మన్ కీ బాత్ కాదు...పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్ చేయండి: మమత
ABN , First Publish Date - 2021-07-07T22:17:30+05:30 IST
రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న ఇంధనం ధరలు, వ్యాక్సిన్ కొరతపై ప్రధాని మోదీపై..
కోల్‌కతా: రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్న ఇంధనం ధరలు, వ్యాక్సిన్ కొరతపై ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు విమర్శలు చేశారు. ''మన్ కీ బాత్''కు బదులు ఆయన ''పెట్రోల్ అండ్ వ్యాక్సిన్ కీ బాత్'' చేయాలని అన్నారు. బుధవారంనాడు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రాలకు నిధులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డివిరిచి, సొంత జేబులు నింపుకుంటున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వారంలో నాలుగుసార్లు పెంచారని, ధరలు 10 నుంచి 12 రెట్లు పెంచారని అన్నారు. తద్వారా ప్రజల నుంచి కేంద్రానికి రూ.3.71 లక్షల కోట్లు వచ్చాయని అన్నారు. ఇది సామాన్య ప్రజానీకం నడ్డివిరిచి, సొంత జేబులు నింపుకోవడం కాదా అని మమతా బెనర్జీ నిలదీశారు.
కోవిడ్ వ్యాక్సిన్ల కింద రూ.35,000 కోట్లు ఉంచుకుని, సెకెండ్ వేవ్ మొదలైన తర్వాత నత్తనడకన కేంద్రం నిధులు విడుదల చేస్తుండటంపై మమత విమర్శలు గుప్పించారు. ఒకేసారి నిధులు ఎందుకు కేటాయించకూడదని ప్రశ్నించారు. తాము రూ.3 కోట్లు అడిగితే, ఇవ్వలేదని, ఆరు నెలల్లో తమకు కేవలం రూ.2 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఆయన (మోదీ) సొంత పార్టీ (బీజేపీ) రాష్ట్రాలకు ఎక్కువ సొమ్ములు ఇస్తూ, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులిస్తున్నారని సీఎం ఆరోపించారు.