దేశవ్యాప్తంగా టీకా సరఫరా షురూ
ABN , First Publish Date - 2021-01-13T07:22:51+05:30 IST
ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా టీకా కార్యక్రమానికి తొలి అడుగు పడింది. వ్యాక్సినేషన్ తొలి దశలో 3 కోట్ల మందికి(వైద్యులు, వైద్యసంరక్షణ సిబ్బంది,
తొమ్మిది విమానాల్లో 13 నగరాలకు తరలింపు
రేపటి లోగా అన్ని రాష్ట్రాలకూ పంపిణీ: కేంద్రం
రూ. వెయ్యికే కొవిషీల్డ్ వ్యాక్సిన్: అదర్ పూనావాలా
పుణె నుంచి తొలి విమానం ఢిల్లీకి!.. తొలి రోజు 56.5 లక్షల డోసుల పంపిణీ
న్యూఢిల్లీ, పుణె, హైదరాబాద్, జనవరి 12: ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా టీకా కార్యక్రమానికి తొలి అడుగు పడింది. వ్యాక్సినేషన్ తొలి దశలో 3 కోట్ల మందికి(వైద్యులు, వైద్యసంరక్షణ సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది తదితరులకు) ఇచ్చేందు కు వ్యాక్సిన్లు పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి దేశం నలుమూలలకూ చేరుకుంటున్నాయి. జనవరి 16 నుంచి ఇచ్చేందుకు తొలివిడతగా 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఇండి గో, గో ఎయిర్‌కు చెందిన 9 విమానాల ద్వారా పుణె నుంచి దేశంలోని 13 నగరాలకు తరలించారు.
తొలి టీకాలు పుణె నుంచి ఢిల్లీలోని సెంట్రల్ స్టోరేజ్ ఫెసిలిటీకి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు పుణెలో బయల్దేరిన విమానం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. అంతకుముందు సీరం ఇన్స్టిట్యూట్ ద్వారాల వద్ద తెల్లవారుజాము 5 గంటలకు టీకాలున్న 3 ట్రక్కులకు పూజ నిర్వహించారు. పుణె నుంచి విమానాలు బయల్దేరగానే కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
పుణె నుంచి అహ్మదాబాద్‌కు ఎయిరిండియా విమానంలో 700 కిలోల బరువున్న 2,76,000 డోసుల వ్యాక్సిన్‌ను తరలించారు. చండీగఢ్, లఖ్‌నవూకు ఇండిగో విమానాల్లో 900 కిలోల బరువున్న వ్యాక్సిన్లను పంపారు. గో ఎయిర్ విమానంలో చెన్నైకి 70,800 వయల్స్‌ను పంపారు. స్పైస్ జెట్ విమానాల్లో గువాహటికి 2,76,000 డోసులు, కోల్‌కతాకు 9,96,000 డోసులు, హైదరాబాద్‌కు 3,72,000 డోసులు, భువనేశ్వర్‌కు 4,80,000 డోసులు, బెంగళూరుకు 6,48,000 డోసులు, పట్నాకు 5,52,000 డోసులు తరలించారు. ఎస్ఐఐ నుంచి మూడు ట్రక్కుల టీకాలు ముంబైకి బయల్దేరాయి. బుధవారం ఉదయం ముంబై నుంచి ఆ టీకాలను దేశంలోని 27 నగరాలకు పంపిణీ చేయనున్నారు.
చాయిస్ లేదు!
ప్రభుత్వం టీకా కార్యక్రమం కోసం 2 కంపెనీల వ్యాక్సిన్లను (కొవిషీల్డ్, కొవాగ్జిన్) వినియోగిస్తున్నప్పటికీ వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టంచేశారు.
‘కొవిన్’ యాప్‌లో ఇప్పటికే కోటి మంది లబ్ధిదారుల వివరాలు నమోదయ్యాయని, టీకా వేసే తేదీకి ఒకరోజు ముందు లబ్ధిదారులఫోన్లకు మెసేజ్‌లు అందుతాయన్నారు. టీకా కేంద్రాల్లో ఏ టీకా ఉంటే అదే వేయించుకోవాలని చెప్పారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేస్తామని.. తొలి డోసు వేయించుకున్న 14 రోజుల తర్వాతే టీకా ప్రభావశీలత కనిపించడం ప్రారంభమవుతుందని చెప్పారు.
జైడస్ క్యాడిలా, స్పుత్నిక్-వి, బయొలాజికల్-ఈ, జెన్నోవా సహా మరిన్ని కంపెనీల వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ పరీక్షల దశల్లో ఉన్నాయని, అవి కూడా త్వరలోనే ఔషధ నియంత్రణ సంస్థను సంప్రదించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
టీకా కార్యక్రమం నిమిత్తం సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీల నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న 6 కోట్ల డోసుల వ్యాక్సిన్ల విలువ రూ.1300 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఇప్పటికే కరోనా టీకా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్ని దేశాల్లోనూ కలిపి నెల రోజుల్లో 2.5 కోట్ల మందికే టీకాలు వేశారు. మనదేశంలో రానున్న కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
చరిత్రాత్మక ఘట్టం: అదర్ పూనావాలా
కొవిషీల్డ్ వ్యాక్సిన్ల తరలింపును గర్వకారణమైన చరిత్రాత్మక ఘట్టంగా సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా అభివర్ణించారు. తమ ప్రాంగణం నుంచి వ్యాక్సిన్ ట్రక్కులు పుణె ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వా త ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్‌ను వైరస్ ముప్పు ఉన్నవారి వద్దకు, వైద్య సిబ్బంది వద్దకు తీసుకెళ్లడమే అసలైన సవాల్ అన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతుగా భారత ప్రభుత్వానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రత్యేక ధరకు ఇస్తున్నామని, ప్రైవేటు మార్కెట్లో కూడా రూ.1000కి అందుబాటులోకి తెస్తామని అదర్ పూనావాలా తెలిపారు.
ఆ టీకాల రేట్లు.. అ‘ధర’హో!
ప్రస్తుతం దేశంలో టీకా కార్యక్రమం కోసం ఎంచుకున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ కాక.. మిగతా వ్యాక్సిన్ల ధరలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం ఆయా టీకాల ధరలు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ల కంటే భారీగా ఉన్నాయి.
..ఈ టీకాల్లో ఒక్క ఫైజర్ తప్ప మిగతా వాటన్నింటినీ 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరిస్తే సరిపోతుంది. ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద భద్రపరచాల్సి ఉంటుందని రాజేశ్ భూషణ్ వివరించారు.
ఎంతెంత అంటే..
టీకా ధర(డోసుకు రూ.లలో)
ఫైజర్ 1431
మోడెర్నా 2348 నుంచి 2715
సినోవ్యాక్ 1027
నోవావ్యాక్స్ 1114
స్పుత్నిక్ వి 734
జాన్సన్ అండ్ జాన్సన్ 734