... చాలా ఎంజాయ్‌బుల్ లైఫ్..
పరీక్షలపుడే చదువు... నేను అందరితో క్లోజ్‌గానే ఉంటా
ఆగస్టు సంక్షోభాన్ని ముందే ఊహించా.... 30 రోజులు గేట్‌మన్‌లా కష్టపడ్డా
ఎన్టీఆర్‌పై తిరుగుబాటు జరగకుండా ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నా..
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో టీడీపీ అధినేత చంద్రబాబు
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే చంద్రబాబు, కాలేజి లైఫ్‌లో మాంఛి సరదా రాయుడే! ఆయన చదువులో ముందుంటూనే, గ్రూ పులూ మెయింటెన్ చేసేవారు! ‘తొమ్మిదేళ్ల సీఎం’ తొలి రాజకీయాలు.. మొదలైందే వర్సిటీ సైకిల్ స్టాండ్‌లో! మహా నటుడు ఎన్టీఆర్‌తో బంధుత్వం, కబురు మోసుకొచ్చింది జయకృష్ణ! పెళ్లిచూపుల్లో భువనేశ్వరితో చంద్రబాబు తన ‘సామాన్య కుటుంబం’ గురించి చెప్పారు! ఇంకా ఎన్నో సంగతులు. ఇప్పటిదాకా ఎవరికీ తెలియని సంగతులు. 16-10-2009న , ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణ నిర్వహించిన ‘ఇన్‌సైడర్’ పేరుతో నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోకు వచ్చి అనేక ప్రశ్నలకు జవాబుగా తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని ఆసక్తికర అంశాలను వివరించారు.
చంద్రబాబు అంటే చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు? ఫీలింగ్స్ కనపడనివ్వరు. ఆయనలో అంతర్ముఖం ఉంటుంది. ఫ్రీగా కనిపించరు... అర్థం కారు... ఇలాంటి భావాలు, అభిప్రాయాలున్నాయి. వాటికి భిన్నంగా ఇప్పుడు మీరు మాట్లాడాలి.. ఇదేంటి చంద్రబాబు కొత్తగా ఉన్నారే..! అని వీక్షకులు అనుకోవాలి..
అంటే నేనిప్పుడు డిఫరెంట్‌గా యాక్ట్ చేయాలన్న మాట?
యాక్ట్ చేయమనడం లేదు.. మనసులోంచి మాట్లాడండి..
ఉత్తినే తమాషాకి అంటున్నా..
మీరు 1985కి ముందుండే వారు చూశారా! అలా ఉండండి.. అంతకంటే వెనక్కి వెళ్దాం.. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ ప్రస్థానం ఎట్లా సాగిందన్నది మాట్లాడుకుందాం... మీ బాల్యం దగ్గరి నుంచి వద్దాం... మీరు సాదాసీదా కుటుంబం నుంచి వచ్చారు. ఆర్థిక పరమైన ఒడిదుడుకులు అధిగమించుకుంటూ వచ్చారు. అసలు మీ స్కూలు రోజులు ఎలా గడిచాయి?
ఒక్కొక్కసారి జీవితం వెనక్కు వెళితే.. ఆ రోజుల గురించి ఒకసారి ఆలోచించుకుంటే.. చాలా ఆసక్తికరమైన సంఘటనలున్నాయి. చాలా మందికి ఉంటాయి కూడా... నేను కూడా ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను... చిన్నప్పుడు ఎలిమెంటరీ పాఠశాలకు పోవాలంటే కిలోమీటరు దూరం నడిచే పరిస్థితి... హైస్కూల్‌కు పోవాలంటే పట్టుదలతో మా ఊరి నుంచి చంద్రగిరికి నడుచుకుంటూ పోవాలి...
ఎన్ని కిలోమీటర్లుంటుంది?
ఐదు కిలోమీటర్లు... మామూలు రోడ్డుంది.. దగ్గరి దారుంది... ఆ దారిలో వంకలు, వాగులు, అడవులు దాటుకుంటూ పోవాలి. అలా వెళ్లి చదువుకోవాలి. అందరు పిల్లలూ అలాగే వెళ్లి చదువుకున్నారు. తర్వాత ఒక సైకిల్ తీసుకుని దానిపై వెళ్లాను. ఇంకా కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి బాగా కాన్‌సంట్రేట్ చేయాలి కాబట్టి... అక్కడే ఉండి.. మా ఇంట్లో ముసలివాళ్లను రూమ్‌కు తీసుకుపోయా. అక్కడే వంట.. అన్నీ..
అదెక్కడ తిరుపతిలోనా...?
కాదు చంద్రగిరిలోనే... టెన్త్ క్లాస్ మాత్రం నేను తిరుపతికి వెళ్లాను. అప్పుడు పీయూసీ ఉండేది. టెన్త్ క్లాస్, లెవెంత్ అక్కడ కంప్లీట్ చేసి... దెన్ ఇంటర్ ఆర్ట్స్ కాలేజ్... సరే స్టూడెంట్ డేస్‌కు వచ్చేటప్పటికి.. ఎప్పుడూ నేనో లీడర్‌గా... ఎస్టాబ్లిష్ కావాలి అని భావించేవాణ్ని.. కాలేజీకి వచ్చేటప్పటికి వేరియస్ యాంగిల్స్‌లో ఒక స్టూడెంట్ లీడర్‌గా ఉండడం... ఈవెన్ డిగ్రీ కాలేజీలో కూడా ఉండేవాడిని... యూనివర్సిటీకి వచ్చేసరికి మోర్ డామినేషన్...
ఎగ్రసివ్‌గా... డైనమిక్‌గా...?
ఆ.. డైనమిక్‌గా.. ఎన్ని ఉండాలో అన్నీ పెంచుకున్నాం...
అంటే మీరు చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారా? స్టూడెంట్ పోలిటిక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారా? యావరేజ్ స్టూడెంటా... మెరిటోరియస్ స్టూడెంటా... మీరు చెప్పిన బ్యాక్ గ్రౌండ్ ప్రకారం న్యాయంగానైౖతే చదువుకు ప్రాధాన్యమివ్వాలి... బట్ మీరు దానికి భిన్నంగా స్టూడెంట్ పాలిటిక్స్‌లోకి వచ్చి నాయకత్వం టేకప్ చేశారు..?
