మహిళలను తాలిబన్లు వదిలిపెట్టరు: ఆఫ్ఘన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్
ABN , First Publish Date - 2021-08-20T00:09:49+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని తాలిబిన్లు ఇచ్చిన హామీ బూటకమని
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని తాలిబన్లు ఇచ్చిన హామీ బూటకమని, త్వరలో వారి విశ్వరూపం ఏంటో చూస్తారని ఆప్ఘనిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ తొలి మహిళా పైలట్ నిలూఫర్ రహమానీ అన్నారు. ఎలాంటి కారణం లేకుండానే కాబూల్ స్టేడియంలో మహిళను రాళ్లతో కొట్టడాన్ని మీరు చూస్తారని అన్నారు. మాజీ పైలట్ అయిన 29 ఏళ్ల నిలూఫర్ ‘ఫాక్స్ న్యూస్’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తాలిబన్లు ఏం చేయబోతున్నారో ప్రపంచం తప్పకుండా చూస్తుంది. ఎలాంటి కారణం లేకుండానే కాబూల్ స్టేడియంలో ఒక మహిళపై రాళ్లు రువ్వబోతున్నారు’’ అని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తు తన కుటుంబం ఇంకా అక్కడే ఉందని పేర్కొన్న ఆమె.. ఆఫ్ఘనిస్థాన్‌లో ఏం జరుగుతోందో తెలిసిన తర్వాత నిద్ర కూడా రావడం లేదన్నారు. మనసు కుదురుగా ఉండడం లేదని, వారి భద్రతపై ఆందోళనగా ఉందని అన్నారు. ఇది తన ఒక్కరి సమస్య మాత్రమే కాదని వివరించారు. తన కుటుంబం, తల్లిదండ్రులు ప్రమాదంలో ఉన్నారని, తాలిబన్లు వారిని లక్ష్యంగా చేసుకున్నారని నిలూఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరియర్ మొత్తం వారు తనకు అండగా ఉన్నందుకు తాలిబన్లు వారిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. తనను చంపేస్తామంటూ 2013 నుంచే తాలిబన్లు తనను హెచ్చరిస్తున్నారని అన్నారు.
నిలూఫర్ రహమాని 2013లో ఆఫ్ఘనిస్థాన్ తొలి మహిళా పైలట్‌గా బాధ్యతలు చేపట్టారు. 2015లో ఆమె అమెరికా వెళ్లి 18 నెలల శిక్షణను పూర్తిచేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టిన ఏడాదికే అంటే 2016లో ఆమె అమెరికా ఆశ్రయం కోరారు. కాగా, ఇస్లామిక్ చట్టాలను అనుసరించి మహిళలకు హక్కులు ఉంటాయని తాలిబన్లు మంగళవారం ప్రకటించారు. తమతో పోరాడిన వారిని క్షమించేస్తున్నామని, ఆఫ్ఘనిస్థాన్ ఇకపై ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రహమాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తాలిబన్ ఫైటర్లను ఓ మహిళా జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు మహిళా రాజకీయ నాయకులకు ఓటు వేయడానికి అనుమతిస్తారా? అని జర్నలిస్ట్ ప్రశ్నించగా... వారు దానికి బదులివ్వకుండా ఫక్కున నవ్వేశారు. అంతేకాదు, వీడియో రికార్డింగ్ ఆపాలని ఆమెను కోరారు. తాలిబన్ ఫైటర్లలో ఒకరు.. ఆ ప్రశ్న వినగానే నవ్వువచ్చిందని చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.