హఫీజ్‌పేట భూములపై సుప్రీం స్టేటస్ కో
ABN , First Publish Date - 2021-07-06T08:46:24+05:30 IST
హఫీజ్‌పేట భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
భూములపై వక్ఫ్ ట్రైబ్యునల్ తేల్చాలి: బెంచి
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): హఫీజ్‌పేట భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబరు 80లో 140 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకే చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను కలిపి సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతివాదులైన వ్యాపారవేత్త కటికనేని ప్రవీణ్ కుమార్, సాయిపవన్ ఎస్టేట్స్ సంస్థకు నోటీసులు జారీచేసింది. ‘‘ఈ భూములు వక్ఫ్ బోర్డువా? కావా? అన్నది వక్ఫ్ ట్రైబ్యునల్ నిర్ణయించాలి కదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్ ట్రైబ్యునలే నిర్ణయించాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, ప్రభుత్వ న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి చెప్పారు. రిజిస్ట్రేషన్లను, మ్యుటేషన్లను నిలువరించాలని వారు విజ్ఞప్తి చేయగా.. భూములపై స్టేటస్ కో విధించింది. ఈ భూములపై జస్టిస్ వీ రామసుబ్రమణియన్ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమయంలో తీర్పు ఇచ్చారని, కాబట్టి ఈ ధర్మాసనంలో ఆయన ఉండటంపై కటికనేని తరఫు న్యాయవాది వికాస్ సింగ్ అభ్యంతరం తెలిపారు.