Shivamoggaలో హోరాహోరీ
ABN , First Publish Date - 2021-11-30T18:15:06+05:30 IST
రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా బీజేపీ కంచుకోటల్లో ఒకటి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో సహజంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక
- కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీకి అగ్నిపరీక్షే
- గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ
- జేడీఎస్ ఓట్లే కీలకం
- సొంత జిల్లాలో విజయానికి యడియూరప్ప అండ
బెంగళూరు: రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా బీజేపీ కంచుకోటల్లో ఒకటి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో సహజంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల నుంచి జిల్లాలోని ఒక స్థానానికి జరుగుతున్న పోరులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. గతంలో జరిగిన ఎన్నికల్లో 434 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్. ప్రసన్నకుమార్ అనూహ్య రీతిలో విజయం సాధించారు. మరోమారు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాకపోతే ఈసారి ఆయనకు విధానపరిషత్ మాజీ సభాపతి, బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తి తనయుడు డీఎస్ అరుణ్ గట్టిగానే పోటీ ఇస్తున్నారు. తనయుడి విజయం కోసం స్వయంగా శంకరమూర్తి బరిలోకి దిగి చక్రం తిప్పుతున్నారు.
గెలుపు అంచనాలు ఇవే..
గత ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటల కారణంగా బీజేపీ ఇ క్కడ ఓటమి చవి చూసింది. ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉండటంతో బీజేపీకి గెలుపుపై విశ్వాసం పెరుగుతోంది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రామీణాభివృ ద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, హోంశాఖ మంత్రి ఆరగ జ్ఙానేంద్ర, ఎంపీ బీవై రాఘవేంద్ర బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో బీజేపీకి ఇద్దరు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల ఓట్లతో కలుపుకుని ఖచ్చితంగా పడే ఓట్లు 151 దాకా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఇద్దరు ఎ మ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలుపుకుని ఖచ్చితంగా పడే ఓట్లు 82 వరకు ఉన్నాయి. జడ్పీ, టీపీలలో 16 మంది స్వతంత్రుల ఓట్లు కీలకంగా మారాయి. సొరబలో మాజీ ఎమ్మెల్యే మధు బంగారప్ప, తీర్థహళ్లిలో అపెక్స్ బ్యాంకు మాజీ చైర్మన్ ఆర్‌ఎం మంజునాథగౌడ కాంగ్రెస్‌లో చేరడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి బరిలో లేకపోవడంతో శివమొగ్గ గ్రామీణ, భద్రావతి నియోజకవర్గాల్లో ఓటర్లు ఎటు మొగ్గుతారనేది కుతూహలంగా మారింది. ఈ స్థానంలో అర్హులైన పురుష ఓటర్లు 2009 మంది, మహిళా ఓటర్లు 2,170 మంది మొత్తం 4,179 మం ది ఓటర్లు ఉన్నారు. 2015లో ఇక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్.ప్రసన్నకుమార్‌కు 1800 ఓట్లు రాగా జేడీఎస్ అభ్యర్ధి హెచ్‌ఎన్ నిరంజన్‌కు 1366 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఆర్‌కేఈ సిద్ధరామయ్యకు 1292 ఓట్లు లభించాయి. ఈసారి జేడీఎస్ తన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏమిటన్నది అంతుబట్టడం లేదు. జేడీఎస్‌కు నగర సంస్థల్లో 26 ఓట్లున్నాయి. శివమొగ్గ గ్రామీణ, భద్రావతి శాసనసభ నియోజకవర్గాల్లో 500 మందికి పైగా జిల్లా, తాలూకా పంచాయతీ సభ్యులున్నారు. పార్టీ చాలా బలోపేతంగా ఉండటం తన గెలుపునకు సో పానం కానుందని బీజేపీ అభ్యర్ధి డీఎస్ అరుణ్ ఆశాభావంతో ఉన్నారు. కాగా పంచాయతీల్లో బీజేపీకి దీటుగా తమకు ఓట్లు ఉన్నాయని పైగా సిద్ధాంతపరంగా జేడీఎస్ ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్నకుమార్ ఆశాభావంతో ఉన్నాయి. ఇరు పార్టీల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. స్వయంగా మాజీ సీఎం యడియూరప్ప బీజేపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. మరో వైపు తన పుత్రరత్నం అరుణ్ విజయానికి సహకరించాలంటూ మాజీ సభాపతి శంకరమూర్తి స్వయంగా జేడీఎస్ అగ్రనేతలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. జేడీఎస్ ఓట్లు ఎటు మొగ్గితే ఫలితం అటే ఉంటుందని రేసులో ప్రస్తుతానికి బీజేపీదే పైచేయిగా ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.