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... యూనివర్సిటీకి వచ్చేసరికి మా డిపార్ట్‌మెంట్‌లో నేను నెంబర్-టు...
అంటే ఎగ్జామినేషన్స్.. మెరిట్ మార్క్స్ ప్రకారమే గదా..
అవును... అయితే నేనెప్పుడూ క్లాసుల్లో కూర్చునేవాడిని కాదు... (నవ్వు...) ఎప్పుడూ సైకిల్ షెడ్డులో కూర్చుని... రాజకీయాలూ... ఇవన్నీ చేసేవాడిని...
సైకిల్ షెడ్డా..?
అవును సైకిల్ షెడ్డే.. క్యాంపస్‌లో.. ఎప్పుడూ క్యాంపస్‌లోనే ఉంటాం కదా... అక్కడి నుంచే స్టూడెంట్ యాక్టివిటీస్... అవీ ఇవీ చేసేవాళ్లం... ఇక నేను ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం 30-40 రోజులు... డే అండ్ నైట్ చదవడం... అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు.. ఎట్ దసేమ్ టైమ్ మిగిలిన సమయంలో యాక్టివ్‌గా ఏమేం చేయాలో అన్నీ చేస్తుంటాం...
అంటే మీరు కచ్చితంగా గ్రూపును మెయింటెయిన్ చేయాల్సి వచ్చేది కదా..
ఇప్పుడులాగా అప్పుడు గ్రూపులుండవు కదా.. అందరం కలిసి చేసేవాళ్లం... షేరింగ్ ఉంటుంది.. పది మంది ఇంపార్టెంట్ లీడర్స్ కలిసి... నేను ముందుండే వాడిని అలా ముందుకు వెళ్లిపోయేవాళ్లం...
రాజకీయ జీవితం కంటే ... క్యాంపస్ జీవితాన్ని గుర్తుచేసుకుంటే.. చాలా హ్యాపీ అన్న మాట..
మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకూ చాలా ఫ్రీగా తిరగడం... అక్కడి నుంచి మనం అనుకున్నది కావాలంటే చేయడం... సాయంత్రమైతే భోంచేసిన తర్వాత టీ కోసం టౌన్‌లోకి పోవడం.. చాలా ఫ్రీగా తిరగడం.. టీ తాగి... గంట రెండు గంటలు హస్కు కొట్టి... తిరిగి రావడం... సాయంత్రమైతే ఒక గంట తిరుపతిలో నడవడం... షాపులు ఇవన్నీ చూడడం...
పొద్దుపోయిన తర్వాత... ఆ రోజుల్లో కాలేజ్ లైఫ్‌లో ఏం చేయాలో అన్నీ చేశారన్న మాట..
ఆ... ఆల్ టుగెదర్ ... ఆ రోజుల్లో ఏం చేయాలో అన్నీ చేశాం... చాలా ఎంజాయ్‌బుల్ లైఫ్..
మరి అప్పటికీ ఇప్పటికీ ఎందుకింత తేడా వచ్చింది. అప్పుడు చాలా చొరవగా, మింగిల్ అయిపోయి ఫ్రీగా కలుపుకొని పోయేవారని చెబుతున్నారు.. కదా....
ఒకసారి జీవితంలో గుర్తుపెట్టుకుంటే... పొజిషన్‌ను బట్టి... కొన్ని కొన్ని అవాయిడబుల్ అవుతాయి.. నేనప్పుడు చాలా ఫ్రీగా తిరుగుతుండే వాడిని... ఎవ్రీ సండే అయితే... అక్కడో డీలక్స్ హోటల్ ఉండేది.. అక్కడకు పోయి... బ్యూటిఫుల్‌గా పాయ, ఇడ్లీ ఉండేది... ఆ డిషెస్ అన్నీ స్పెషల్...
పాయ హైదరాబాద్ ఫేమస్... తిరుపతిలో కూడా ఉండేదన్న మాట...
అవును.. అప్పట్లో తిరుపతిలో కూడా పాయ ఉండేది... కొన్నికొన్ని హోటళ్లలో కొన్ని స్పెషల్స్ బాగుండేవి.. సరే దట్స్ లైఫ్... తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాక కూడా చాలా ఫ్రీగా ఉండేవాడిని.. మీరొకసారి చూస్తే... నేనందరితో క్లోజ్‌గా ఉంటాను.. అందులో సెకెండ్ థాట్ లేదు.. ఆక్యుపేషన్... మనం చేసే పని మీద కొంచెం టైట్ అయినప్పుడు... ప్రెజర్స్ ఉంటాయి కాబట్టి... అంతే తప్ప మరొకటి కాదు.. నేను కింది నుంచి వచ్చాను. రియాలిటీస్ తెలుసు.. ఆటుపోట్లను ఎదుర్కొని వచ్చాను. ఇప్పుడంటే ఏదో సో అండ్ సో అని చెప్పి ఫలానా ఆయన అని గుర్తించగలుగుతారు గానీ అప్పుడు చిన్నప్పుడు అవన్నీ లేవు. అక్కడి నుంచి బిల్డప్ చేశాం.. అయితే నేను జీవితంలో ఏదైనా సరే ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని వచ్చాను. వచ్చింతర్వాత మీరు చూస్తే... దానికి ఏ విధంగా మనిషి ఉండాలి... ఏ విధంగా కష్టపడాలి. డిసిప్లిన్‌గా ఉండాలి.. అవన్నీ పెంచుకుంటూ వచ్చాను. అందుకే నేనీ రోజు ఈ స్థాయికి రావడం గానీ అనుకున్నది సాధించడం గానీ..! కొన్ని కొన్ని సాధించాలంటే కొన్ని త్యాగం చేయాలి. అవి కూడా చేసుకుంటూ వచ్చాం... మీరన్నట్టు కొంతమంది పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు.. సినిమాల్లో కూడా, రాజకీయాల్లో కూడా కొంచెం ఫ్రీగా ఉండవచ్చు.
