కొత్త మండలంగా దూల్మిట్ట

ABN , First Publish Date - 2020-08-29T11:10:35+05:30 IST

సిద్దిపేట జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పడనున్నది. మద్దూరు మండలంలోని దూల్మిట్ట గ్రామాన్ని మండల కేంద్రంగా..

కొత్త మండలంగా దూల్మిట్ట

మద్దూరు మండలంలోని 8 గ్రామాలతో ఏర్పాటు

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

జిల్లాలో 24కు చేరిన మండలాలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 28: సిద్దిపేట జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పడనున్నది. మద్దూరు మండలంలోని దూల్మిట్ట గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాలుంటే స్పష్టం చేయాలని సూచనలు చేసింది. కొత్త మం డలం ఏర్పాటుపై పదిరోజుల క్రితమే ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. 


8 గ్రామాలతో కొత్త మండలం

మద్దూరు మండలంలో మొత్తం 21 గ్రామాలుండగా 8 రెవెన్యూ గ్రామాలతో దూల్మిట్ట మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త మండలంలో దూల్మిట్ట, లింగాపూర్‌, జాలపల్లి, తోర్నాల, బైరాన్‌పల్లి, బెక్కల్‌, కొండాపూర్‌, కూటిగల్‌ గ్రామాలను చేర్చుతున్నారు. ఈ మండలం కూడా హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


జిల్లా ఏర్పాటయ్యాక రెండోది

 2016 అక్టోబరు 11న సిద్దిపేట నూతన జిల్లాగా ఆవిర్భవించింది. నాడు 22 మండలాలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల అనంతరం సిద్దిపేటరూరల్‌ మండలం, చిన్నకోడూరు మండలాల నుంచి విభజించి కొత్తగా నారాయణరావుపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 23కు చేరింది. ఈమండలాలన్నింటికీ ఎన్నికలు జరిగాయి. కాగా ప్రస్తుతం దూల్మిట్ట ఏర్పాటుతో జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది. 


చేర్యాల మండలంలోకి ఈ రెండు గ్రామాలు..

మద్దూరు మండలంలో ఉన్న కమలాయపల్లి, అర్జునపట్ల గ్రామాలను చేర్యాల మండలంలో విలీనం చేస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ గ్రామాలను హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధి నుంచి సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వెంటనే మార్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


దూల్మిట్ట మండలం ఏర్పాటుతో సంబరాలు 

మద్దూరు, ఆగస్టు 28 : ప్రభుత్వం దూల్మిట్ట గ్రామాన్ని మండలంగా, కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను చేర్యాల మండలంలో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీపీ బద్దిపడగ కిష్టారెడ్డి తెలిపారు. 


ఈ సందర్భంగా దూల్మిట్ట గ్రామం మండలంగా ఏర్పాటు కావడంతో సర్పంచ్‌ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు సంబ రాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాల ప్రజల కోరిక నెరవేరడంతో పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మద్దూరు మండలానికి వెళ్లాలంటే చేర్యాల మండలం మీదుగా వెళ్లాల్సి రావడంతో పడ్డ ఇబ్బందులు ఇక తొలగిపోవడంతో సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-29T11:10:35+05:30 IST