ఇలా చేస్తే.. గ్రామ స్వరాజ్యమే!

ABN , First Publish Date - 2021-02-02T15:39:57+05:30 IST

ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక, విధులు అధికారాలుంటాయి..

ఇలా చేస్తే.. గ్రామ స్వరాజ్యమే!

యువ విద్యావంతులు పంచాయతీరాజ్‌ చట్టాన్ని అవగాహన చేసుకోవాలి 

పోటెత్తిన నామినేషన్లలో సింహభాగం విద్యావంతులు, విద్యాధికులే   

ఈ పరిణామం గ్రామసీమల ముఖచిత్ర మార్పునకు నాంది 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక, విధులు అధికారాలుంటాయి. దశాబ్దం కిందటి వరకు అక్షరాస్యత లేనివారు ఎక్కువగా గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల దామాషా ప్రకారం సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికవుతూ ఉండేవారు. గ్రామాలలోని ల్యాండ్‌లార్డ్స్‌ తెర వెనుక గ్రామ పరిపాలనను తమ చెప్పు చేతల్లోకి తీసుకునేవారు. ఇప్పుడు విద్యావంతులు సర్పంచులుగా వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల తొలిదశ ఎన్నికలకు అయితే ఏకంగా డాక్టర్లు, లాయర్లు, సామాజిక సేవ చేసేవారు, పోటీ చేయటానికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం నామినేషన్లు దాఖలు చేసిన యువ విద్యావంతులు గ్రామ పంచాయతీల విధులు, అధికారాలు, ప్రత్యేక కార్యాచరణ కమిటీల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టాన్ని అనుసరించి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా విధులు, అధికారాలు కల్పించారు. వీటిని అమలు చేస్తే మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం సాధించినట్టే..


ఏ సెక్షన్‌ ఏం చెబుతోందంటే... 

సెక్షన్‌ - 45 ప్రకారం తప్పనిసరిగా గ్రామ పంచాయతీలలో నిర్వహించాల్సిన విధులు.. 

- ప్రతి గ్రామ పంచాయతీ తన అధికార పరిధిలో ఉన్న భవనాలు, రోడ్లు, వంతెనలు, కట్టలు, దారులు తదితరాల నిర్మాణంతోపాటు నిర్వహణ చూడాలి.

- బహిరంగ స్థలాలు, వీధులు, వీధి దీపాలను ఏర్పాటు చేయాలి. 

- మురుగునీరు, వర్షపునీరు పోవటానికి కాలువలు నిర్మించాలి. 

- బజార్లు, వీధులలో చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించాలి.

- ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి.

- శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలి. 

- కలరా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి. 

- మంచినీటి బావులు, చెరువులను ఏర్పాటుచేసి ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలి.

- కంపోస్టు ఎరువుల తయారీ, జనన, మరణాల నమోదు, బందెల దొడ్లు ఏర్పాటు, గ్రామ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ వంటి విధులు తప్పనిసరిగా నిర్వహించాలి.

 

సెక్షన్‌ - 46 ప్రకారం ఐచ్ఛిక విధులు..

గ్రామ పంచాయతీలకు ఉన్న ఆర్థిక వనరులను బట్టి ఈ సెక్షన్‌ ప్రకారం ఐచ్ఛిక విధులను నిర్వహించవచ్చు. ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం, రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెట్లను నాటించడం, వైద్యశాలల స్థాపన, ఆటస్థలాలు, పార్కులు, వ్యాయామశాలలు ఏర్పాటు చేయటం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయటం, సంతలు, జాతర్ల నియంత్రణ, గ్రామ నివేశనా స్థలాల విస్తరణ, గిడ్డంగులు ఏర్పాటు, ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన వంటి విధులు నిర్వహించాలి.


సెక్షన్‌ 60-73 వరకు కల్పించిన ఇతర విధులు..

గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ రకాలు పన్నులు విధించాలి. వసూలు చేయాలి.

అనుమతులు లేని ప్రకటనలను తొలగించాలి.

- లైసెన్సు లేని పందులను, కుక్కలను నిర్మూలించాలి.

- దురాక్రమణలను తొలగించాలి.

- రోడ్లపై ఆటంకాలు, గుంటలు తవ్వటాన్ని నిషేధించాలి. 

