కేంద్రంపై శత్రుఘ్న సిన్హా వ్యంగ్యాస్త్రాలు
ABN , First Publish Date - 2021-02-06T02:32:19+05:30 IST
రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందింస్తున్న తీరును తప్పుబడుతున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శత్రుఘ్న
న్యూఢిల్లీ : రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందింస్తున్న తీరును తప్పుబడుతున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని, అంతకంటే పెద్దదైన విషయమేమీ కాదని అన్నారు. ‘‘దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందించిన తీరు అభినందనీయం. వారిని అభినందిస్తున్నా. మనం గ్లోబల్ ప్రపంచంలో నివసిస్తున్నామని ప్రధాని మోదీ ఇప్పటికే పలు మార్లు ఉటంకించారు. ఇది దేశ సమస్య మాత్రమే కాదు. ఇది రైతుల సమస్య. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు అన్ని బాధలూ మరిచి నిరసనకు దిగారు. వారి డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేశారు.’’ అని శత్రుఘ్న పేర్కొన్నారు.
సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు నిరసన వ్యక్తం చేసి, నిరసనకు ఓ కొత్త రూపాన్ని ఇచ్చారని అభినందించారు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని, ఆ క్రమంలోనే సెలెబ్రెటీలు స్పందించారని ఆయన పేర్కొన్నారు. రైతుల ఉద్యమాన్ని చూసే విదేశీ సెలెబ్రెటీలు రైతుకు మద్దతిచ్చారని, గ్లోబల్ ప్రపంచంలో వారు కూడా భాగస్వాములు కాబట్టే, స్పందించారని శత్రుఘ్న కేంద్రానికి చురకలంటించారు. ‘‘పాప్ సింగర్ రిహన్నా ట్వీట్‌తో వచ్చిన నష్టమేమి? ఆమె ఏం రాశారు? రైతుల ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు అని అన్నారు. రైతులకు న్యాయం జరగాల్సిందే.’’ అని శత్రుఘ్న పేర్కొన్నారు .