జనరల్‌గా మీ విషయానికి వచ్చేసరికి రాజశేఖరరెడ్డి రీసెంట్‌గా సీఎంగా పని చేశారు గనక కంపారిజన్ వస్తుంది... ఆయన చాలా ఆప్యాయంగా పలకరిస్తారు... కావలసిన వారికి ఏది కావాలంటే అది చేసి పెడతారు. సో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇమేజ్ అనే చట్రానికి లోబడిపోయి తనవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా.. కనీసం బంధువులను కూడా దగ్గరికి రానివ్వలేదని మీ మీదున్న....
గిట్టని వాళ్లు అనే మాట. ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయింది. మనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది మనం ఏదైనా చేయొచ్చు... ఏంచేసినా జరిగిపోతుంది... ప్రజలను కూడా మభ్యపెట్టి పనులు చేయవచ్చు. అనేది ఒకటి.. ఇక జినైన్‌గా వచ్చినప్పుడు... మనకు ఈ అవకాశం రేర్‌గా వస్తుంది. మనకొచ్చిన అవకాశం వల్ల కొన్ని కోట్ల మంది జనాభా బాగుపడతారు... మన ప్రవర్తనపైన ఉంటుంది.. అనుకున్నప్పుడు ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సి వస్తుంది. అప్పుడు గిట్టని వారు, రానివాళ్లు ఈయన మారిపోయాడు... పనులు చేయడు... అని పనులు కాని స్వార్థపరులంతా ఎక్స్‌పోజ్ అవుతారు. పదవి ఉపయోగించుకుని పది మందికి సహాయం చేసి, చరిత్ర సృష్టించగలిగితే... ఏ విధంగా అయినా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వైఎస్‌ని, నన్ను కంపారిజన్ చేస్తారు.
అవును...
ఎందుకంటే మేమిద్దం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాం.. కలిసి తిరిగాం.. కానీ ఇంకో విధంగా ఆలోచిస్తే... ఎప్పుడూ రాజశేఖరరెడ్డి గారు ఆయన చేసే పనులు గానీ, ఇది ప్రభుత్వం... దీనికో పద్ధతి ఉంటుంది.. దీనికి ఈ మాదిరిగా చేయాలి అని కాకుండా ... ఏది చేసినా జరిగిపోతుంది... అనే యాంగిల్‌లో పోయారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
అంటే మీరు ఆయన మోడల్‌ను ఇప్పటికీ ఆమోదించరన్నమాట...
కరెక్ట్ కాదు... ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు.. ఒక పక్క క్రమశిక్షణను... ఇంకోపక్క ప్రజాధనాన్ని, సమస్యలను పరిష్కరించడంలో ఫెయిర్‌నెస్ ఉండాలి.. లేకపోతే కరెక్ట్ కాదు.
సాధారణ జీవితం నుంచి అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు కదా... ఈ ప్రాసెస్‌లో ఎంతో మంది మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు సహాయపడినా మీరు వారికి ఉపయోగపడతారనే భావన వారిలో ఎంతో కొంత ఉండవచ్చు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి కాబట్టి సహజంగానే అలా అనుకుంటారు. సో మీకు ఉపయోగపడిన వారికి మీరు ఉపయోగపడలేదనేది మీమీదున్న ముఖ్యమైన ఆరోపణ...
రాజకీయాల్లో ఒకటుంది... ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎవరి జీవితంలోనైనా పైకి రావడానికి చాలా మంది ఉపయోగపడతారు... ఇప్పుడు ఎన్టీరామారావుగారున్నారు... మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరుకు ట్రైన్ మీద పోయి, చదువుకొని మళ్లీ రాత్రి విజయవాడకు వచ్చేవారు. ఆ విధంగా చాలా కష్టపడి పైకి వచ్చారు. తర్వాత సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు కూడా కొన్ని లక్షల మంది సహకరించారు. అందరూ సపోర్టు చేశారు కాబట్టి వచ్చారు. ఆయనే కాదు గాంధీని తీసుకోండి... ఎవరైనా సరే ఎంతో మంది సహకరిస్తే తప్ప ఆ స్థాయికి రావడం వీలు కాదు... వచ్చిన తర్వాత తేడా ఏంటంటే కొంత మంది క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ పది మందికి ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తారు... కొంత మంది తన చుట్టూ ఉన్న వాళ్లకు ఉపయోగపడి వాళ్లను పెంచుకుని... తద్వారా శాశ్వతంగా అధికారంలోకి ఉండటానికి ప్రయత్నిస్తారు.
నాకున్న అవగాహన ప్రకారం... మీరు పది మందితో మాట్లాడి మీరు నమ్మే వారితో ఇంటరాక్ట్ అయి, ఫైనల్‌గా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 1999లో అధికారంలోకి వచ్చాక కీర్తి కండూతికి లోబడిపోయి... అందరికీ దూరం అయిపోరన్నది ప్రధాన సమస్య కదా... పార్టీలో వారికి కూడా...
అందులో తప్పేం లేదు... హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్... నేను కూడా రాత్రికి రాత్రే రాష్ట్రం బాగుపడిపోవాలి... ప్రజలు బాగుపడిపోతారు... తర్వాత సంపదొస్తే పేదరికం వెళ్లిపోతుంది అనుకున్నాను. దానివల్ల నా పేరు శాశ్వతంగా ఉంటుందన్న ఉద్దేశంతో రాత్రింబవళ్లు పనిచేశాను. ఈ క్రమంలో నాకెవరైనా సహకరించకపోతే.. వాళ్లకేం తెలియదులే వీళ్లు అడ్డం పడుతున్నారు... ఎక్స్‌క్యూజ్ చేసుకుంటున్నారు... (నవ్వులు) అని అనుకుంటూ నేను ముందుకు వెళ్లిపోయాను... చివరకు ఏమైందంటే నా మీద అభిమానం వల్ల బయటపడలేక విత్‌డ్రా అయిపోయారు...
