సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
ABN , First Publish Date - 2021-08-13T23:33:08+05:30 IST
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది
న్యూఢిల్లీ : ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉపయోగం తక్కువగా ఉంటూ, చెత్తగా పోగుపడే అవకాశం అధికంగా ఉన్న వస్తువుల తయారీ, నిల్వ, దిగుమతి, పంపిణీ, అమ్మకం, వినియోగాలపై విధించిన ఈ నిషేధం 2022 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. దీని ప్రకారం 2022 జూలై 1 నుంచి కొన్ని రకాల వస్తువులపై నిషేధం అమలవుతుంది. ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్‌బడ్స్, బెలూన్స్‌కు ఉండే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్ కోసం ఉపయోగించే పాలీస్టైరీన్, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, చెమ్చాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్స్‌ల ర్యాపింగ్, ప్యాకింగ్ ఫిలింస్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బ్యానర్లు వంటివాటిపై ఈ నిషేధం అమలవుతుంది.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 2021 సెప్టెంబరు 30 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్ల నుంచి 75 మైక్రాన్లకు, 120 మైక్రాన్లకు పెంచుతారు. ఇవి దళసరిగా ఉంటాయి కాబట్టి వీటిని, మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి అనుమతి ఇస్తారు.
ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వ్యర్థాలను పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ ఓనర్స్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, 2016 ప్రకారం సేకరించి, నిర్వహిస్తారు.