ఏపీ తీరుతోనే కదలని రైల్వే లైన్లు

ABN , First Publish Date - 2021-03-18T06:45:36+05:30 IST

రైల్వే లైన్ల నిర్మాణానికి అయ్యే వ్యయం పంచుకోవడంలో మారిన ఏపీ ప్రభుత్వం వైఖరి రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. లోక్‌సభలో వైసీపీ

ఏపీ తీరుతోనే కదలని రైల్వే లైన్లు

వాటా నిధులు ఇవ్వని రాష్ట్ర సర్కారు

ఎలహంక-పెనుగొండ లైన్‌ కోసం ఇవ్వాల్సిన 200కోట్లలో 50కోట్లే జమ

రాష్ట్రంలో మిగతా లైన్లదీ ఇదే పరిస్థితి

మాకే 2,612 కోట్లు బకాయి ఉన్నారు

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ప్రశ్నకు లోక్‌సభలో మంత్రి పీయూష్‌ జవాబు


న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైల్వే లైన్ల నిర్మాణానికి అయ్యే వ్యయం పంచుకోవడంలో మారిన ఏపీ ప్రభుత్వం వైఖరి రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘2015-16 బడ్జెట్‌లో ప్రకటించిన  కర్ణాటకలోని ఎలహంక - పెనుగొండ (120 కిమీ) లైను డబ్లింగ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,147 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాం. ఇప్పటి వరకు రూ. 912 కోట్లు ఖర్చు చేసి 72 కిలోమీటర్ల మేర పూర్తి చేశాం. ఈ బడ్జెట్‌లో రూ. 160 కోట్లు కేటాయించాం. తమతమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు కోసం కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలు 50 శాతం నిధులు భరించాలి. ఆ లెక్క రూ. 200 కోట్లు ఇవ్వడానికి 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం అంగీకరించి రూ.50 కోట్లు డిపాజిట్‌ చేసింది. 


అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ మిగతా నిధులు ఇవ్వలేదు. అయితే, మా సొంత వనరులను ఉపయోగించి ఎలహంక-పెనుగొండ లైనును పూర్తి చేయాలని నిర్ణయించాం’’ అని మంత్రి పీయూష్‌ వివరించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సగటున ఏటా రూ.2,830 కోట్లు కేటాయించామని, 2021 -22లో రూ. 5,812 కోట్లు బడ్జెట్‌లో పెట్టామని మంత్రి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో 841 కిలోమీటర్ల మేర  రూ. 10,200 కోట్ల వ్యయంతో నాలుగు కొత్త లైను ప్రాజెక్టులు చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టకపోవడం, తన వాటాగా ఇవ్వాల్సిన రూ.1,636 కోట్లు డిపాజిట్‌ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు మొత్తం రూ. 2,612 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని  వెల్లడించారు.  


అమరావతి లైన్‌పై ఉదాశీనత: కనకమేడల

రాజధాని అమరావతి రైల్వే లైను ప్రాజెక్టుపట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. బుధవారం రాజ్యసభలో  రైల్వే మంత్రిత్వశాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘ఏపీ పునర్విభజన చట్టం-2014కు లోబడి 2016లో అమరావతి రైల్వే లైను ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. 106 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టుకు రూ.3,272కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు.  కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవడానికితోడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహక రించకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలడంలేదు. ప్రాజెక్టును కార్యరూపంలో పెట్టాలి’’ అని కనకమేడల కోరారు.

Updated Date - 2021-03-18T06:45:36+05:30 IST