హయగ్రీవకు చెక్‌

ABN , First Publish Date - 2021-12-31T06:07:09+05:30 IST

వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఎండాడలో 12.5 ఎకరాల భూమి తీసుకున్న హయగ్రీవ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని కలెక్టర్‌ మల్లికార్జున స్పష్టంచేశారు.

హయగ్రీవకు చెక్‌

నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించాం

కలెక్టర్‌ మల్లికార్జున ప్రకటన

వారం రోజుల్లో పూర్తి నివేదిక

షోకాజ్‌ నోటీసు ఇచ్చామన్న జీవీఎంసీ సీసీపీ


విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఎండాడలో 12.5 ఎకరాల భూమి తీసుకున్న హయగ్రీవ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని కలెక్టర్‌ మల్లికార్జున స్పష్టంచేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో గురువారం వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకులపై భూ ఆక్రమణదారులనే ఆరోపణలు వస్తున్నాయని, వాటిలో వాస్తవాలు ఏమిటో తెలియజెప్పాలని అధికారులను కోరారు. ఈ మేరకు మంత్రి కన్నబాబు ‘హయగ్రీవ’ కథ ఏమిటో వెల్లడించాలని కలెక్టర్‌ను కోరారు. దానిపై కలెక్టర్‌ ప్రతిస్పందిస్తూ రెండు రోజుల క్రితమే ఆ ఫైల్‌ తెప్పించుకొని అధ్యయనం చేశానన్నారు. అనుమతులు తీసుకున్నప్పటి నుంచి మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామనే కోర్టు నిబంధనలతో ఆ సంస్థ 26, జూన్‌ 2018న ఆర్డర్‌ పొందిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఉల్లంఘించి, మూడేళ్లు దాటిన తరువాత జీవీఎంసీకి లేఅవుట్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసిందన్నారు. అందులో కూడా కొన్ని ఉల్లంఘనలు వున్నట్టు గుర్తించామని వివరించారు. వృద్ధులకు ఆశ్రమం నిర్మించకుండానే అందులో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని, వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇస్తామని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు జీవీఎంసీ అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నారని, ఏమీ పరిశీలించకుండా ఎలా చేశారంటూ ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 2016 నుంచి ఆన్‌లైన్‌లో భవనాలకు అనుమతి ఇస్తున్నామని, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ సర్టిఫై చేసి డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తారని, కొన్ని నిబంధనలకు లోబడి వారం వ్యవధిలో ఆటోమేటిక్‌ ప్లాన్‌ అప్రూవల్‌ లభిస్తుందన్నారు. పోస్టు వెరిఫికేషన్‌లో అన్ని సవ్యంగా వున్నట్టయితే ఓకే చేస్తామని, లోపాలు ఉంటే చెబుతామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన డాక్యుమెంట్లు కొన్ని సమర్పించలేదని, వాటిపై షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, వాటికి వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే, తొలుత ఇచ్చిన అనుమతి రద్దు అవుతుందని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, తనకు ఈ ప్రాజెక్టులో గజం స్థలం కూడా లేదని, తన పేరున ఐదు వేల గజాలు రిజిస్టర్‌ అయినట్టు నకిలీ డాక్యుమెంట్‌ ఒకటి బయట తిరుగుతోందని ఆరోపించారు. హయగ్రీవ జగదీశ్వరుడు ఎవరో తనకు తెలియదని, ఆడిటర్‌ జీవీ ద్వారా తాను రూ.15 కోట్లు అప్పుగా ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. 


పారదర్శకంగా ఉండాల్సిందే: మంత్రి కురసాల కన్నబాబు

అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ భూమిని గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారిని వెనకేసుకు రాకుండా, చర్చ జరిపి, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను ఇన్‌చార్జి మంత్రి కన్నబాబు ఆదేశించారు. పారదర్శకంగా ఉండాలనేదే తన అభిమతమన్నారు.

Updated Date - 2021-12-31T06:07:09+05:30 IST