గర్భిణులకు భోజనం
ABN , First Publish Date - 2020-12-05T04:41:58+05:30 IST
ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డపుడితే రూ.12వేలను విడతల వారీగా అందిస్తోంది.
నెలవారి పరీక్షల కోసం వచ్చే వారి కోసం భోజన ఏర్పాట్లు
జిల్లావారిగా ప్రణాళిక సిద్ధం
ఇప్పటికే పలు సబ్ సెంటర్లలో భోజనం అందించే ప్రక్రియ ప్రారంభం
జిల్లాలోని 1,193 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని 7,755 మంది గర్భిణులకు లబ్ధి
కామారెడ్డి టౌన్, డిసెంబరు 4: ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కిట్, ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డపుడితే రూ.12వేలను విడతల వారీగా అందిస్తోంది. తాజాగా గర్భిణులు ఆస్పత్రికి వెళితే ఆకలికి అలమట్టించే పరిస్థితులు నెలకొనవద్దనే ఉద్దేశ్యంతో మతాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వారికి ఆహారం అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించిన కార్యాచరణను ఐసీడీఎస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు మొదలుపెట్టారు. అందుకు సంబంధించి ఆశలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమం చేపట్టారు. దీంతో జిల్లాలోని 7,755 మంది గర్భిణులకు ఆసుపత్రులలో భోజన సౌకర్యం కలుగనుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు సబ్ సెంటర్లలో ఈ పథకం అమలును ప్రారంభించగా ఈ నెల 7న మరికొన్ని సబ్ సెంటర్లలో, 9న అన్ని పీహెచ్‌సీ పరిధిలో ప్రారంభించనున్నారు.
జిల్లాలో 1,193 అంగన్‌వాడీ కేంద్రాలు
మతాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1,193 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 155 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 1,038 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఆయా కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 7,755 మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక జిల్లాలో జిల్లా కేంద్రాసుపత్రి, ఏరియా ఆసుపత్రులతో పాటు అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఆసుపత్రులు మొత్తం 29 వరకు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు ఎక్కువగా గర్భిణులు వస్తుండగా మిగిలిన పీహెచ్‌సీ పరిధిలో అంతంతమాత్రంగానే గర్భిణులు పరీక్షల నిమిత్తం వస్తుంటారని సమాచారం. కేవలం పీహెచ్‌సీ, సబ్ సెంటర్ల పరిధిలోనే భోజనాలు ఏర్పాటు చేస్తారా లేదంటే అన్ని ఆసుపత్రులలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారనేదానిపై సందిగ్ధం నెలకొంది. వైద్య విధానపరిషత్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ పరిధిలో ఇప్పటికే ఇన్‌పేషంట్లకు భోజన సౌకర్యం కల్పిస్తుండగా గర్భిణులకు సైతం వీరి ద్వారానే భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారా లేదంటే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తారనేది పూర్తిస్పష్టత రావాల్సి ఉంది.
నీరసించి పోకుండా..
సుదూర ప్రాంతాల నుంచి హెల్త్‌చెకప్ కోసం వచ్చే గర్భిణులు గంటల తరబడి నిరీక్షణతో నీరసించి పోయే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల సబ్ సెంటర్ల పరిధిలో టిఫిన్స్, భోజనం దొరకని పరిస్థితి నెలకొంటుంది. దూర ప్రాంతాల్లో ఉండే ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి పరీక్షించుకుని తిరిగి ఇళ్లకు వెళ్లేసరికి చాలా సమయం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణులకు కడుపునిండా భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్ సెంటర్లు, ప్రసూతి ఆస్పత్రులకు రెగ్యూలర్‌గా వచ్చే గర్భిణుల వివరాలను ఇప్పటికే గుర్తించి వారికి తోడుగా వచ్చే ఆశ కార్యకర్తలకు, ఆయా సబ్ సెంటర్లలోని అంగన్‌వాడీ నిర్వాహకులకు ఏ విధంగా ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టాలనే దానిపై ఇప్పటికే పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
మినహాయింపు
ప్రస్తుతం అంగన్‌వాడీ సెంటర్లలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అస్పత్రులకు చెకప్ కోసం వచ్చే గర్భిణులకు కడుపునిండా భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుత సరుకులను అదనంగా సరఫరా చేయనున్నారు. కొవిడ్ నేపథ్యంలో భోజనం వడ్డించే ప్రక్రియ సబ్ సెంటర్లలో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం వద్ద గర్భిణులకు రోజుకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల ఆయిల్, 200 మిల్లీ లీటర్ల పాలు, రోజుకు ఒక కోడిగుడ్డు చొప్పున వడ్డించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కరోనా కారణంగా ఈ సరుకులు నేరుగా గర్భిణులకే అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి వద్ద మధ్యాహ్నం సంపూర్ణ భోజనం ఏర్పాటు చేస్తుండడంతో కేంద్రాల వద్ద సరుకులను మినహాయిస్తారని సమాచారం.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
- చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి.
హెల్త్ చెకప్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు భోజనం అందించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ సూచన మేరకు ప్రతీ ఆసుపత్రి ఆవరణలో ఆహారాన్ని అందించేందుకు ఇప్పటికే పలు సబ్ సెంటర్లలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాం. ఈ నెల 7న మరికొన్ని సబ్ సెంటర్లలో ప్రారంభించడంతో పాటు 9వ తేదీన పీహెచ్‌సీలలో అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ఐసీడీఎస్, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది కృషిచేసే విధంగా చర్యలు చేపట్టాం.