NTR కోసం పది లక్షలు ఖర్చు పెట్టా.. నేను లక్షతోనే ఎన్నికల్లో గెలిచా..
ABN , First Publish Date - 2021-10-11T06:54:12+05:30 IST
చంద్రబాబుకు చుట్టూ ఉన్నవాళ్లే అలా.. చేశారు.. ఇంటర్వ్యూ పార్ట్-2 కోసం క్లిక్ చేయండి
‘అమరావతి’... తొలి ఆలోచన నాదే
ఆదిరెడ్డి అప్పారావు నథింగ్. ఆయన భార్యను మేయర్ చేసింది నేనే..
ఇప్పుడు నన్నే రాజమండ్రి రావద్దని ఆయన కోరుకుంటున్నారు..
మళ్లీ హోదాయే కావాలన్నారు. దాంతో మన క్రెడిబులిటీ దెబ్బతింది
2024లో చంద్రబాబు పేరుతోనే జనంలోకి వెళ్లాలి.
కొంతమంది కుర్రాళ్లు చేసే పనులు పక్క దారి పట్టించేలా ఉన్నాయి
వైసీపీ అభిమానులు కూడా రాష్ట్రం నాశనం అవుతుందని ఒప్పుకొంటున్నారు.
వాళ్లిద్దరూ కూడబలుక్కుని మరీ చంద్రబాబును ఓడించారు..
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో బుచ్చయ్య ఆవేదన
పార్టీ బలపడటంలో ఇబ్బందులు.. దానిపైనే నేను స్పందించాను.. తప్పు జరుగుతోందన్నా పట్టించుకోలేదు మళ్లీ బాబు వస్తేనే రాష్ట్రానికి బాగు.. ఇది ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. ఆయన పేరుతోనే జనంలోకి వెళ్లాలి.. అధికారంలో లేకున్నా బిజీ బిజీఅప్పుడేమో తెల్లవారుజాముదాకా మీటింగ్‌లు.. పార్టీని పట్టించుకోకుండా వదిలేశారు.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో గోరంట్ల బుచ్చయ్య
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని... చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ఆయన మనసు విప్పి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా వేసిన తప్పటడుగులు... ఇప్పుడు చోటు చేసుకుంటున్న లోటుపాట్ల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చిన సమాధానాలు ఇవి!
బుచ్చయ్య చౌదరిగారు ఎలా ఉన్నారు? కోపాలు తాపాలూ అన్నీ తీరాయా? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి మీరు అడపాదడపా అలుగుతూనే ఉన్నారెందుకు?
నేను కమ్యూనిజం భావాలతో పెరిగిన వాడిని. కాబట్టి పార్టీ సిద్ధాంతబద్దంగా ఉండాలి, విధానం ప్రకారం నడవాలి అనుకుంటాను. అప్పుడప్పుడు అవకాశవాద రాజకీయాలు ముందుకు వచ్చినప్పుడు కొంచెం రియాక్ట్ అవుతుంటా. కొంతమంది ఆవేశం అంటారు. ఆ ఆవేశం నా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు. అది కూడా పార్టీ కోసమే. చెప్పినా వినిపించుకోవడం లేదన్న బాధతోనే ఇటీవల స్పందించాను. అవకాశవాద రాజకీయాలు వస్తున్నాయి. నమ్మదగ్గ మనుషులు లేకుండా పోతున్నారు. ఇది మంచిది కాదని చెప్పాను. పార్టీని నెమ్మదిగా పెంచాలని కూడా చెప్పాను. లేఖ కూడా రాశాను. దాంతో పార్టీలో నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు. అయినా, పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాక్షసానందంతో వ్యవహరిస్తోంది. అలాగే, రాష్ట్రం చిన్నాభిన్నం అవుతోంది. బహుశా ఆఫ్రికా దేశాల్లో కూడా ఇలాంటి పరిపాలన ఉండదేమో. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయం టీడీపీ ఒక్కటే. దానికనుగుణంగా పార్టీ బలపడాలి. ఈ సమయంలో పార్టీలో చాలా ప్రాంతాల్లో ఉన్న ధోరణులు మా దృష్టికి వస్తున్నాయి. ఈ విషయాలపై పార్టీలో సీనియర్‌గా నేను స్పందించాను. పార్టీ బలపడడంలో జరుగుతున్న ఇబ్బందులవల్లే నేను పార్టీ నుంచి తప్పుకుందామనుకున్నాను. నేను ఏ పార్టీలోకి పోవాలనుకోలేదు.
ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో రాజకీయాలకు తగ్గట్టు మీరు మారారా? ప్రస్తుత మార్పునకు మీరు ఎందుకు అడ్జెస్ట్ కావడం లేదు?
