చేసిందంతా చేసి కన్నీరా..?
ABN , First Publish Date - 2021-05-25T07:32:23+05:30 IST
‘‘దేశంలోని క్లిష్టమైన పరిస్థితిని అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోదీ కన్నీరు పెడుతున్నారంటే ఏమిటి అర్థం? ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ర్యాలీలు చేసింది వారే. అప్పట్లో కొవిడ్ నియంత్రణ చర్యలను పాటించి ఉంటే పరిస్థితి చేయి దాటేది కాదు’’ అని మాజీ ప్రధాని
ఎన్నికల ర్యాలీలతోనే కొవిడ్ విస్తరణ
పీఎం మోదీ కన్నీటిపై దేవెగౌడ విసుర్లు
బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని క్లిష్టమైన పరిస్థితిని అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోదీ కన్నీరు పెడుతున్నారంటే ఏమిటి అర్థం? ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ర్యాలీలు చేసింది వారే. అప్పట్లో కొవిడ్ నియంత్రణ చర్యలను పాటించి ఉంటే పరిస్థితి చేయి దాటేది కాదు’’ అని మాజీ ప్రధాని దేవెగౌడ పేర్కొన్నారు. మోదీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం బెంగళూరులోని జేడీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కొన్ని రాష్ట్రాలలో వారి అంచనాలకు మించి కేసులు నమోదవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రధానికి 12 సలహాలతో లేఖ రాశానన్నారు. వాటిలో ఆరింటిని స్వీకరించారన్నారు. నెలరోజుల ముందే లాక్‌డౌన్ అమలు చేయాలని మాజీ సీఎం కుమారస్వామి సూచించారని, అప్పట్లో నిర్లక్ష్యం చేశారన్నారు. చేయిదాటాక లాక్‌డౌన్ విధించారని విమర్శించారు. కరోనా విషయంలో రాజకీయం చేసేది లేదన్నారు.
వ్యాక్సిన్, రెమ్‌డెసివిర్ మంజూరులో కేంద్రం సరిగా స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలకు ఎక్కువ గ్రాంట్లు ఇచ్చారని, కర్ణాటకకు తక్కువ ఇచ్చారన్నారు. ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాశామన్నారు. కొవిడ్ తీవ్రంగా ఉన్నందున కొన్ని రోజులుగా కార్యాలయానికి రాలేదన్నారు. బెంగళూరు పాలికె ఎన్నికలు సమీపిస్తున్నాయని, నగరానికి చెందిన ప్రముఖులతో చర్చించేందుకు వచ్చానని దేవేగౌడ తెలిపారు.