ఎందుకంటే మీరు వినడం మానేశారు కదా అపట్లో...!
వినడం మానేశారని వారు విడిచిపోయారు... ఇక్కడ ఎడ్వాంటేజెస్ ఉన్నాయి. డిజడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి రాష్ట్రం బాగుపడింది. ఆ రోజు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గానీ, ప్రాజెక్టులు గానీ, నిర్ణయాలు గానీ ఈరోజు రాషా్ట్రన్ని నిలబెట్టాయి. అదే కొనసాగి ఉంటే ఆ పనులు పూర్తయ్యేవి... ఇంకా మంచిగా చేసేవాళ్లం. తప్పులు తక్కువ జరిగేవి. నా జీవితంలో నేననుకున్నదంతా చేసుకుంటూ వచ్చాను. ఏదైనా సరే పద్ధతి ప్రకారం కేరక్టర్ మెయింటెన్ చేస్తూ వచ్చాను. డబ్బులు కోసమో, దేనికోసమో ఆలోచించలేదు. ఎప్పుడైనా పది మందిని కూర్చోబెట్టి, టీమ్‌ను మోటివేట్ చేసుకుంటూ ఉండిపోయేవాడిని. అయితే, అప్పుడు మిస్ అయిన దానివల్ల సంపద సృష్టించాం... కానీ ఏదైనా ప్రజలు, నాయకుల అంచనాల ప్రకారం కలిసి పోలేకపోయినందుకు ఎన్నికల్లో ఇబ్బంది వచ్చింది.
ప్రజలకు, నాయకులకూ దూరం అయ్యారు... ఇంప్రాక్టికల్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నారన్నది నా ఉద్దేశం.
కాదు... ప్రాక్టికల్... స్టెప్ బై స్టెప్ పోవడంలో పొరపాటైంది.
ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు...
ఎస్... అట్లా వెళ్లి చేయాలనుకున్నాం... కానీ పనులయ్యాయి...
ఉదాహరణకు విద్యుత్ చార్జీలు... ఆరోజు అసాధారణంగా పెంచేశారు. అది ఇప్పటికీ మీకు హ్యాంగ్ అవుతూనే ఉంది...
నేనప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు పెంచినా... తర్వాత అసలు పెంచబోమని చెప్పాను. సామర్థ్యం పెరుగుతుంది. తర్వాత చార్జీలు తగ్గిస్తామన్నాను. నేను సీఎం అయ్యేసరికి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. దానికి ప్రజలు మద్దతిచ్చారు. ఆ తర్వాత నేను చేసినది ప్రజలకు చేరవేయడంలో లోపం జరిగింది. అక్కడ ఇంప్రాక్టికల్ అయింది..
తర్వాత తగ్గిస్తామని అన్నారు. అయితే, కొంచెం కొంచెం కాకుండా.. ఒకేసారి నడ్డివిరిగేంత బరువు వేశారు... దానివల్ల అంత రియాక్షన్ వచ్చి...
నో అది కూడా కాదు... ఒక్క సారే పెంచాం...
అదికూడా అసాధారణంగా పెంచారు..
కాదు... 25-30 శాతమే పెంచాం. అప్పటికే ఎఫిషియెన్సీ లెవెల్ పెరిగింది. గ్రాంట్ గానీ, సంస్కరణలు గానీ తీసుకొచ్చాం... దాని వల్ల చాలావరకు బాలెన్స్ అయింది... అన్నింటి కంటే ముఖ్యంగా రైతులు ఇబ్బందిలో ఉండటం, చార్జీలు చెల్లించే పరిస్థితిలో లేకపోవడం.. అలాంటప్పుడు నేను కూడా కొంచెం మార్చుకుని, వారిని ఆదుకోవడం చేయాల్సింది... అది చేయలేదు... అక్కడ ఇబ్బందులు పడ్డాం.
సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి పాలిటిక్స్ చేసేవారు... సైకిల్‌పార్టీ నాయకత్వంలోకి వచ్చారు. కాలేజీ రోజల్లో స్టూడెంట్స్ యూనియన్ గొడవలుండేవా?
చాలాసార్లు! అప్పుడు ఎస్‌ఎఫ్‌ఐ.. కాంగ్రెస్ ఉండేవి. అప్పుడు మాకు కూడా పెద్ద సన్నివేశం ఉండేది. గొడవలు ఉండేవి. హాస్టళ్లలో రాత్రిళ్లు గొడవలుండేవి. మావాళ్ల పేర్లు ఇపుడు వద్దు లెండి.. మళ్లీ ఇబ్బందులొస్తాయి. నేను ఎప్పుడూ కొట్టలేదు.. దెబ్బలు తినలేదు. లీడర్ ఎప్పుడూ ముందుండాల్సిన అవసరం లేదుకదా. మా మీద కేసులు పెట్టారు. మైనర్ కేసు కొట్టేశారు. కోర్టుకు కూడా ఎప్పుడూ పోలేదు. స్టూడెంట్ లీడర్‌గా ఎన్ని చేయాలో అన్నీ చేశాను.
ఏ స్టూడెంట్ జీవితంలోనైనా చాలా సరదాలుంటాయి. ముఖ్యంగా డిగ్రీలో టీజింగ్ ఉంటుంది. అలాంటిదెప్పుడైనా మీ అనుభవంలోకి వచ్చిందా?
ఈవాళ చాలా ఫ్రీగా, యాక్టివ్‌గా ఉన్నాను. మదనపల్లి నుంచి ఒకమ్మాయి వచ్చింది. వన్‌టు వన్ మాట్లాడాం. ట్రస్టు యాక్టివిటీస్, తదితరాలు మాట్లాడాం. ఆమె పరిచయం చేసుకుని... చెప్పారు. మీరు యూనివర్సిటీలో చాలా అల్లరిగా ఉండేవారు. మోటారుబైకు మీద రావడం, సైలెన్సర్ తీసేసి నడపడం, అలా చేసేవారు. చాలా అసహ్యించుకునే వాళ్లం మేము అంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది.
