వ్యాయామం ఎంత సేపు చెయ్యాలి?

ABN , First Publish Date - 2021-05-19T16:33:51+05:30 IST

కరోనా రెండో విడత విజృంభణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... దాని లక్షణాలను తట్టుకొనే శక్తి శరీరానికి అవసరమని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా కూడా శరీరం దృఢంగా లేకపోతే వ్యాధుల్ని

వ్యాయామం ఎంత సేపు చెయ్యాలి?

ఆంధ్రజ్యోతి(19-05-2021)

కరోనా రెండో విడత విజృంభణలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... దాని లక్షణాలను తట్టుకొనే శక్తి శరీరానికి అవసరమని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా కూడా శరీరం దృఢంగా లేకపోతే వ్యాధుల్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరికీ తగినంత వ్యాయామం అవసరం. మరి ఏ వయసువారు ఎంత సేపు వ్యాయామం చెయ్యాలి? ఫిట్‌నెస్‌ నిపుణుల సూచనలివి:

అయిదేళ్ళ నుంచి 17 ఏళ్ళ వయసున్న వారికి ప్రతి రోజూ గంట సేపు ఒక మోస్తరు నుంచి కాస్త శ్రమతో కూడిన ఫిజికల్‌ యాక్టివిటీ అవసరం. వారానికి కనీసం మూడుసార్లు నడక, పరిగెత్తడం, ఏరోబిక్స్‌ లాంటివి చేస్తే ఎదుగుదల బాగుంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. 

18 నుంచి 64 ఏళ్ళ మధ్య వయసున్న వారు వారానికి రెండున్నర గంటల నుంచి అయిదు గంటల సేపు వ్యాయామం చెయ్యాలి. కండరాలను పటిష్టపరిచే వ్యాయామాలను వారానికి కనీసం మూడుసార్లు చేస్తే మంచిది. దీనివల్ల రోజువారీ పనులకూ, చిరకాలం ఆరోగ్యంగా ఉండడానికీ కావలసిన దారుఢ్యం చేకూరుతుంది.

అరవై అయిదేళ్ళు పైబడిన వారు నడకను రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలి. వారానికి రెండు మూడుసార్లు నిపుణుల సూచనల మేరకు వర్కవుట్లు చేస్తే చాలా అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది.

మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు వ్యాయామం విషయంలో వైద్యుల సలహాలు, ఫిజికల్‌ ట్రైనర్ల సూచనలు తీసుకోవాలి. ఈ సమస్యలు  ఎదుర్కొంటున్నవారు వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణమైన వ్యాయామాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

గర్భిణులకు, ప్రసవించిన మహిళలకు చిన్న పాటి వ్యాయామాలు గొప్ప మేలు చేస్తాయి. అయితే వారు కొత్తగా వ్యాయామం చెయ్యాలన్నా, తిరిగి వ్యాయామం ప్రారంభించాలన్నా గైనకాలజిస్టులు, ఆరోగ్య నిపుణుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Updated Date - 2021-05-19T16:33:51+05:30 IST