ఆరోగ్యానికి యోగా!

ABN , First Publish Date - 2021-06-21T17:03:46+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలంటే రోజూ యోగా చేయాల్సిందే! యోగాసనాలు ఒత్తిడి కలిగించే హార్మోన్లను నియంత్రించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

ఆరోగ్యానికి యోగా!

ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలంటే రోజూ యోగా చేయాల్సిందే! యోగాసనాలు ఒత్తిడి కలిగించే హార్మోన్లను నియంత్రించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యేలా చేస్తాయి. రోజూ అరగంట యోగా చేస్తే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే కొన్ని యోగాసనాలు ఇవి...


త్రికోణాసనం

భుజాలు, ఛాతీ భాగం, కాళ్లు బలోపేతం అవుతాయి. శరీరం రిలాక్స్‌ అవుతుంది. ఒత్తిడి తొలగిపోతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇమ్యూనిటీ పెరగడానికి ఈ యోగాసనం చక్కగా ఉపయోగపడుతుంది.


నిటారుగా నిలుచోవాలి. కాళ్లు కాస్త ఎడంగా పెట్టాలి. రెండు అడుగుల దూరం ఉండేలా చూసుకుంటే మరీ మంచిది.

మెల్లగా శరీరాన్ని కుడివైపుకు వంచాలి. మెకాళ్లు వంచకూడదు. 

తరువాత కుడి చేయి నేల మీద ఆనించాలి. 

ఎడమ చేతిని నిటారుగా పైకి ఎత్తాలి. చూపు ఎడమ చేతి వైపే ఉండాలి. 

ఎంత సేపు వీలైతే అంతసేపు ఆ భంగిమలో ఉండాలి. 

తరువాత ఇంకోవైపు చేయాలి. రెండు, మూడుసార్లు ఈ ఆసనం వేయాలి. 


చక్రాసనం

ఈ ఆసనం వల్ల ఊపిరితిత్తులు బలోపేతం అవుతాయి. వెన్ను కండరాలు గట్టిపడతాయి. పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. 


వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను మలిచి పాదాలు నేలపై ఆనించి పెట్టాలి.

చేతులను వెనక్కి తీసుకుని చెవుల పక్కన ఆనించాలి.

చేతులపై, పాదాలపై బరువును మోస్తూ శరీరాన్ని పైకి లేపాలి.

ఈ భంగిమలో బరువు మొత్తం అరచేతులపై, కాళ్లపై పడుతుంది. ఈ ఆసనం ఎంతసేపు వీలైతే అంతసేపు చేయాలి. 

తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి.


ధనురాసనం

ఈ ఆసనం వేయడం వల్ల రక్తసరఫరా మెరుగవుతుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. 


నేలపై బోర్లా పడుకోవాలి. నెమ్మదిగా చేతులను వెనక్కి తీసుకోవాలి.

కాళ్లను మోకాళ్ల దగ్గర వంచుతూ వెనక్కి లేపాలి. చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి.

గట్టిగా శ్వాసను పీల్చుతూ చేతులతో కాళ్లను లాగాలి. తలను, ఛాతీ భాగాన్ని వీలైనంత పైకి లేపాలి.

ఈ ఆసనంలో శరీరం ధనస్సులా వంగాలి. ఆ భంగిమలో ఎంతసేపు వీలైతే అంత సేపు ఉండాలి. 

తరువాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని రెండు, మూడుసార్లు చేయాలి. 


పశ్చిమోత్తాసనం

పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. వెన్నుకండరాలు బలోపేతం అవుతాయి.


కాళ్లు చాపి, దగ్గరగా పెట్టి రిలాక్స్‌గా కూర్చోవాలి. 

నెమ్మదిగా రెండు చేతులు పైకెత్తి శ్వాసను గట్టిగా పీల్చి ముందుగా వంగాలి.

మోకాళ్లు వంగకుండా చేతులతో కాలి వేళ్లను అందుకోవాలి. 

కాసేపు అదే భంగిమలో ఉండి తిరిగి యథాస్థానానికి చేరుకోవాలి.







శలభాసనం 

ఈ ఆసనంతో బలహీనత, నిస్సత్తువ దూరమవుతాయి. ఒత్తిడి దూరమవుతుంది. శరీరం తేలికవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. 


నేలపై బోర్లా పడుకోవాలి. పొట్ట, ఛాతీ భాగం నేలను తాకుతూ ఉండాలి. 

కాళ్లు చాపి పెట్టుకోవాలి. మోకాళ్ల దగ్గర వంచకూడదు. 

తరువాత నెమ్మదిగా రెండు కాళ్లు పైకి లేపాలి. అదే సమయంలో తల భాగం పైకి లేపాలి.

ఛాతీ భాగం ఎంత వీలైతే అంత పైకి లేపాలి. ఈ భంగిమలో కనీసం పది సెకన్ల పాటు ఉండాలి.

నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. 


బకాసనం

తల, మెడ భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. వెన్ను బలోపేతం అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. 


కాళ్లపై కూర్చుని రెండు చేతులు నేలపై ఆనించాలి. 

నెమ్మదిగా చేతులపై బరువును మోస్తూ, బ్యాలెన్స్‌ను నియంత్రించుకుంటూ కాళ్లు పైకి లేపాలి.

ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు భంగిమలో ఉండాలి.


విపరీత కరణి

నరాల వ్యవస్థకు సాంత్వన చేకూరుతుంది. ఇమ్యూనిటీ బలోపేతం కావడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. తలనొప్పి, ఒత్తిడి దూరమవుతాయి. 


వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు రెండు నెమ్మదిగా పైకి లేపాలి.

90 డిగ్రీల కోణంలో ఉండేలా కాళ్లను పెట్టాలి.

మోకాళ్లు వంగకూడదు. అరచేతులు నేలపై అనించి ఉండాలి.

ఎంతసేపు వీలైతే అంత సేపు భంగిమలో ఉండి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి.

Updated Date - 2021-06-21T17:03:46+05:30 IST