బరితెగింపు

ABN , First Publish Date - 2021-01-14T05:45:46+05:30 IST

బరితెగింపు

బరితెగింపు
అంపాపురంలో ఏర్పాటుచేసిన భారీ బరి

జిల్లాలో భారీగా కోడి పందేలు ఫ పోలీసుల ఆదేశాలు బేఖాతరు

అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ బరులు

భోగి ఒక్కరోజే రూ.కోట్లలో పందేలు

సంక్రాంతి, కనుమ లెక్కలు భారీగానే..

గుడివాడలోని పందేల్లో పాల్గొన్న చింతమనేని

కోళ్లు కాళ్లు రువ్వాయి. పందెపురాయుళ్లు కత్తులు నూరారు. పోలీసుల హెచ్చరికలు తాటాకు చప్పుళ్లే అయ్యాయి. జిల్లావ్యాప్తంగా కోడి పందేలతో రూ.కోట్లు చేతులు మారాయి. పందేలే కాదు.. కోతముక్క, పేకాట, గుండాటలు భారీగా జరిగాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బరులు గీయడంతో పోలీసులు పక్కకు తప్పుకొన్నారు. అన్నింటికీ ఓ రేటు నిర్వహించిన నిర్వాహ కులు పందెపురాయుళ్ల నుంచి భారీగా దండుకున్నారు.


విజయవాడ, ఆంధ్రజ్యోతి/గుడివాడ/మచిలీపట్నం టౌన్‌ : కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపినా.. పందేల జోరు మాత్రం తగ్గలేదు. జిల్లావ్యాప్తంగా పందేలు బుధవారం భారీగానే జరిగాయి. అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బరులు ఏర్పాటు కావడంతో పోలీసులు కూడా చూసీచూడనట్టే వ్యవహరించారు. ఒక్క భోగి రోజే రూ.కోట్లలో పందేలు జరగ్గా, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.  జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గుడివాడ, కైకలూరు, కలిదిండి, పెడన, మచిలీపట్నం, నూజివీడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో భారీగా బరులు ఏర్పడ్డాయి. గన్నవరం సమీపంలోని అంపాపురంలో ఏటా మాదిరిగానే కోళ్లు కాలు రువ్వాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో సైతం పందేలు జరిగాయి. పెనమలూరు మండలం ఈడుపుగల్లులోనూ భారీగా బరులు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల బరులను పోలీసులు ట్రాక్టర్లతో ధ్వంసం చేయించినా రాత్రికిరాత్రి మళ్లీ సిద్ధమైపోయాయి. 

గుడివాడలో ఒక్కరోజే రూ.కోట్లలో..

గుడివాడ డివిజన్‌లోని ఒక్కో బరికి రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వంతున వసూలుచేసి అధికార పార్టీ నాయకుల మధ్యవర్తిత్వంతో పోలీసులే అనుమతులు ఇచ్చారని తెలుస్తోంది. అలాగే గుండాట, కోతముక్క రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగంగా నిర్వహించారు. గుడివాడకు సమీపంలోని కే కన్వెన్షన్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల పందేల ప్రాంగణం పక్కన కోతముక్క, కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రస్థాయి రాజకీయ ప్రముఖులు పందేల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక్కడ జరిగిన కోడి పందేల్లో టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ హాజరవ్వడం గమనార్హం. ఇక కోడి పందేలు, కోతముక్కల్లో రూ.కోట్లలో నగదు చేతులు మారింది.   

రూ.67.80 లక్షలు స్వాధీనం

జిల్లావ్యాప్తంగా బుధవారం పేకాట ఆడుతున్న 818 మందిని అరెస్టు చేసి రూ.67లక్షల80వేల637 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కోడి పందేలు వేసే వారిపై 66 కేసులు నమోదు చేసి 146 మందిని అరెస్టు చేసి రూ.లక్షా19వేల460, 14 పందెం పుంజులు, 2,251 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 528 కేసుల్లో 1,270 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామన్నారు.

అధికార పార్టీ కనుసన్నల్లోనే..

జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పందేలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి.  భవానీపురం, ఇబ్రహీంపట్నం, నున్న ప్రాంతాల్లో రహస్యంగా కొన్ని బరులు సిద్ధమయ్యాయి. ఈ గ్రౌండ్లలో గురువారం భారీగా పందేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన నాయకుడి ఆధ్వర్యంలో కోడి పందేలు జరగ్గా, నిర్వాహకులు లోకల్‌ ట్యాక్స్‌ వసూలు చేశారు. పందేల బరిలోకి ప్రవేశించాలంటే ముందు సైకిల్‌కు రూ.30, బైక్‌కు రూ.50, ఆటో, కారుకు  రూ.100 వసూలు చేశారు.







Updated Date - 2021-01-14T05:45:46+05:30 IST