జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు ఉంటాయి: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-02-24T06:38:07+05:30 IST

జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే..

జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు ఉంటాయి: విజయసాయిరెడ్డి

ప్రత్యర్థులపై వైసీపీ గురి

ఏకగ్రీవాలపై దృష్టి

కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పగింత

బలాన్ని చేకూర్చిన విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అందుకోసం ఏ ఒక్క మార్గాన్నీ వదలడం లేదు. కార్పొరేటర్లుగా బరిలోకి దిగిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఏదో ఒకలా తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ బాధ్యతలను కొంతమంది నేతలకు అప్పగించినట్టు సమాచారం. ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు వుంటాయని వ్యాఖ్యానించడం దీనికి బలాన్ని చేకూర్చినట్టయింది.


జీవీఎంసీకి వచ్చే నెల పదిన ఎన్నికలు జరగనున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికల్లో విజయం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ ఓటమిపాలైతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా పడుతుందని, పాలనపై రెఫరెండంగా ప్రతిపక్షాలు ఎదురుదాడి చేసే ప్రమాదం వుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భావిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులు, మురికివాడలను ఆయన చుట్టివస్తున్నారు. మరోవైపు వార్డులు ఏకగ్రీవమయ్యేలా పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో టీడీపీతోపాటు ఇతర పార్టీల అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింజేసేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.


ఇందుకోసం కీలకమైన వార్డులను ఎంపిక చేసుకుని కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర నియోజకవర్గంలోని 14, 26 వార్డులకు చెందిన కీలకమైన టీడీపీ నేతలు, ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ దాఖలు చేసిన బాక్సర్‌ రాజు మంగళవారం వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు వుంటాయని పేర్కొన్నారు. అధికార పార్టీ కాబట్టి ప్రత్యర్థుల బలహీనతలు గుర్తించి సామ, భేద, దాన, దండోపాయాలను ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


Updated Date - 2021-02-24T06:38:07+05:30 IST