భారత్‌కు పెద్దన్న ఆపన్న హస్తం

ABN , First Publish Date - 2021-04-27T07:28:03+05:30 IST

‘‘కరోనా తొలినాళ్లలో మమ్మల్ని భారత్‌ ఆదుకుంది. మా ఆస్పత్రులు రోగులతో నిండిపోయినప్పుడు.. మందులు పంపి సాయం చేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది...

భారత్‌కు పెద్దన్న ఆపన్న హస్తం

  • టీకా ముడిసరుకు, ఇతర పరికరాలిస్తాం
  • తొలినాళ్లలో భారత్‌ ఆదుకుంది: బైడెన్‌
  • బైడెన్‌, జపాన్‌ ప్రధానికి మోదీ ఫోన్‌
  • నా గుండె ముక్కలైంది: సత్య నాదెళ్ల
  • రూ.135 కోట్ల ఆర్థిక సాయం: పిచాయ్‌

వాషింగ్టన్‌, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: ‘‘కరోనా తొలినాళ్లలో మమ్మల్ని భారత్‌ ఆదుకుంది. మా ఆస్పత్రులు రోగులతో నిండిపోయినప్పుడు.. మందులు పంపి సాయం చేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మా మిత్ర దేశానికి   సాయం చేస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌కు సాయం’పై అమెరికా కాంగ్రె్‌సలో ఆదివారం ప్రత్యేక చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యులు.. భారత్‌ విషయంలో ముక్తకంఠంతో భారత్‌కు మద్దతు పలికారు. అమెరికాలో ప్రతి పౌరుడికి సరిపడా టీకా నిల్వలున్న నేపథ్యంలో.. మిగులు టీకాలను వెంటనే భారత్‌కు పంపాలని డిమాండ్‌ చేశారు. ఆ వెంటనే.. భారత్‌కు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ కోసం ముడిసరుకును, ఆక్సిజన్‌, పీపీఈ, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను అందజేస్తామని వైట్‌హౌస్‌ ప్రకటించింది. భారత్‌కు అవసరమైన సాయాన్ని త్వరితగతిన అందిస్తామని అమెరికా  ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. అమెరికా సాయం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఇరుదేశాల్లో కరోనా పరిస్థితి గురించి మాట్లాడుకున్నామని వెల్లడించారు. అమెరికా భారతదేశానికి చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు చెప్పానని, భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ మైత్రి గురించి వివరించానన్నారు. హైదరాబాద్‌లోని బయలాజికల్‌-ఈ సంస్థ తయారు చేస్తున్న టీకాకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అమెరికా అభివృద్ధి ఆర్థిక సంస్థ చెప్పింది. మరోవైపు, తాము ఆర్డర్‌ ఇచ్చిన ఆస్ట్రాజెనెకా టీకాలు అందగానే వాటన్నింటినీ విదేశాలకు ఇచ్చేస్తామని అమెరికా ప్రకటించింది. 


ఆక్సిజన్‌ పంపుతాం: ఆస్ట్రేలియా

కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తక్షణం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపుతామని ఆస్ర్టేలియా ప్రకటించింది. కాగా, భారత్‌ కరోనాను జయిస్తుందనియూఏఈ విశ్వాసం వ్యక్తం చేసింది. భారత్‌కు మద్దతుగా దుబాయ్‌లోని అతి ఎత్తైన భవనం బుర్జ్‌-ఎ-ఖలీఫా సహా..  ప్రభుత్వ కార్యాలయాలపై, ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సాంకేతిక సహకారం అందించేందుకు జపాన్‌ ముందుకు వచ్చింది. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాతో టెలిఫోన్‌లో మాట్లాడారు. కొవిడ్‌పై పోరులో టెక్నాలజీ సహకారంపై ఇరువురు చర్చించినట్లు మోదీ ట్విటర్‌లో తెలిపారు. పొరుగు దేశం చైనా భిన్నవైఖరి బట్టబయలైంది. మూడు రోజుల క్రితం భారత్‌కు సాయం చేస్తానని ప్రకటించినా.. కీలక సమయంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ పరికరాలు అందకుండా.. కార్గో సేవలపై 15 రోజులపాటు నిషేధం విధించింది. దీన్ని చైనాలోని ట్రేడర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా, భారత్‌లో కరోనా ఉధృతిని చూసి తన గుండె ముక్కలైందని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ఆక్సిజన్‌ పరికరాల కొనుగోలులో భారత్‌కు మద్దతిస్తామని చెప్పారు. భారత్‌కు సాయం చేసేందుకు ముందుకువచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ తన వనరులను ఉపయోగిస్తుందన్నారు. భారత్‌కు సాయం అందించేందుకు తమ సంస్థ సహాయ నిధి నుంచి రూ.135 కోట్లు విడుదల చేస్తున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు. భారత్‌లో రోజురోజుకూ తీవ్రమవుతోన్న కొవిడ్‌ ఉద్ధృతి తమను షాక్‌కు గురిచేసిందంటూ ఆయన ట్వీట్‌ చేశారు.


Updated Date - 2021-04-27T07:28:03+05:30 IST