చెన్నైలో పోలీసు మ్యూజియం
ABN , First Publish Date - 2021-09-29T14:52:39+05:30 IST
స్థానిక ఎగ్మూరులోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయ భవనసముదాయంలో రూ.6.47 కోట్లతో నిర్మించిన పోలీసుశాఖ మ్యూజియంను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.
చెన్నై: స్థానిక ఎగ్మూరులోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయ భవనసముదాయంలో రూ.6.47 కోట్లతో నిర్మించిన పోలీసుశాఖ మ్యూజియంను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. రెండంతస్థుల ఈ భవనసముదాయంలో దిగువ అంతస్థులో రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకూ ఉపయోగించిన వివిధ రకాల వాహనాలు, యూనిఫాం, వాద్య సంగీత పరికరాలు, పోలీసుశాఖ నెలకొల్పిన రికార్డుల వివరాలు, పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న విగ్రహాలు, నకిలీ నోట్లను ముద్రించే యంత్రం, బాంబులను కనుగొనే పరి కరాలు, నమూనా జైలు ఉన్నాయి. మొదటి అంతస్థులో ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు పోలీసులు ఉపయోగించిన తుపాకులు, కత్తులు, తూటాలు ప్రదర్శనకు ఉంచారు. ఇవికాకుండా పోలీసుశాఖలో ప్రదానం చేస్తున్న నమూనా పతకాలు, పోలీసు శాఖకు సంబంధించిన కీలకమైన దస్తావేజుల నకళ్ళు, జారీ చేసిన ఉత్తర్వుల నకళ్లు, ఆంగ్లేయుల కాలంలో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలు, పోలీసు జాగిలాల ఫొటోలు, పోలీసు కమిషనర్ కార్యాలయం గదిలో ఉపయోగించిన అరుదైన ప్రాచీన వస్తువులు, వైర్‌లెస్ పరికరాలు, కళాత్మక వస్తువులు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియం లో అదనంగా సీసీ కెమెరాల వ్యవస్థ, అగ్ని నిరోధక పరికరాలు, తాగునీటి సదుపాయంతో గది, వాననీటి సేకరణ సదుపాయం, క్యాంటీన్, టికెట్ కౌంటర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రారంభో త్సవాన్ని తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన పాఠశాలల విద్యార్థులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వీట్లు పంచిపెట్టి వారితో కాసేపు కబుర్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి పీకే శేఖర్ బాబు, డీజీపీ శైలేంద్ర బాబు, గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివాల్, ఎక్సైజ్ విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్కే ప్రభాకర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ కమిషనర్ ఏకే విశ్వనాథన్, పోలీసు శిక్షణా విభాగం కమిషనర్ ఎ.అమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త పోలీసు మ్యూజియంను ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ప్రజలు ఈనెల 30 వరకు ఉచితంగా సందర్శించవచ్చునని, అక్టోబర్ ఒకటి నుండి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మాత్రం ఉచితం గా అనుమతిస్తా మని నిర్వాహకులు తెలిపారు.