ఎన్టీఆర్‌ను దించేసిన చంద్రబాబుపై కోపంతోనే టీడీపీని వీడా..

ABN , First Publish Date - 2020-02-07T19:53:35+05:30 IST

దేవినేని నెహ్రూ పేరు వినగానే బెజవాడ రాజకీయం గుర్తుకొస్తుంది. వర్గపోరు కళ్లముందు ప్రత్యక్షమవుతుంది..

ఎన్టీఆర్‌ను దించేసిన చంద్రబాబుపై కోపంతోనే టీడీపీని వీడా..

ఎన్టీఆర్‌దీ నాదీ తండ్రీ కోడుకుల అనుబంధం

బెజవాడలో ఉద్రిక్తతలు లేవు

ఆ వర్గానికి ఎన్ని చేసినా ఓడించారు

లక్ష్మీ పార్వతి డబ్బులు వెనక్కి తిరిగిచ్చేశా

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో దేవినేని నెహ్రూ


దేవినేని నెహ్రూ పేరు వినగానే బెజవాడ రాజకీయం గుర్తుకొస్తుంది. వర్గపోరు కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. టీడీపీతో రాజకీయంగా వెలుగులోకొచ్చిన నెహ్రూ, ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ పాత బెజవాడ నెహ్రూగా వార్తల్లోకొచ్చారు. ఈ పరిణామం తాత్కాలికమేనా? లేక పాత బెజవాడ నివురుగప్పిన నిప్పా? ఈ విషయంపై దేవినేని నెహ్రూ.. 28-06-2010న జరిగిన ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో సమాధానమిచ్చారు. ఆ వివరాలు...


1989లో టీడీపీ ఓటమికి మీరు కారణమన్నారు. ఇప్పుడు మీకు అదే పార్టీ ప్రధాన ప్రత్యర్థి. ఎందుకిలా?

నాకు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీ. ఎన్టీఆర్‌ నన్ను 1994 వరకు ప్రమోట్‌ చేసుకుంటూ వచ్చారు. ఆయనది నాది తండ్రీకొడుకుల అనుబంధం. చంద్రబాబుతో కలవకూడదనే నేను కాంగ్రెస్‌లో చేరాను. వైశ్రాయ్‌ ఘటన జరిగినప్పుడు ఆయన మీద చెప్పులు పడితే చాలా బాధ వేసింది. నేను, పరిటాల రవి వ్యాన్‌నుంచి దిగి వెళ్లాం. పోలీసులు అడ్డం పడ్డారు. ఆయన దిగగానే.. ‘ఎన్టీ రామారావు చచ్చిపోయాడు’ అన్నారు. (మాట రాక.. ఏడుస్తూ కళ్లు తుడుచుకున్నారు) తర్వాత ఓ రోజు నన్ను రమ్మని, తినడానికి ఏం తెస్తున్నావని అడిగితే చేపలు వండించి తీసుకెళ్లాను. ఆప్యాయంగా తిన్నారు. ఆ తర్వాతే మరణించారు. ఆయన చివరి రోజులు చూశాక, సైలెంట్‌గా ఉండాలనుకున్నాను. నాపై వేధింపులు మొదలయ్యాయి. పీజేఆర్‌, ఇతర జిల్లా పెద్దలు పిలిచి కాంగ్రెస్‌లో చేరమనడంతో పార్టీ మారాను.


ఒక దశలో ఎన్టీఆర్‌ కంటే రాజశేఖరరెడ్డి గొప్పవాడన్నారు. దానికి ఇప్పటికీ కట్టుబడతారా?

ఎన్టీఆర్‌తో సమానం అని చెప్పాను. ఎన్టీఆర్‌ నియంతలా ఉండేవారు, కమిట్‌మెంట్‌, క్యారెక్టర్‌ ఉండేవి. వైఎస్‌ సీఎం అయ్యాక ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. ఒకే మొండితనం వైఎస్‌, ఎన్టీఆర్‌ ఇద్దరిలో చూశాను.


రంగా హత్యతో ఒక సామాజికవర్గం నష్టపోయింది. ఆ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరారు. ఎందుకలా?

మీరు చెబుతున్న సామాజికవర్గానికి నేను పార్టీ మారే ముందు మూడు సార్లు చెప్పాను. మొన్న ఎన్నికల్లో ఓ సామాజికవర్గం చిరంజీవి వెంట, ఓ వర్గం చంద్రబాబు వెంట పడ్డాయి. మిగిలినవారు నాతో ఉండటం వల్లే వంద ఓట్ల తేడాతో ఓడాను.



విజయవాడలో ఆ సామాజికవర్గమంటే మీకు ఎందుకంత కోపం?

అలా లేదు. నేను ఆ సామాజికవర్గానికి సంబంధించిన రోడ్లన్నీ వేయించాను. అయినా ఓడించారు. కాలనీ పార్కుల్లోకి ఎవర్నీరానివ్వకపోవడం, ఫన్‌టైమ్స్‌లోకి రాకుండా అడ్డుకోవడం వంటి అరాచకాలు జరిగాయి. నేను తాళాలు తీయించి ముస్లింలు, తూర్పుకాపులు.. అందర్నీ పంపాను. అదీ నా అరాచకం. ఆ సామాజికవర్గం మీటింగ్‌ పెట్టి పిలిస్తే నా బాధ చెప్పాను. మీరు నన్ను వద్దనుకున్నారు, నాకూ మీరు అక్కర్లేదన్నాను.


కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ బెజవాడలో ఉద్రిక్తత మొదలైంది. దానికి కారణమేంటి?

ఇదంతా మీడియా సృష్టి. అక్కడ ఉద్రిక్తతలు లేవు. ఇద్దరు విద్యార్థులు చెంప దెబ్బ కొట్టుకుంటే.. రక్తపాతం అని చెప్పారు.


మీ మీద రెండు ఆరోపణలొచ్చాయి. ఒకటి లక్ష్మీపార్వతి వద్ద డబ్బులు తీసుకెళ్లారని, రెండు హైదరాబాద్‌లో భూముల క్రమబద్ధీకరణ. వీటిలో వాస్తవమెంత?

నేను, ముద్దుకృష్ణమనాయుడు, బుచ్చయ్య చౌదరి, కృష్ణంరాజు.. ఇలా కొందరు వెళ్లాం. రాత్రికి ఇంటిమీద రెయిడ్‌ చేస్తున్నారని వార్త వచ్చింది. కృష్ణంరాజుకి లక్ష్మీపార్వతి రెండు సూట్‌కేసులిచ్చింది. నేను ఖర్మకాలి ఆయన కారెక్కాను. దిగేటప్పుడు నాదగ్గర ఓ సూట్‌కేసు పెట్టాడు. దాన్ని తర్వాత ఆమెకు ఇచ్చేశాను. వైఎస్‌కి ఆ భూమి విషయం మీ పేపర్లో పడేవరకు తెలీదు.

Updated Date - 2020-02-07T19:53:35+05:30 IST