అసోం కొత్త సీఎంగా హిమంత విశ్వ శర్మ
ABN , First Publish Date - 2021-05-10T07:44:22+05:30 IST
అసోం నూతన ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత విశ్వ శర్మ (52) ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది...
- ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతల స్వీకరణ
- సోనోవాల్‌కు కేంద్ర కేబినెట్లో స్థానం!
గువహటి, మే 9: అసోం నూతన ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత విశ్వ శర్మ (52) ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. తాజా మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ స్థానంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికవడంతో పాటు ఎన్డీఏ పక్ష నాయకుడిగానూ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి శర్మ పేరును తాజా మాజీ సీఎం సోనోవాల్ ప్రతిపాదించగా బీజేపీతో పాటు మిత్రపక్షంలోని నేతలందరూ ఆమోదించారు. అసోంకు కేంద్ర పరిశీలకుడిగా ఉన్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ఈ మేరకు ప్రకటించారు. శర్మ, సోనోవాల్ ఇద్దరూ ఆదివారం ఢిల్లీలో పార్టీ అధిష్ఠానాన్ని కలిశారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మాజీ నేత అయిన శర్మ.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా తాజా మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కు కేంద్ర కేబినెట్లో స్థానం దొరికే అవకాశం ఉందని సమాచారం. 2016లో అసోం 14వ సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు సోనోవాల్.. కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు. గవర్నర్ జగ్దీశ్ ముఖిని ఆయన ఆదివారం కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.
సోనోవాల్ మార్గదర్శిగా ఉంటారు: శర్మ
తాజా మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ తనకు మార్గదర్శిగా ఉంటారని అసోం ముఖ్యమంత్రిగా ఎన్నికైన హిమంత విశ్వ శర్మ అన్నారు. ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడారు. నీతి, నిజాయతీతో తన విధులు నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. ఒక్క అవినీతి మచ్చ, ఆరోపణ కూడా లేకుండా సోనోవాల్ పని చేశారని ప్రశంసించారు. విలువలతో కూడిన రాజకీయాలను ఆయన అవలంబించారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేసి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అసోం గవర్నర్ జగ్దీశ్ ముఖిని కాబోయే సీఎం హిమంత విశ్వ శర్మ ఆదివారం రాజ్‌భవన్‌లో కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తామని గవర్నర్‌కు ఆయన వెల్లడించారు. తాజా మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌తో కలిసి గవర్నర్‌కు ఆయన తన నాయకుల జాబితాను అందజేశారు. శర్మ ప్రకటనను గవర్నర్ అంగీకరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. మొత్తం 125 సీట్లు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీఏకు 75 సీట్లు వచ్చాయి.
విద్యార్థి నాయకుడి నుంచి సీఎం వరకు
విశ్వశర్మ.. ఆల్ అసోం విద్యార్థి సంఘం( ఏఏఎ్సయూ)లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1991-92లో రాజనీతి శాస్త్రంలో పీజీ చేస్తూనే కాటన్ కాలేజీ యూనియన్ సొసైటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1979 నుంచి 1985 వరకు ఏఏఎ్సయూలో ఉన్నప్పుడు ప్రత్యేక అసోం రాష్ట్ర ఉద్యమంలో కీలక నేతగా ఉన్న ప్రఫుల్లా కుమార్ మహంతకు, అసోం గణ పరిషద్ నేత భ్రిగూ కుమార్ ఫుకాన్కు ఆయన దగ్గరయ్యారు. అయితే శర్మ అసలైన రాజకీయ జీవితం మాత్రం 1990 నుంచే ప్రారంభమైంది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా ఆయనను కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. తర్వాత జాలుక్‌బరి నియోజకవర్గంలో తన రాజకీయ గురువు భ్రిగూను ఆయన ఓడించారు. ఈ స్థానం నుంచి 4సార్లు గెలుపొందారు. కాంగ్రె్‌సలో నాటి సీఎం తరుణ్ గొగోయ్‌కు ఆయన నమ్మినబంటుగా ఉన్నారు. అయితే 2013లో సీఎం పదవికి తరుణ్తన కుమారుడు గౌరవ్ గొగోయ్ పేరును ప్రతిపాదించడంతో శర్మ అలకబూనారు. దీంతో అదే ఏడాది గొగోయ్ సర్కారుకు పది మంది ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా చేశారు. 2015లో కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరారు. గతంలో బీజేపీ ప్రభుత్వంలో పలు శాఖలను ఆయన నిర్వహించారు. ఈశాన్య భారతంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ మిషన్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు.