ట్రాక్టర్‌ ర్యాలీ మృతుని కుటుంబం న్యాయ విచారణ కోరుతోంది : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-02-04T23:09:02+05:30 IST

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు

ట్రాక్టర్‌ ర్యాలీ మృతుని కుటుంబం న్యాయ విచారణ కోరుతోంది : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు నిజమైన రైతు పోరాటంగా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఈ పోరాటం వెనుక ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. రైతులు తమ ఆవేదనను బయటపెడుతున్నారని చెప్పారు. గణతంత్ర దినోత్సవాలనాడు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన రైతు నవనీత్ సింగ్ కుటుంబ సభ్యులు ఈ సంఘటనపై న్యాయ విచారణ జరగాలని కోరుతున్నారని తెలిపారు. 


కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రైతులు  గణతంత్ర దినోత్సవాలనాడు దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటీఓ వద్ద ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న నవనీత్ సింగ్ దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన నడుపుతున్న ట్రాక్టర్ ఓ బారికేడ్‌ను ఢీకొని, బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. 


నవనీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌‌ వెళ్ళారు. నవనీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, మృతుని కుటుంబ సభ్యులు ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. తాము రైతులకు, వారి కుటుంబాలకు మద్దతుగా ఉంటామని చెప్పారు. ఈ ఉద్యమం నిజమైన పోరాటమని మన ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించడం లేదన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయాలు లేవన్నారు. ఇది రైతుల ఆవేదన అని తెలిపారు. 


కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని, ఇవి రైతుల పట్ల నేరపూరితమైనవని చెప్పారు. అమర వీరులను ఉగ్రవాదులుగా అభివర్ణించడం మరింత నేరమని ఆరోపించారు. 


కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 11 సార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చట్టాల అమలును కొంత కాలంపాటు నిలిపి ఉంచుతామని ప్రతిపాదించింది. 


Updated Date - 2021-02-04T23:09:02+05:30 IST