వైద్య సిబ్బందిపై కొవిడ్‌ పంజా

ABN , First Publish Date - 2021-05-07T05:18:31+05:30 IST

కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిపైనా కన్నెర్ర చేస్తోంది. సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు పదుల సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్శింగ్‌ సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు.

వైద్య సిబ్బందిపై కొవిడ్‌ పంజా

సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారినపడిన వందల మంది  

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 600 మందికి పాజిటివ్‌ 

కొవిడ్‌ వార్డుల్లో సేవలు, డైరెక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌తోనే ముప్పు 

సేవలపై ప్రభావం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


కరోనా మహమ్మారి వైద్య సిబ్బందిపైనా కన్నెర్ర చేస్తోంది. సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు పదుల సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్శింగ్‌ సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో ఎక్కువమంది కొవిడ్‌ టీకా తీసుకున్నా...వైరస్‌ కోరలకు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రా మెడికల్‌ కళాశాల పరిధిలోని కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌, విమ్స్‌, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు వైద్యం అందుతోంది. సుమారు రెండు వేల మంది వైద్యులు, జూనియర్‌ వైద్యులు, నర్శింగ్‌ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిలో సుమారు 300 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 70 మంది సీనియర్‌ వైద్యులు, మరో 80 మంది జూనియర్‌ వైద్యులు, 150 మంది నర్శింగ్‌ సిబ్బంది ఉన్నారు. ఆయా ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న శానిటేషన్‌, ఇతర సిబ్బంది పదుల సంఖ్యలో కరోనాకు చిక్కారు. అలాగే జిల్లాలో 60కు పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు సేవలు అందుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, నర్శింగ్‌ సిబ్బందిలో కొంతమందికి కొవిడ్‌ సోకిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు 600 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు తెలుస్తోంది. 


వ్యాక్సిన్‌తీసుకున్నా..!!


వైరస్‌ బారినపడిన వైద్య సిబ్బందిలో 70 శాతం వరకు వ్యాక్సిన్‌ తీసుకున్నవారే. వీరిలో 45 నుంచి 50 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్‌తీసుకున్నవారు కాగా, మరో 20 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్నా వైరస్‌ బారినపడడానికి ప్రధాన కారణం కొవిడ్‌ బాధితులకు దగ్గరగా వుండి సేవలు అందించడమేనని (డైరెక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌) అధికారులు చెబుతున్నారు. అయితే, వీరిలో అతి తక్కువమంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 95 శాతం మంది ఇళ్లల్లోనే వుండి కోలుకుంటున్నట్టు చెబుతున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారుతోంది. 


సేవలపై తీవ్ర ప్రభావం


ఎక్కువ మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడడం వల్ల కొవిడ్‌ వార్డుల్లో అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మొదటి వేవ్‌లో కొవిడ్‌ వార్డుల్లో వారం రోజులు పనిచేస్తే..వారం రోజులు క్వారంటైన్‌లో వుండేందుకు సెలవులు ఇచ్చేవారని, ఇప్పుడు అటువంటి అవకాశం లేకపోవడంతో ఒత్తిడి పెరిగి, ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారంటున్నారు. తీవ్ర పని ఒత్తిడి, విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది సతమతమవుతున్నారు. మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతుండడం, ప్రతిరోజూ వందలాది కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో క్వారంటైన్‌ సెలవులిస్తే సేవలపై ప్రభావం పడుతుందన్నది అధికారుల వాదన.

Updated Date - 2021-05-07T05:18:31+05:30 IST