రాజీవ్ దూరదృష్టితో ఆధునిక భారతం : రాహుల్

ABN , First Publish Date - 2021-08-20T23:37:09+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ దూరదృష్టి ఆధునిక భారత

రాజీవ్ దూరదృష్టితో ఆధునిక భారతం : రాహుల్

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ దూరదృష్టి ఆధునిక భారత నిర్మాణానికి దోహదపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజీవ్ 77వ జయంతి సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ ఆయనకు నివాళులర్పించింది. రాజీవ్ స్మారక స్థలం వీర్ భూమిలో ఆయనకు రాహుల్ గాంధీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్నారు. 


రాహుల్ గాంధీ ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో, రాజీవ్ గాంధీకి అద్భుతమైన దూరదృష్టి ఉందని పేర్కొన్నారు. దూరదృష్టితో ఆయన రూపొందించిన విధానాలు ఆధునిక భారత దేశ నిర్మాణానికి దోహదపడ్డాయన్నారు. ఆయన మంచి తండ్రి అని, కారుణ్యం, ప్రేమ నిండిన వ్యక్తి అని పేర్కొన్నారు. తన హృదయంలో ఆయన ఎల్లప్పుడూ సజీవంగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు. వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించానని పేర్కొన్నారు. 


రాజీవ్ గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. ‘‘లౌకికవాద భారత దేశం మాత్రమే భారత దేశం, అది మాత్రమే మనుగడ సాగించగలుగుతుంది’’ అని రాజీవ్ చెప్పారని పేర్కొన్నారు. 


రాహుల్ గాంధీతోపాటు వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి నివాళులర్పించినవారిలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పవన్ కుమార్ బన్సల్, కేసీ వేణుగోపాల్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్ ఉన్నారు. 


కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పార్లమెంటు హౌస్‌లో రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. యూత్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజీవ్ విగ్రహాన్ని రాహుల్ ఆవిష్కరించారు.


ప్రియాంక గాంధీ కూడా తన బాల్యంనాటి ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన తండ్రి రాజీవ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.


Updated Date - 2021-08-20T23:37:09+05:30 IST