ఈ చర్యల వల్ల ఆడపిల్లలు దూరమయ్యారా? ఫాలోయింగ్ ఉండేదా?
అదేం లేదు. దూరం కాదు... ఫాలోయింగ్ ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేవారు. గర్ల్‌ఫ్రెండ్స్‌లా ఉండేవారు. నేను అందరితో ఫ్రీగా తిరిగేవాడిని. రెస్పెక్ట్ ఉండేది.
మీరు ఎప్పుడైనా ఎవరికైనా లవ్ లెటర్ రాశారా? పేర్లు అడగను. కనీసం రూంలో కూర్చునైనా రాశారా?
లేదు. ఇష్టాలు, అయిష్టాలు ఉండేవి కానీ, అంతవరకు రాలేదు. నాకు ఎవరూ రాయలేదు కూడా. అవి ఎప్పుడూ లైఫ్‌లో ఎదురుకాలేదు.
అసలు ఎలా సాధ్యమైంది? భువనేశ్వరిగారు అపార్థం చేసుకోరు. నేను హామీ ఇస్తాను
అలాంటివి చాలా ఉండచ్చు. మా మిసెస్‌కి చెప్పక్కర్లేదు. మేమిద్దరం ఓపెన్‌గానే ఉంటాము. కానీ చిన్నచిన్నవి చాలా ఉన్నాయి. కాలేజీ రోజుల్లో గ్రూపు పాలిటిక్స్ ఇష్టపడేవాళ్లు ఉంటారు, ఇష్టపడనివాళ్లు ఉంటారు. కాస్త చదువుమీదే ధ్యాస పెట్టేవారు.
మీరు చదివింది సెవెంటీస్‌లోనా?
70-74 ఎంఏ. తర్వాత రీసెర్చి స్కాలర్‌గా ఉన్నాను. ఆ టైంలోనే ఇదంతా జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి డైరెక్ట్‌గా పోటీచేసి ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు నా నియోజకవర్గం చాలా బలహీనం. చిత్తూరు జిల్లాలో జనతా ప్రభావం ఉండేది. మూడు చోట్ల పార్లమెంటులో మైనస్ వస్తే, వాటిలో చంద్రగిరి ఒకటి. మిగిలిన రెండింటిలో అసెంబ్లీలో జనతా నెగ్గితే, చంద్రగిరిలో మాత్రం నేను గెలిచాను.
మీరు వ్యక్తిగత జీవితంలో చాలా నిబంధనలు పెట్టుకుంటారు కదా.. స్టూడెంట్ డేస్‌లో మందుకొట్టాల్సిందే. మీకూ అలాంటివి అబ్బాయా? ఇలాంటివి ఎప్పుడు మానేశారు?
నేను ఎంత ఫ్రీగా ఉన్నానో.. అంత బాధ్యత ఉండేది. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యానో.. అన్నీ ఆగిపోయాయి. అంతకుముందు స్టూడెంట్‌డేస్‌లో మీరు అంటున్నట్లు హేపీగా ఉండేవాడిని. అన్నీ ఉండేవి. ఒక రాజకీయ నాయకుడిగా అయిన తర్వాత నాకు కొంత డిసిప్లిన్ అలవాటు పడింది. అన్నీ రిసి్ట్రక్షన్స్. తర్వాత పెళ్లి.. ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్‌తో ముందుకెళ్లా.
భువనేశ్వరి గారితో పెళ్లి ప్రతిపాదనను మొట్టమొదట తెచ్చింది ఎవరు?
నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండగా, ఎన్టీఆర్ గారంటే ఇష్టం. ఓసారి ఆయన్ని కలవాలనిపించి... కలిశాను. అపుడు ఎగ్జిబిటర్‌గా జయకృష్ణ ఉండేవారు. మేమిద్దరం మాట్లాడుతుండగా ఆయన్ని అడిగి, ఎన్టీఆర్‌ని కలిశాను. అనురాగదేవత షూటింగ్‌లో ఎన్టీఆర్-శ్రీదేవి పెళ్లి సీనులో ఆయన్ని చూశాను. ఓ గంట నాతో మాట్లాడారు. అప్పటినుంచి సంబంధాలు పెరిగాయి. నాకు ఆయనంటే గౌరవం, ఆయనకి.. ఈ యంగ్‌స్టర్ బాగున్నాడు, బాగా చేస్తున్నాడని ఇష్టం. ఎవరినైనా అంచనా వేయడంలో ఎన్టీఆర్ చాలా కాలిక్యులేటెడ్‌గా ఉండేవారు. ఒకరోజు జయకృష్ణ వచ్చి, మా నాన్నగారు మీకు చెప్పమన్నారు.. మీరు ఓకే అంటే మా సోదరిని మీకిచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పారు. దాంతో ఆలోచించుకున్నాను.
అలా ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది?
నాలుగైదు రోజులు ఆలోచించాలి కదా.. తల్లిదండ్రులతో మాట్లాడాలి... వెంటనే చెప్పలేం. మగపెళ్లి కొడుకుని గనక కాస్త బెట్టు చేయాలి.(సరదాగా నవ్వుతూ) అదేం లేదుగానీ, అందర్నీ కన్సల్ట్ చేశాం.
పెళ్లి చూపులు ఎక్కడయ్యాయి?
మద్రాసులో మా పెళ్లి అయ్యింది. ఎన్టీఆర్ ప్రముఖ నటుడు. నేను మంత్రిని. దాంతో పెళ్లికి జిల్లాలో అందరికీ శుభలేఖలు పంపాను. దాంతో చె న్నై దగ్గర కాబట్టి, మొత్తం అంతా తరలి వచ్చారు. పెళ్లి చూపులప్పుడు, పెళ్లికి పెద్దాయన చాలా గౌరవంగా చూశారు. నేను వెళ్లేసరికి పెద్ద దండ తీసుకొచ్చారు. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కేబినెట్ అంతా వచ్చారు. అంజయ్య, ఎంజీఆర్, సినిమావాళ్లు అంతా వచ్చారు. పెద్ద హంగామా అయిపోయింది. అందరూ చూశారు. కానీ, జనం రద్దీ ఎక్కువ కావడంతో అందర్నీ తోసేశారు. అలా మా నాన్నగారిని కూడా తోసేశారు. మళ్లీ పెద్దాయన వెళ్లి అపాలజీ చెప్పి తీసుకొచ్చారు.
