ఖైనీ ప్యాకెట్ కోసం వెళ్లి ఎరుక్కపోయి.. ఇరుక్కుపోయాడు!
ABN , First Publish Date - 2021-02-16T06:01:19+05:30 IST
ఖైనీ ప్యాకెట్ కోసం గోడల మధ్య దూరి ఇరుక్కుపోవడంతో ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన దేశయ్య చనిపోయాడు
శ్రీకాళహస్తి అర్బన్, ఫిబ్రవరి 15: దెబ్బతిన్న గోడల నడుమ ఖైనీ ప్యాకెట్ పడింది. మద్యం మత్తులో ఎలాగోలా తీసుకుందామన్న ఆత్రుత ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. గోడల మధ్య ఇరుక్కుని ఓ చేపల వ్యాపారి మృతిచెందిన సంఘటన సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలో వెలుగుచూసింది. వన్‌టౌన్ ఎస్‌ఐ సంజీవ కుమార్ కథనం మేరకు... ఏర్పేడు మండలం బండారుపల్లెకు చెందిన దేశయ్య(48) చేపల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం చేపల విక్రయానికి ఆయన శ్రీకాళహస్తి వచ్చాడు. అనంతరం రాత్రి మద్యం తాగేందుకు పట్టణ పరిధిలోని పానగల్ వద్ద ఊరందూరు మార్గంలో ఉన్న ఓ దుకాణ సముదాయం వెనుకకు వెళ్లాడు. మద్యం తాగి స్వగ్రామానికి బయలుదేరే క్రమంలో ఓ పాడుబడిన రైస్‌మిల్ గదుల వద్దకు వచ్చాడు. అక్కడ ఖైనీ వేసుకునేయత్నంలో ఉండగా, దెబ్బతిన్న గది గోడల మధ్య నుంచి లోపలికి ఆ ప్యాకెట్ పడిపోయింది. దీంతో దేశయ్య గోడల మధ్య నుంచి లోపలికి దూరి ఖైనీ అందుకునేయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన అందులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సంజీవ కుమార్ చేపల వ్యాపారి మృతదేహాన్ని వెలుపలికి తీయించి, శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.