స్టార్టప్‌ సంస్కృతి శక్తిమంతమవుతోంది!

ABN , First Publish Date - 2021-08-30T07:46:49+05:30 IST

భారత్‌లో స్టార్టప్‌ సంస్కృతి శక్తిమంతంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం యువత స్టార్ట్‌పలు ప్రారంభిస్తున్నారని చెప్పారు...

స్టార్టప్‌ సంస్కృతి శక్తిమంతమవుతోంది!

  • ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 29: భారత్‌లో స్టార్టప్‌ సంస్కృతి శక్తిమంతంగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో సైతం యువత స్టార్ట్‌పలు ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమన్నారు. ఆదివారం ఆయన ‘మన్‌కీ బాత్‌’లో భాగంగా రేడియోలో ప్రసంగించారు. దేశంలో అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు యువత దృష్టిని బాగా ఆకర్షించాయని మోదీ చెప్పారు. మన దేశ సమున్నత ఆధ్యాత్మిక సంప్రదాయం, టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ఉత్తమ ప్రదర్శన సహా ప్రధాని తన ప్రసంగంలో అనేక అంశాలపై మాట్లాడారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘనంగా నివాళులర్పించారు. ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకొంటారు. హాకీలో భారత పురుషుల జట్టు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. యువకులు ఇప్పుడు క్రీడలపై దృష్టి పెడుతున్నారని, వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇదే మనం ధ్యాన్‌చంద్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు.  యువత సొంతంగా స్టార్టప్‌ ప్రారంభించడానికి లేదా అందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.  కొద్ది రోజుల కిందట ఆటబొమ్మల తయారీ గురించి చర్చించామని.. ఇది యువత దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. ‘‘మన పండగల పరమార్థాన్ని గ్రహిద్దాం. ప్రతి పండగలోనూ అంతర్లీనంగా ఒక సందేశం ఉంటుంది’’ అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని అమెరికా మహిళ, ఇస్కాన్‌ భక్తురాలు జదురాణి దాసితో మాట్లాడారు. అలాగే ఇండోర్‌లో జరుగుతున్న ‘వాటర్‌ ప్లస్‌ సిటీ’ ప్రచారం గురించీ ప్రస్తావించారు. వాటర్‌ ప్లస్‌ సిటీ అంటే మురుగు నీటిని శుద్ధి చేయకుండా ఎలాంటి నీటి వనరుల్లోకి వదలకపోవడం. 


Updated Date - 2021-08-30T07:46:49+05:30 IST