తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించండి

ABN , First Publish Date - 2021-05-10T12:57:26+05:30 IST

కరోనా విలయాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని, ఇందు కోసం అన్ని వర్గాలను కలుపుకుపోవాలని కేంద్ర సర్కారుకు కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌..

తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించండి

ప్రధానికి కాంగ్రెస్‌ ఎంపీ ఖర్గే లేఖ

న్యూఢిల్లీ, మే 9: కరోనా విలయాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని, ఇందు కోసం అన్ని వర్గాలను కలుపుకుపోవాలని కేంద్ర సర్కారుకు కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆరు సూచనలు ఇస్తూ ఆదివారం లేఖ రాశారు. కొవిడ్‌ విలయాన్ని ఎదుర్కోవడంలో ఏకాభిప్రాయ సాధన కోసం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని మోదీకి ఖర్గే సూచించారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలని, పన్ను రాయితీలు ఇవ్వాలని కోరారు.  


స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించాలి

కరోనా వేళ వర్చువల్‌ పద్ధతిలో పార్లమెంటు స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడికి కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరుగా లేఖలు రాశాయి. దేశంలో కరోనా వ్యాప్తి వేళ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై పార్లమెంటు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండొద్దని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు కూడా లేఖ రాసింది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాటిపై చర్చించి, సూచనలు చేసేందుకు స్థాయీ సంఘాలతో పాటు ఇతర పార్లమెంటరీ కమిటీల సమావేశాలను వర్చువల్‌ పద్ధతిలోనైనా నిర్వహించాల్సిన అవసరం ఉందని అందులో టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ పేర్కొన్నారు.


దేశానికి కావాల్సింది ‘ఊపిరి’.. ప్రధాని నివాసం కాదు: రాహుల్‌

కొవిడ్‌ విలయతాండవం చేస్తుంటే విస్టా ప్రాజెక్టుపై దృష్టి పెట్టడమేమిటంటూ కేంద్రంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దేశానికి ఇప్పుడు కావాల్సింది ‘ఊపిరి’ అని, ప్రధానికి నివాసం కాదన్నారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ ఉన్నందున కూలీల రాకకు ఆటంకం కలగకుండా విస్టా ప్రాజెక్టును అత్యవసర పనుల జాబితాలో ప్రభుత్వం చేర్చినందున రాహుల్‌ పైవ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2021-05-10T12:57:26+05:30 IST