చైనా టెలికాం కంపెనీపై అమెరికా వేటు
ABN , First Publish Date - 2021-10-28T00:12:24+05:30 IST
చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ అమెరికన్
వాషింగ్టన్ : చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ అమెరికన్ మార్కెట్ నుంచి బహిష్కరణకు గురైంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో దేశ భద్రతకు, చట్టాల అమలుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ ఈ కంపెనీ కార్యకలాపాలను 60 రోజుల్లోగా నిలిపేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మంగళవారం ఆదేశించింది.
చైనా టెలికాం (అమెరికాస్) కార్పొరేషన్ చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు పెద్ద టెలికాం సంస్థల్లో ఒకటి. అమెరికాలో ఈ కంపెనీ అందిస్తున్న డొమెస్టిక్ ఇంటర్‌స్టేట్, ఇంటర్నేషనల్ సర్వీస్‌ను 60 రోజుల్లోగా నిలిపేయాలని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మంగళవారం ఓ ఆర్డర్‌ను జారీ చేసింది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కంపెనీ నడుస్తోందని, దీనిని చైనా ప్రభుత్వమే నియంత్రిస్తోందని, అందువల్ల అమెరికా దేశ భద్రత, చట్టాల అమలుకు హాని జరిగే అవకాశం ఉందని తెలిపింది. చైనా ప్రభుత్వం ఈ కంపెనీ ద్వారా అమెరికాలో గూఢచర్యానికి, ఇతర హానికర కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ కూడా దీనిని కొనసాగిస్తున్నారు.