అక్కడింకా ‘పాజిటివ్‌’

ABN , First Publish Date - 2021-07-11T08:28:37+05:30 IST

జాగ్రత్తల పాటింపులో ప్రజల నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా అంతం కాలేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది.

అక్కడింకా ‘పాజిటివ్‌’

  • 66 జిల్లాల్లో 10పైనే పాజిటివ్‌ రేటు.. 
  • అరుణాచల్‌, రాజస్థాన్‌లలో అత్యధికంగా 10
  • తెలంగాణలోని ఖమ్మంలో పాజిటివిటీ 12.37 
  • జూలై 8 నాటికి పరిస్థితిని వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 10: జాగ్రత్తల పాటింపులో ప్రజల నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా అంతం కాలేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. చాలా జిల్లాల్లో పాజిటివ్‌ రేటు ఎక్కువగా ఉంటోందని, ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని పేర్కొంటోంది. 80 శాతం కొత్త కేసులు 90 జిల్లాల నుంచే వస్తున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో జూలై 2-8 మధ్య వారంలో.. దేశంలోని 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 66 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రేటు 10 పైనే ఉందని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌లోని పదేసి జిల్లాలున్నాయి. మణిపూర్‌ (9), కేరళ (8) తర్వాతి స్థానాలో ఉన్నాయి. కాగా, కేంద్రం పేర్కొన్న జాబితాలో తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూడా ఉంది. ఈ జిల్లాలో పాజిటివిటీ 12.37 ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు (40 శాతం) ఎక్కువగా చేస్తున్నారు. ఈ విషయంలో రాజధాని హైదరాబాద్‌ (25 శాతం) కంటే మెరుగ్గా ఉంది. అయితే, సరిహద్దు జిల్లాల నుంచి ఖమ్మంకు వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉంది. పొరుగు జిల్లాల్లో యాంటీజెన్‌ టెస్టులే ఎక్కువగా చేస్తున్నారు. మరోవైపు స్థానిక గణాంకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో చాలా రోజులుగా కేసులు 400కు పైనే నమోదవుతున్నాయి. మే చివరి, జూన్‌ తొలి రెండు వారాల్లోనూ జిల్లాలో పాజిటివ్‌ రేటు అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది.


అత్యధికం ఈశాన్య రాష్ట్రాల్లోనే

కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొన్న 10 శాతం పాజిటివిటీ జిల్లాల్లో ఎక్కువ మేరకు ఈశాన్య రాష్ట్రాలవే. అరుణాచల్‌, మణిపూర్‌కు తోడు మేఘాలయ (6), అసోం, సిక్కిం (4), త్రిపుర (3), మిజోరం (2)లలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా, మహారాష్ట్రలో రెండు జిల్లాల్లోనే పాజిటివ్‌ రేటు 10కి పైగా ఉంది.


ఏపీలో ఒక్కటీ లేదు...!

కేంద్రం తాజాగా పేర్కొన్న ప్రకారం.. ఏపీలో పాజిటివిటీ 10పైగా ఉన్న జిల్లా ఒక్కటీ లేదు. అయితే, జూన్‌ 23-29 మధ్య విడుదల చేసిన గణాంకాల్లో దేశంలోని 71 జిల్లాల్లో పాజిటివ్‌ రేటు 10కి మించి ఉండగా.. అందులో ఏపీలోని 9 జిల్లాలున్నాయి. వాస్తవానికి ఈ నెల ప్రారంభం నుంచి ఏపీలో కేసులు మోస్తరుగా ఉం టున్నాయి. పాజిటివిటీ మాత్రం అన్ని జిల్లాల్లో 10 దిగువకు పడిపోయినట్లు కేంద్రం చెబుతుండటం గమనార్హం. 


కొవాగ్జిన్‌కు అనుమతులు ?!

ఇప్పటిదాకా 8 వ్యాక్సిన్లు డబ్ల్యూహెచ్‌వో నుంచి అత్యవసర వినియోగ అనుమతులు పొందగా.. తొమ్మిదో టీకాగా హైదరాబాద్‌లో తయారైన ‘కొవాగ్జిన్‌’ నిలిచే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి భారత్‌ బయోటె క్‌ కంపెనీ సమర్పించిన దరఖాస్తుపై ఆగస్టు మొదటి వారంలో డబ్ల్యూహెచ్‌వో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎ్‌సఈ) ఆధ్వర్యంలో శనివారమిక్కడ ఏర్పాటుచేసిన వెబినార్‌లో డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ ఈ విషయం వెల్లడించారు.  


అన్ని దేశాలకు ఉచితంగా ‘కొవిన్‌’ ప్లాట్‌ఫామ్‌ : నిర్మల

భారత వ్యాక్సినేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ‘కొవిన్‌’ ప్లాట్‌ఫామ్‌ను ఇతర దేశాలకు ఉచితంగా అందిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆమె రెండో రోజూ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-11T08:28:37+05:30 IST