గ్రామాలకూ కరోనా!

ABN , First Publish Date - 2021-05-17T07:32:44+05:30 IST

కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలను కూడా వణికిస్తోంది. ఊళ్లలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు కూడా పెరిగిపోతోంది...

గ్రామాలకూ కరోనా!

  • ఊళ్లలో పెరుగుతున్న కేసులు.. 30 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు
  • గ్రామాలు, పట్టణ శివార్లలో ఏర్పాటు చేయాలి
  • హోం ఐసొలేషన్‌ లేనివారిని అక్కడ ఉంచాలి
  • అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో టెస్టు కిట్లు ఉంచాలి
  • ర్యాపిడ్‌ టెస్టులపై ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి
  • తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం


న్యూఢిల్లీ, మే 16: కరోనా రెండో దశ గ్రామీణ ప్రాంతాలను కూడా వణికిస్తోంది. ఊళ్లలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో కనీసం 30 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. సమీపంలోని పీహెచ్‌సీ/సీహెచ్‌సీల పర్యవేక్షణలో పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, పంచాయతీ భవనాలను కొవిడ్‌ కేర్‌ కేంద్రాలుగా వినియోగించుకోవాలని తెలిపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొవిడ్‌ లక్షణాల్లేని కేసులు, పాజిటివ్‌ వచ్చి స్వల్ప లక్షణాలుండి ఇంట్లో ఐసోలేషన్‌ సౌకర్యం లేనివారిని ఈ కేంద్రాల్లో ఉంచాలని పేర్కొంది. ఆరోగ్య ఉప కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు సహా అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. 


పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఇప్పటికే ఎక్కువగా ఉండగా.. తాజాగా పట్టణ శివార్లు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని స్థాయుల్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలని సూచించింది. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో పాజిటివ్‌ వచ్చినవారితో పాటు అనుమానితులను కూడా చేర్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే లోపలికి వచ్చేందుకు, బయటకు వెళ్లేందుకు వీరికి ప్రత్యేకంగా వేర్వేరు మార్గాలు ఉండాల్సిందేనని తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ వీరిని కలపొద్దని సూచించింది. 


ప్రత్యేక మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యాంశాలు..

  1. ప్రతి గ్రామంలో తీవ్ర అనారోగ్య, శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించాలి. 
  2. ఆరోగ్య, ఆశా కార్యకర్తల సాయంతో కొవిడ్‌ పరిస్థితులపై నిత్యం పర్యవేక్షించాలి. 
  3. కొవిడ్‌ లక్షణాలున్న వారికి కమ్యూనిటీ ఆరోగ్య అధికారి (సీహెచ్‌వో)తో టెలీ వైద్య సేవలు అందించాలి. 
  4. కోమార్బిడిటీస్‌,ఆక్సిజన్‌స్థాయిలు తక్కువగా ఉన్నవారిని ఆస్పత్రులకు పంపాలి.
  5. ర్యాపిడ్‌ టెస్టులు చేయడంలో సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి. 
  6. కేసుల తీవ్రతకు అనుగుణంగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలి. 
  7. 80-85 శాతం కేసులు లక్షణాల్లేవిని లేదా స్వల్ప లక్షణాలున్నవే ఉంటున్నాయి. అలాంటి వారు ఇళ్లు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. 
  8. గ్రామాల్లో అవసరమైనన్ని పల్స్‌ ఆక్సీమీటర్లు, ఽథర్మామీటర్లు అందుబాటులో ఉంచుకోవాలి.
  9. కొవిడ్‌ బారిన పడిన కుటుంబాలకు ఆక్సీమీటర్లు, థర్మామీటర్లను ఇచ్చి, వారు పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి తీసుకునే వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా వీటిని పర్యవేక్షించాలి. 
  10. కొవిడ్‌ బాధితులకు హోం ఐసోలేషన్‌ కిట్లను అందించాలి.
  11. ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. 

Updated Date - 2021-05-17T07:32:44+05:30 IST