7న Anna Dmk సమన్వయకర్తల ఎన్నిక

ABN , First Publish Date - 2021-12-03T14:11:39+05:30 IST

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులకు ఈనెల 7న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి ఈ మేరకు

7న Anna Dmk సమన్వయకర్తల ఎన్నిక

- నేడు నామినేషన్ల స్వీకరణ 

- ఈపీఎస్‌, ఓపీఎస్‌ మళ్ళీ పోటీ


చెన్నై: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సమన్వయకర్తల పదవులకు ఈనెల 7న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి ఈ మేరకు గురువారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పార్టీ నియామవళి 30, విభాగం 2 ప్రకారం పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఈనెల 7న పార్టీ సీనియర్‌ నేతలు సి.పొన్నయ్యన్‌ పొల్లాచ్చి వి.జయరామన్‌ ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ రెండు పదవులకు మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళని స్వామి, ఒపన్నీర్‌సెల్వం పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల మూడున పార్టీ సమన్వయకర్తల పదవులకు పోటీ చేయనున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నామని, నాలుగో తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఈనెల ఆరో తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చునని పేర్కొన్నారు. ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారని, ఐదేళ్లకు పైగా పార్టీ సభ్యత్వం కలిగిన సభ్యులను ఓటేయడానికి అనుమతిస్తారని తెలిపారు. ఈనెల ఎనిమిదో తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారన్నారు. ఇదే విధంగా పార్టీ ఉపశాఖకు చెందిన పదవులకు, నగర పంచాయతీ వార్డు శాఖలకు, కార్పొ రేషన్‌ పరిధిలోని పార్టీ శాఖల పదవులకు ఈనెల 13 నుంచి 23 వరకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి విడతగా ఈనెల 13 నుంచి 14 వరకు కన్నియా కుమారి, తెన్‌కాశి, తిరునల్వేలి, విరుదునగర్‌, మదురై, నాగపట్టినం, మైలాడుదురై, పెరంబలూరు, అరియలూరు, కరూరు, నీలగిరి, ఈరోడ్‌, సేలం, నామక్కల్‌, విల్లుపురం, కృష్ణగిరి, తిరువణ్ణా మలై, కాంచీ పురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లా శాఖలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 22 నుండి 23 వరకు తూత్తుకుడి, శివగంగ, రామనాథపురం, తేని, దిండుగల్‌, తిరువారూరు, పుదకోట, తంజావూరు, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ధర్మపురి, తిరుపత్తూరు, వేలూరు, కడలూరు, రాణిపేట, చెన్నై జిల్లా శాఖలకు ఎన్నికలు జరుగుతాయి.

Updated Date - 2021-12-03T14:11:39+05:30 IST