పెళ్లి చూపుల్లో మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు?
నేను రెండుమూడు విషయాలు చెప్పాను. మాది సామాన్య కుటుంబం. మంత్రిపదవి శాశ్వతం కాదు. మళ్లీ పల్లెకు వెళ్లాల్సి వస్తుంది. దానికి మానసికంగా సిద్ధమైతే పెళ్లి చేసుకుందామన్నాను. దానికి భువనేశ్వరి అంగీకరించడంతో మా పెళ్లి అయింది. మా భవిష్యత్తు గురించి కూడా ఐదు-పది నిముషాలు మాట్లాడాను. ఎంతసేపో సరిగ్గా గుర్తులేదు. మళ్లీ తర్వాత పెళ్లి వరకు (సుమారు రెండు నెలలు) కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు. చాలా మిస్సయ్యం. మాట్లాడాలనిపించినా, బాగుండదేమో అనిపించేది.
కాలేజి నుంచి అప్పుడే వచ్చారు.. ఆ వేడి ఉంటుంది కదా..!
ఆఁ.. కుటుంబం, అవన్నీ అడ్డు వస్తాయి.
పెళ్లి తర్వాత మీరు-ఎన్టీఆర్ గారు ఎలాంటి విషయాల్లో విభేదించేవారు?
అన్ని ఇళ్లలోనూ ఇవి ఉంటాయనుకుంటా. నాకు, మా శ్రీమతికి టైం మేనేజ్‌మెంట్‌లో గొడవ వచ్చేది. ఆమెకు డబ్బు, బంగారం, అధికారం అవేవీ పట్టవు. ఢిల్లీలో సునీల్‌మిత్రా అని ఉన్నారు. వాళ్ల తండ్రి మంత్రి. ఎప్పుడూ మీ నాన్నగారు నాకు సమయం ఇవ్వలేదని వాళ్ల మదర్ ఆయనతో చెప్పారు. దాంతో ఆయన రాజకీయాలు వదిలిపెట్టి పారిశ్రామిక రంగంలోకి వెళ్లి విజయం సాధించారు. అలా నేను మా మిసెస్ గురించి చాలా ఆలోచించాను. ఆమె కనీసం రోజూ ఓ అరగంట గడపమని కోరేది. అంతకంటే ఎప్పుడూ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలాసార్లు ఆమె బర్త్‌డే కూడా నేను మర్చిపోయేవాడిని. వస్తానని చెప్పి, మూడు నాలుగు గంటలు ఆలస్యంగా వెళ్లేవాడిని. ఈ 30 ఏళ్లలో నేను విస్మరించింది కుటుంబాన్ని, బంధువులను. ప్రజాజీవితంలో ఏదో చేయాలనే ఉద్దేశం ఉండేది. బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని సాధ్యం కావు. మన సమస్యలు ఎదుటివారికి అర్థం కావు.
ఆమె పుట్టిన రోజును ఇన్నేళ్లలో మీరు ఎప్పుడూ కనీసం ఎక్కడైనా రాసుకోవడం అలా చేయలేదా? అందుకు మీకు గిల్టీ అనిపించలేదా?
యూ ఆర్ రైట్. అలా చేసి ఉండాల్సింది. చాలాసార్లు మిస్సయ్యాను. మా ఇద్దరిలో ఓ అవగాహన ఉంది. ఆమె చాలా అడ్జస్టయిపోతుంది. నా దగ్గర నుంచి కూడా ఆ చొరవ ఉంటుంది. ఇద్దరం కూడా తప్పు చేసినట్లు రియలైజ్ అవుతాం.
మీరు ఒక్కఅబ్బాయితోనే ఎందుకు సరిపెట్టుకున్నారు?
ఎందుకోగానీ, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఒకరైతే సరిపోతుంది అనిపించింది. మా శ్రీమతి కూడా అలాగే భావించింది. మా నాన్నగారుకూడా తృప్తి చెందారు. మా అత్తగారు మాత్రం కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారుగానీ మేం వినలేదు.
లోకేష్‌కి బాలకృష్ణ కుమార్తెను ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది?
నాకు మా అబ్బాయిని మంచి పౌరుడిగా చేయాలని కోరిక. అతడిపై మా శ్రీమతి ఎక్కువ టైం కేటాయించారు. డిగ్రీ కోసం అమెరికా పంపాం. తర్వాత ఇక్కడ నాకుండే సంబంధాలు, అతడి సామర్థ్యంతో స్టాన్‌ఫోర్డ్‌లో సీటొచ్చింది. తర్వాత నాకు అతడి పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. నాకు ఆలోచనవచ్చి, మా శ్రీమతితో తర్వాత మా అబ్బాయితో చర్చించాను. అందరం ఓకే అనుకున్నాక బాలకృష్ణను కదిపాను. ఆ అమ్మాయి చదువుకోవాలని చెప్పడంతో కన్విన్స్ చేయడానికి కాస్త సమయం పట్టింది.
మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులెవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు?