- అనుమతి లేకుండా పబ్లిక్‌ రోడ్లపై చెట్లను నాటడాన్ని అరికట్టాలి. 

ప్రైవేటు మార్కెట్లకు లైసెన్సులు ఇవ్వవచ్చు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవచ్చు.  


కార్యాచరణ కమిటీలు ఇలా.. 

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం - 1994లో సెక్షన్‌ 40 (ఏ) ప్రకారం గ్రామ పంచాయతీలలో వ్యవసాయం, ప్రజారోగ్యం, నీటి సరఫరా, పారిశుధ్యం, కుటుంబ నియంత్రణ వంటి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇవి సరిగా అమలు కావటం లేదని వాటిని రద్దు చేశారు. 2003లో ఐదు కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు.

మొదటిది సహజ వనరుల కార్యాచరణ కమిటీ. ఈ కమిటీ పూర్తి వ్యవసాయం, తోటల పెంపకం, పాడి, చేపలు, నీటి సంరక్షణ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. భూ గర్భజలసంరక్షణకు చర్యలు తీసుకోవాలి. నీటి పథకాలను నిర్వహించాలి. చెరువులలో పూడిక తీయించాలి. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. 

- రెండవది మానవ వనరుల కార్యాచరణ కమిటీ. ఈ కమిటీ ప్రధానంగా చదువు పట్ల్ల ఉపయోగాలను ప్రచారం చేయాల్సి ఉంటుంది. గ్రామంలోని మూఢాచారాలను నిర్మూలించటం, వైద్యారోగ్య శిబిరాలు నిర్వహించటం, గ్రామ స్థాయాలు వినోద కార్యక్రమాలను ఏర్పాటు జరగాలి. అసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి.

- మూడవది ఉపాధికల్పన - స్వయం సహాయక బృందాల కార్యాచరణ కమిటీ. ఈ కమిటీలో గ్రామంలో కూలీలను నియమించాలి. నిరుద్యోగులకు ఉపాధి అవసరాలను తీర్చాలి. గ్రామీణ, చేతి వృత్తులను ప్రోత్సహించాలి.

నాల్గవది ఆర్థిక ప్రణాళికా కార్యాచరణ కమిటీ. ఈ కమిటీ పన్ను విధించదగ్గ, పన్నులేని వనరులను మదింపు చేయాలి. తద్వారా పన్నులను విధించటం, వసూలు చేయటం ఉండాలి. పంచాయతీలకు సంబంధించిన రాబడులు, ఖర్చులు సరిచూసి వార్షిక బడ్జెట్‌ అంచనాలను తయారు చేయాలి.

- ఐదవది పనులు - మౌలిక వసతుల కార్యాచరణ కమిటీ . ఈ కమిటీ గ్రామంలో ఉన్న వసతులు, ప్రకృతి వన రులు, ఆర్థిక శక్తికి సంబంధించిన గ్రామ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. స్థానిక అభివృద్ధికి అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తించాల్సి ఉంటుంది. గ్రామస్థాయిలో అమలయ్యే వివిధ శాఖల ప్రణాళికల మధ్య సమన్వయాన్ని తీసుకురావటానికి ఈ కమిటీ కృషి చేయాలి


సెక్షన్లు ఏవేవంటే..

ఏపీ పంచాయతీరాజ్‌ యాక్ట్‌ - 1994 ప్రకారం సెక్షన్‌ - 45 నుంచి 59 వరకు గ్రామ పంచాయతీ విధులు, అధికారాలు నిర్ధేశించారు.

- సెక్షన్‌ 60 నుంచి 79 వరకు గ్రామ పంచా యతీల ఆర్థిక విషయాలకు సంబంధించిన అధికా రాలు, సెక్షన్‌ 80 నుంచి 125 వరకు ప్రజా భద్రత, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన  జాగ్రత్య చర్యలు, సెక్షన్‌ 126 నుంచి 142 వరకు గ్రామపంచాయతీలకు చెందిన ఇతర అనేక విధులు, అధికారాలను ప్రతిపాదించారు.

గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేయాల్సిన కార్యాచరణ కమిటీలు, అవి చేయాల్సిన పనులకు సంబంధించి కూడా వివరించారు. 

Updated Date - 2021-02-02T15:39:57+05:30 IST