వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటండి
ABN , First Publish Date - 2021-08-06T05:21:19+05:30 IST
వాతావరణ సమతుల్యానికి వృక్షాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇళ్లు నిర్మించేటప్పుడే కొంత స్థలాన్ని మొక్కల పెంపకానికి కేటాయించండి
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం: కలెక్టర్ మల్లికార్జున
కొమ్మాది, ఆగస్టు 5: వాతావరణ సమతుల్యానికి వృక్షాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కొమ్మాది దరి టీచర్స్ లేఅవుట్ పార్కులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన మహా భాగ్యం లేదని, మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం వాతావరణ కాలుష్యం అధికంగా ఉందని, ఇరవై ఏళ్ల కిందట మండువేసవిలో సైతం విశాఖలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది కాదని, కానీ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలని, ప్రతి వ్యక్తి విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఇళ్లు నిర్మించుకునేటప్పుడే అందరూ కొంత భాగాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించాలని సూచించారు. ఈ ఏడాది జిల్లా మొత్తంమీద 7.7 కోట్ల మొక్కలు నాటేందుకు సంకల్పించామని ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ మనందరం మొక్కలు నాటి భావి తరాలకు మంచి వాతావరణం అందించడానికి, గ్లోబల్ వార్మింగ్ నివారించడానికి స్ఫూర్తిదాయకంగా నిలుద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్‌కుమార్, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నగరాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిళ్లా సుజాత సత్యనారాయణ, కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక, డీఎఫ్‌వో లక్ష్మణ్, సీసీపీ రామ్మోహన్, రేంజర్లు రాజు, నాగేశ్వరావు, జెడ్సీ రాము, తహసీల్దార్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.