చిన్నప్పటి నుంచి చాలామంది స్నేహితులుండేవారు. ఎప్పుడూ ఒకరిద్దరిపైనే డిపెండ్ కావడాన్ని నేను మొదట్నుంచీ అలవాటు చేసుకోలేదు. వ్యక్తిగత సంతోషాలు, విజయాలు, అపజయాలు లాంటి విషయాలను కుటుంబంతో చర్చించేవాడిని. ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా.. ప్రజా జీవితంలో ఏదైనా చెప్పినా దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటా. పది మందితో కలిసి పనిచేయడం, ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించడం, విజువలైజ్ చేయడం, ప్రణాళిక చేసుకోవడం అలవాటు. అయినా కొన్నిసార్లు సమస్యలొస్తాయి. ఆగస్టు సంక్షోభం వస్తుందని నాకు ముందే అనిపించింది. పొద్దున్న వస్తూనే రామకృష్ణ స్టూడియో సిద్ధం చేసి ఉంచాలని చెప్పాను. అమెరికా నుంచి వస్తున్న ఎన్టీఆర్‌ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాం. అక్కడి పరిణామాలు చూస్తే ఏదో జరగబోతోందని అనిపించింది. సాయంత్రం ఆరు నుంచి తిరుగుబాట్లు మొదలయ్యాయి. మూడు నాలుగు గంటల్లోనే నేను అందర్నీ మొబిలైజ్ చేశాను. పొద్దున్న లేచాక ఆయనకు విషయం చెప్పాను.
ఆ తర్వాత ఎన్టీఆర్‌పై మీరు తిరుగుబాటు చేయడంపై ఇప్పటికీ ప్రజలకు కొన్ని అనుమానాలున్నాయి!
జరిగిందేమిటో అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి మళ్లీ పోస్టుమార్టం కరెక్టు కాదు. ఎన్టీఆర్ నన్ను ఇష్టపడినంతగా ఎవరినీ ఇష్టపడేవారు కాదు. 85లో నేను పోటీ చేయడం కన్నా.. ఆయన్ని గెలిపించడం ముఖ్యం అనిపించింది. కాంగ్రెస్ నామీద లేనిపోని ఆరోపణలు చేయడం, నేను డిఫెన్స్‌లో ఉండటం వల్ల 89లో పోటీ చేయాల్సి వచ్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్యే అవడం వల్ల అసెంబ్లీలో ఉపయోగపడ్డాను. అది నన్ను నేను బిల్డప్ చేసుకోడానికీ ఉపయోగపడింది. తమాషా ఏమిటంటే.. ఆగస్టు సంక్షోభం కంటే ముందు ఎంత పనిచేశానో, అందులో కొంతే 89-94లో పనిచేశాను. ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసిన కృషి అప్పుడు ఉపయోగపడింది. ఎన్నో త్యాగాలు చేసి, 30 రోజులు రామకృష్ణ స్టూడియోస్‌లోనే ముఖం కడుక్కుని, గేట్‌మన్‌లాగా కష్టపడ్డాను. తర్వాత పేరు వచ్చినా.. అప్పుడు వచ్చినంత రాలేదు. తర్వాత ఇన్ని చేసినా నేను 94లో లోపలే ఉండిపోయేందుకు ప్రిఫర్ చేశా. ఆ రోజు నేను ఆ పని చేయకపోతే పార్టీ ఈ రోజు ఈ స్థితిలో ఉండేది కాదు.. అది చరిత్ర. కానీ ఆ రోజు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు జరగకుండా ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నా.
ఆ సంఘటన జరిగినప్పుడు మీ శ్రీమతి రియాక్షన్ ఏమిటి?
ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కూడా ఆయనకు నచ్చజెప్పడానికి చివరి వరకు ప్రయత్నించాను. కానీ కన్విన్స్ కాలేదు. ఆయన కూడా భార్య ఎప్పుడూ భర్తతోనే ఉండాలని చెప్పేవారు. ఆమె కూడా సర్దిచెప్పుకొన్నారు.
మీరు రైతు వ్యతిరేకి అనే ముద్ర తెచ్చుకున్నారు...
కొంతమంది నాపై ఆ ముద్ర వేశారు. కావాలని పదేపదే నా మీద అలాంటి ప్రచారం చేశారు. అందులో వాళ్లు కొంతవరకు విజయం కూడా సాధించి ఉండొచ్చు. కానీ నేను పుట్టిందే రైతు కుటుంబంలో.
కరెక్టే.. రైతు కుటుంబమే. మళ్లీ కాస్త వెనక్కి వెళ్దాం. మీకు నాగలి లాంటివి దున్నడం వచ్చా?
వచ్చు. నాగలి దున్నాను.. మా నాన్నగారితో కలిసి వ్యవసాయ పనులు కూడా చేశాను. రాత్రిళ్లు పొలాల్లో పడుకున్నాను. మా ఊరికి దూరంగా నీళ్లు ఉంటే ఊరి కోసం పైపులు వేయించి, కనెక్షన్లు ఇప్పించాను.
2004లో మీరు ఓడిపోయారు. ఆ తర్వాత కూడా మీరు కనీసం పార్టీ విధానాన్ని సమీక్షించుకుని పశ్చాత్తాప ప్రకటన చేయడం లాంటివేమీ చేయలేదు...
నేనేమంటానంటే.. సరైన సమయంలో బ్యాలెన్స్ చేయడంలో తప్పు జరిగింది.
ఆ ఒక్క ప్రకటన చేయకపోవడం వల్ల 2009లో కూడా ఓడిపోయారు...
అది కరెక్ట్ కాదు.. మా ప్రయరిటీలో తప్పులున్నాయని చాలాసార్లు చెప్పాను. మొదటిసారే కాదు.. సమీక్షించుకునేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పాం.
మీరు బయట ఎంత పాపులర్ అయితే లోపల అంత అన్‌పాపులర్ అవుతారు. సీఎంగా ఉన్నపుడు మిమ్మల్ని దగ్గరగా పరిశీలించాను. సామాన్య వర్గాలను వదిలేసి, ఉన్నత వర్గాల వైపే చూస్తూ ఉండిపోయారు?
సమన్వయం సాధించడంలో, ఎప్పటికప్పుడు ఏకాభిప్రాయం నెలకొల్పడంలో దెబ్బతిన్నాం. ఆ రెండూ చేసుకుని ఉంటే ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేది. రాష్ట్రం నష్టపోయిందనేదే నా బాధంతా!
రైతు వ్యతిరేకి అన్న ముద్రతో పాటు విశ్వసనీయత లేదన్న ముద్ర కూడా మీపై ఉంది. ముఖ్యంగా వైఎస్ జీవించి ఉన్నంతకాలం మీ విశ్వసనీయతనే ఎన్నికల సమయంలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రెండింటి నుంచి బయటపడటానికి ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారా?
