కోవిషీల్డ్‌కు జతగా కొవాగ్జిన్ ..అద్భుత ఫలితాలు.. ఐసీఎమ్‌ఆర్ అధ్యయనంలో వెల్లడి
ABN , First Publish Date - 2021-08-08T20:05:24+05:30 IST
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) చేపట్టిన తాజాగా అధ్యయనంలో టీకా మిక్సింగ్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది.
న్యూఢిల్లీ: మొదటి డోసు కింద ఒక కరోనా టీకా, రెండో డోసు కింద మరో సంస్థ రూపొందించిన టీకా ఇవ్వడమే వ్యాక్సిన్ మిక్సింగ్..! రకరకాల వేరియంట్ల ద్వారా విడతల వారీగా జరుగుతున్న కరోనా దాడిని నిరోధించేందుకు ఇది ప్రభావశీలమైన ఆయుధమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక.. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) తాజాగా చేపట్టిన అధ్యయనంలోనూ టీకా మిక్సింగ్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లో మే, జూన్ నెలల్లో ఈ అధ్యయనం జరిగింది.
తొలి డోసులో అడినోవైరస్ వెక్టర్ ఆధారిత కరోనా టీకా(కోవిషీల్డ్), రెండో డోసు కింద హోల్లీ ఇనాక్టివేటెడ్ వైరస్(కొవాగ్జిన్) ఆధారిత కరోనా టీకాను ఇచ్చే విధానం సురక్షితమైనదే కాకుండా కొత్త కరోనా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ కూడా ఇస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పద్ధతితో టీకా కొరతను కూడా అధికమించవచ్చని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ ఫలితాల్ని స్వతంత్ర నిపుణులు సమీక్షించాల్సి ఉంది.
కాగా.. టీకా మిక్సింగ్ విషయమై కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) ఇటీవల ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ టీకాలను కలిపి ఇవ్వొచ్చని ఈ కమిటీ కూడా జులై 30న సూచించింది. ఇందుకోసం..కొవాగ్జిన్ టీకాకు జతగా ముక్కు ద్వారా ఇచ్చే మరో కరోనా టీకాను ఎంచుకోవాలని కూడా కమిటీ అప్పట్లో సూచించింది.