వైభవంగా కోటి తులసిదళార్చన

ABN , First Publish Date - 2021-12-20T05:57:07+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధి ఆదివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. శ్రీగోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో కోటి తులసి దళార్చన అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా కోటి తులసిదళార్చన
సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లకు తులసిదళ అర్చన నిర్వహిస్తున్న అర్చకులు

  • గోవింద నామస్మరణతో మార్మోగిన సత్యదేవుని సన్నిధి

అన్నవరం, డిసెంబరు 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధి ఆదివారం గోవిందనామ స్మరణతో మార్మోగింది. శ్రీగోవిందనామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో కోటి తులసి దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని వార్షిక కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఉదయం తొమ్మిది గంటలకు స్వామి, అమ్మవార్లను ఆశీనులు గావించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత సేవకులు తులసి దళాలను ఊరేగింపుగా ప్రధానాలయానికి తీసుకొచ్చారు. ప్రధానార్చకుడు కోట శ్రీను ఆధ్వర్యంలో గణపతి పూజతో ప్రారంభించి కోటి తులసి దళాలతో స్వామి, అమ్మవార్లను పూజించారు. సేవా సమితి సభ్యులు, సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విజయవాడకు చెందిన గోవింద నామ ప్రచార సమితి నిర్వాహకులు సునీతా మధుసూదన్‌ దంపతులు మాట్లాడుతూ లోక కల్యాణార్థం, రైతు సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 108 వైష్ణవ క్షేత్రాల్లో కోటి తులసి దళార్చన చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటివరకు మంగళగిరి, ద్వారకాతిరుమల, శ్రీకూర్మం ఆలయాల్లో కోటి తులసి దళార్చన నిర్వ హించామన్నారు. 10 ఎకరాల విస్తీర్ణంలో తులసిని పండిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-12-20T05:57:07+05:30 IST