ఇందులో రెండు విషయాలున్నాయి. కొంతమంది వ్యక్తులు తాము చేసే తప్పులు కవర్ చేసుకోడానికి అవతలి వాళ్ల మీద బురద చల్లుతారు. అదే జరిగింది. వైఎస్ చేసిన తప్పులను మేం ఎత్తి చూపించి, వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తుంటే.. ఆయన మామీద గురిపెట్టి, అది చేశారు, ఇది చేశారంటూ వ్యవస్థనే దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ప్రజల్లో దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే దాంతోపాటు.. అసలు మనం చేసే పని సరైనదేనా కాదా అనేది కూడా చాలా ముఖ్యం. ఈ విషయాల్లో తప్పనిసరిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను చెప్పేది నిజంగా చెబుతున్నానా.. రాజకీయంగా చెబుతున్నానా అనేది చూసుకోవాలి. నిజంగా చెబితే దాన్ని ఫాలో అప్ చేసుకుని లాజికల్‌గా ఓ కన్‌క్లూజన్‌కు రావాలి.
మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకోసారి సంస్కరణల జోలికి వెళతారా?
సంస్కరణలు తప్పనిసరి. కమ్యూనిస్టులు కూడా సంస్కరణల వెంట పోతున్నారు. అమల్లోనే లోపాలు. సంస్కరణలు పీవీ హయాంలో స్టార్ట్ అయ్యాయి. నేను సీఎంఅయ్యాకచురుకందుకున్నాయి. పోర్టులు,ఎయిర్ పోర్టులు..తదితరాలన్నీ వచ్చాయి. రిఫార్మ్స్‌అంటే సమర్థత పెంచడం. వచ్చిన దానిని పేదవాళ్లకు ఇవ్వడం.
ప్రత్యేక తెలంగాణకు ఇప్పుడూ కట్టుబడి ఉన్నారా?
రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితిలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులకు అనుగుణంగా మారాలి. లేకపోతే మనల్నే మార్చేస్తారు. ఒకోసారి ప్రజల అవసరాల కోసం మారాలి. ప్రజా జీవితంలో ఉండే నాలాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. మేం ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల తర్వాత పునరాలోచించే పరిస్థితి రాలేదు. ఆ ఆలోచన రాలేదు.
అప్రస్తుతం అంటారా..?
తెలంగాణ అప్రస్తుతం కాదు. రివ్యూ చేయడాన్ని ఇప్పుడే ఆలోచించం. ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం రాలేదు. పొత్తుల్లో చాలా జరిగాయి. అందరం కలిసి పనిచేశాం. ఫలితాలు రాలేదు.
వ్యక్తిగతంగా మీ అభిప్రాయం చెప్పండి.. తెలంగాణ వస్తుందా?
నేను ఇప్పుడు మాట్లాడను. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీలైనంత వరకు వ్యక్తిగత అభిప్రాయం ఉండకూడదు. నేనో మాట చెబితే అదే నా అభిప్రాయమని మా పార్టీవాళ్లు అనుకుంటారు.
మళ్లీ మీరు అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయా?
పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశంగా చూస్తున్నాం.
నారా వారి వారసుడు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు?
హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో పనిచేశారు. మా అబ్బాయి బిజినెస్‌లో ఉన్నాడు. అవసరమైనప్పుడు.. ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో చాలావరకు సహాయపడ్డాడు. నేను వ్యాపారం చేస్తాను. నేనంటూ ప్రూవ్ చేసుకోవాలి. అన్నది అతడి అభిప్రాయం. వుయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్! ఎప్పుడొస్తాడో చెప్పలేను. అతను వస్తాడా రాడా అని కూడా నేను ఊహించి చెప్పలేను. నేనైతే ఒత్తిడి చేయడం లేదు.
వైఎస్- మీరు ఫ్రెండ్స్ అని ఓసారి చెప్పారు. మీ ఇద్దరికీ ఎక్కడ విభేదాలు వచ్చాయి?
వ్యక్తిగతంగా మాకు విభేదాలు లేవు. ఇద్దరం కాంగ్రెస్‌లో చేరాం. తర్వాత నేను టీడీపీలోకి రావడం, అతను కాంగ్రెస్‌లో ఉండడం.. అప్పటి నుంచి పబ్లిక్‌లో ఒకళ్లనొకళ్లు మాటా మాటా అనుకోవడం ఆరంభమైంది. పొలిటికల్‌గా డిఫర్ అయ్యాం. అతను వ్యక్తిగతంగా వెళ్లాడు. అయినా ఎప్పుడూ అతనిపై వ్యక్తిగతంగా వెళ్లలేదు. అతను మాత్రం అధికారం రాగానే వ్యక్తిగతంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని విఫలయత్నం చేశాడు.
ఒకప్పుడు మీరో పుస్తకం రాశారు. అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు రాశారు...
వాళ్ల గురించి చాలా తక్కువ మాట్లాడితే సరిపోతుంది. ఐ డోండ్ వాంట్ టు కామెంట్.
మీరు ఇంత వరకు ఎవరితో షేర్ చేసుకోని దానిని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో షేర్ చేసుకోండి. దాని ద్వారా ఒక కొత్త చంద్రబాబుని చూడాలి..
మనిషి జీవితానికి సార్థకత ఉండాలి. గాంధీ చనిపోయి ఇన్నేళ్లయినా గుర్తుపెట్టుకుంటున్నాం. ఇందుకు ఆయన ఆచరించిన విధానాలే కారణం. ఎన్టీఆర్‌ది కూడా అదే కాన్సెప్ట్. నా జీవితాశయం ఒకటే.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రజలు నన్ను పాజిటివ్‌గా గుర్తుపెట్టుకోవాలి. అందుకు శాశ్వతంగా నేను చేయగలిగింది ఏమిటనేది ఆలోచిస్తున్నా. అది చేయాలన్నది నా సంకల్పం. కొంత వరకు అయినా సక్సెస్ అవుతాను!!