డీలర్లకు షాక్‌!

ABN , First Publish Date - 2021-04-26T15:34:33+05:30 IST

రేషన్‌ డీలర్లకు పౌరసరఫరాల శాఖ పెద్ద షాక్‌..

డీలర్లకు షాక్‌!

కేంద్రం ఇచ్చిన కమీషన్‌లో టీడీఎస్‌ కట్‌ 

ప్రభుత్వానికి ఆదాయం కోసం డీలర్లపై ఎఫెక్ట్‌ 

ఒక్కో డీలర్‌కు కమీషన్‌లో రూ.20 వేల కోత 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డీలర్లకు పౌరసరఫరాల శాఖ పెద్ద షాక్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎనిమిది విడతల నిత్యావసరాల పంపిణీ కమీషన్‌ను గోడౌన్ల ఎస్‌సీఎం ఖాతాకు జమ చేసిన పౌరసరఫరాల శాఖ డీలర్ల ఆనందాన్ని ఆవిరి చేసేలా టీడీఎస్‌ను కట్‌ చేయాలంటూ సర్క్యులర్‌ను జారీ చేయటం కొత్త వివాదానికి దారి తీసింది. పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌ రాజ్యలక్ష్మికి ఈ మేరకు సర్క్యులర్‌ రావటంతో.. నేడో, రేపో ఎస్‌సీఎం ఖాతాలలో ఉన్న డీలర్ల కమీషన్‌లో టీడీఎస్‌ కోత పడనుంది. సివిల్‌ సప్లయీస్‌ సంస్థ నిర్ధేశించిన ప్రకారం పాన్‌ కార్డు ఉన్న డీలర్లకు 3.75శాతం, పాన్‌ కార్డు లేని డీలర్లకు 20 శాతం మేర టీడీఎస్‌ను మినహాయించాల్సిందిగా నిర్ధేశించింది. పౌరసరఫరాల శాఖ ఈ ఆదేశాల వల్ల ఒక్కో డీలర్‌కు సగటున పాన్‌ కార్డు ఉంటే రూ.4 వేలు, లేకపోతే రూ.20 వేల మేర టీడీఎస్‌ రూపంలో కట్‌ అవుతుంది. తమకు ఇచ్చే కమీషన్‌లో టీడీఎస్‌ కట్‌ చేస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ చాలా మందికి తెలియదు.


ఈ సర్క్యులర్‌ ఈ నెల 21వ తేదీనే వచ్చింది. ఈ సర్క్యులర్‌ విషయం తెలిసిన డీలర్ల సంఘాల నేతలు కారాలు నూరుతున్నారు. తమకు న్యాయంగా ఇచ్చే కమీషన్‌లో టీడీఎస్‌ పేరుతో కోత పెట్టడం అన్యాయమని అంటున్నారు. వాస్తవానికి డీలర్లకు కమీషన్‌ అనేది ప్రజల నుంచి నేరుగా వస్తుంది. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇవ్వదు. బియ్యం అనేది ప్రజలకు రూపాయికి ఇస్తే.. ఆ రూపాయి డీలర్లకు కమీషన్‌గా వారి నుంచి వస్తుంది. ఈ కమీషన్‌ను డీలర్లు మినహాయించుకుంటారు. కేంద్రం ఇచ్చిన కమీషన్‌ను మాత్రం బ్యాంకు ఖాతాలో వేసినందున ఎప్పుడూ లేని సంస్కృతిని ఈసారి సివిల్‌ సప్లయీస్‌ అధికారులు టీడీఎస్‌ కట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి డీలర్ల ఖాతాలు ప్రత్యేకంగా ఉంటాయి. కేంద్రం విడుదల చేసిన కమీషన్‌ను డీలర్ల ఖాతాలకు కూడా నేరుగా జమ చేయలేదు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోడౌన్లకు సంబంధించిన ఎస్‌సీఎం ఖాతాలలో జమ చేశారు. ఎందుకు నేరుగా తమ ఖాతాలలో జమ చేయలేదని గతంలో డీలర్ల సంఘాలు ప్రశ్నిస్తే.. టీడీఎస్‌ వంటివి కట్‌ కాకుండా ఉండటానికే ఆ ఖాతాలలోకి జమ చేశామని అప్పటి అధికారులు చెప్పుకొచ్చారు.


తీరా చూస్తే గోడౌన్ల ఖాతాలలో జమ చేసిన డీలర్ల కమీషన్‌ను కూడా కట్‌ చేస్తూ ఏకంగా పౌరసరఫరాల శాఖ అధికారులే సర్క్యులర్‌ జారీ చేయటం గమనార్హం. కరోనా మొదటి దశలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నెలకు రెండు ఉచిత కోటాల నిత్యావసరాల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే! రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఐదు కోటాలకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎనిమిది కోటాలకు డీలర్లకు కమీషన్‌ రావాల్సి ఉండగా.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఐదు కోటాలకు విడతల వారీగా కమీషన్‌ను చెల్లించారు. కేంద్రం కమీషన్‌ వచ్చేసరికి ప్రభుత్వానికి ఎదురౌతున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పని చేయటం గమనార్హం. వాస్తవానికి ఉచిత పంపిణీలు డీలర్లకు చేతి చమురునే వదిలించాయి. ఎలాగంటే.. దిగుమతి చార్జీలను పూర్తిగా సివిల్‌ సప్లయీస్‌ భరించాలి. దిగుమతి చార్జీలను డీలర్ల మీదనే మోపారు. వంద క్వింటాళ్ల దిగుమతికి డీలర్లకు రూ.1000 వరకు దిగుమతి  చార్జీలు అవుతాయి. ఇలా డీలర్లు అనవసర ఖర్చులు భరించారు. ఈ ఖర్చులు ఎలాగూ ప్రభుత్వం ఇవ్వలేదు. డీలర్లకు న్యాయబద్ధంగా వచ్చిన కమీషన్‌లోనూ కోత పెట్టేలా టీడీఎస్‌ను కట్‌ చేయటమంటే దారుణమైన విషయమని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. 


ఇది అన్యాయం.. 

ఇది అన్యాయం. పౌరసరఫరాల శాఖ నిర్ణయాన్ని మేం విభేదిస్తున్నాం. ఈ ఆదేశాలను తప్పనిసరిగా వెనక్కు తీసుకోవాలి. ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు తప్పవు. డీలర్ల బ్యాంకు అక్కౌంట్లలో వేస్తే టీడీఎస్‌ అనవసరంగా.. కట్‌ అవుతుందని మాకు అనాడు అధికారులు చెప్పారు. తీరా ఎస్‌సీఎం అక్కౌంట్లలో వేసిన కమీషన్‌ నుంచి టీడీఎస్‌ కట్‌ చేయటం ఏమనాలో అర్థం కావటం లేదు. ఈ విధానం వల్ల డీలర్‌ రూ. 20 వేల వరకు నష్టపోతాడు.

-మండాది వెంకట్రావు, రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు 






Updated Date - 2021-04-26T15:34:33+05:30 IST