అడ్జెస్ట్ అవుతాం. కానీ పార్టీ శ్రేయస్సు కోసమే మాట్లాడాను. ప్రత్యేక హోదా ఇవ్వం... ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. సరే, హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటున్నారు కాబట్టి తీసుకుంటున్నామన్నంత వరకూ ఓకే. అక్కడతో ఆగకుండా హోదా ఎందుకు మంచిది కాదు... ప్యాకేజీ ఎందుకు మంచిదో చంద్రబాబు, కుటుంబరావు తదితరులు అన్నిచోట్లా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ హోదాయే కావాలన్నారు. దాంతో మన క్రెడిబులిటీ దెబ్బతింది. అలాగే, అమరావతి, పట్టిసీమ తదితర విషయాల్లో అన్ని పార్టీలను పిలిచి మాట్లాడి ఉంటే వేరేగా ఉండేది. నా అనుభవం కొద్దీ చెప్పిన విషయాలు పట్టించుకోలేదు.
ఇంటర్‌లోనే ప్రేమ పెళ్లి చేసుకున్నారా?
అక్కడే ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా నాన్న ఏమో నన్ను మెడిసిన్‌లో చేర్చాలని ప్రయత్నించారు. కానీ నేను రాజమండ్రిలో బీఎస్సీ కోర్సు చదివాను. అది అయిన తర్వాత బిజినెస్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ప్రొబెషన్ ఎత్తేయడంతో లైసెన్స్ తీసుకుని లిక్కర్ వ్యాపారంలోకి దిగాం. రాజకీయాల్లోకి వచ్చిన కొన్నేళ్లకు... పదిమందికి నీతులు చెప్పేవాళ్లం సారా వ్యాపారంలో ఉండడం కరెక్ట్ కాదని రాత్రికి రాత్రి అన్నింటిని మూసేశాను. చాలా నష్టపోయాను. రామారావుగారి టూర్ కోసం నేను సొంతంగా పది లక్షలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత నా ఎన్నికలకు లక్ష రూపాయల ఖర్చుతోనే గెలిచాను.
‘అమరావతి’... తొలి ఆలోచన నాదే
అమరావతి రాజధాని విషయంలో ముందుగా స్పందించింది నేనే. రాష్ట్రానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న ఈ ప్రాంతంపై ఒక నోట్ తయారు చేసి ఇచ్చాను. ఈ ప్రాంత చరిత్ర మొత్తం అధ్యయనం చేశాను. ఆ ప్రాంతం అంతా తిరిగి ఉన్నంతలో ఇదే రాజధానిగా మంచిదని భావించి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆయన పీఎస్ అజేయ కల్లం రెడ్డికి అందించాను. అలాగే శివరామకృష్ణన్ కమిటికీ కూడా ఇచ్చాను. టీడీపీ గెలిచిన తర్వాత... రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబుకు కూడా అదే నోట్ ఇచ్చాను. తెనాలి, గుంటూరు, మంగళగిరి కలిసేలా ఒక ఔటర్ రింగ్ మాదిరే రాజధాని ఇక్కడ ఉంటే బాగుంటుందని ఒక స్కెచ్ గీసి చంద్రబాబుకు ఇచ్చాను. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌గా ఉన్న తిమ్మారెడ్డికి అందించాను. రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతం రాజధాని అవ్వొచ్చని అప్పుడే చెప్పాను.
పోలవరం విలీన మండలాలపై...
2014 ఎన్నికల తర్వాత మాజీ ఈఎన్‌సీ సీతాపతిరావు విజయవాడలో మా ఇంటికి వచ్చారు. ఆయన నాకు ఒక విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయకుంటే చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. దానిపై ఆర్డినెన్స్ ఇప్పుడు పాస్ కాకపోతే... ఎప్పటికీ కాదని హెచ్చరించారు. దానిపై వివరంగా నోట్ ఇవ్వమంటే వెళ్లి మూడు గంటల్లో తెచ్చిచ్చారు. ఏమిటీ డల్‌గా ఉన్నారంటే నాలుగు రోజుల క్రితం తన భార్య చనిపోయిందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కమిట్‌మెంట్‌తో రాష్ట్రం కోసం నా దగ్గరకు వచ్చారు. సీతాపతిరావు ఇచ్చిన నోట్ తీసుకెళ్లి చంద్రబాబుకు ఇచ్చాను. ఆయన దాన్ని తీసుకుని పక్కన పెట్టుకున్నారు. ఆ తర్వాత రోజు మళ్లీ దాని గురించి వాకబు చేసి... దానిని చంద్రబాబు దృష్టికి వెళ్లేలా చేశాను. దాంతో వెంటనే చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి మోదీ తొలి కేబినెట్‌లో ఆ ముంపు మండలాలు విలీనం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెచ్చారు. కానీ నేనెప్పుడూ క్రెడిట్ కోసం చెప్పుకోలేదు.
లోకేశ్‌తో కలవలేకపోతున్నారా? అలాగే ఆదిరెడ్డి అప్పారావుతో సమస్య ఉంది కదా?
యువకులు పార్టీలోకి రావాలి. 2019లో ఎన్నికల తర్వాత జరిగిన తొలి మీటింగ్‌లోనే పార్టీలో బయటి వారికి పెద్దపీట వేశారని చెప్పాను. అలాగే, పార్టీలోని వారికి పదవులు ఇవ్వలేదని నా అభిప్రాయం చెప్పాను. నాకు ఇచ్చిన డిప్యూటీ లీడర్ పదవీ వద్దు. ఒక బీసీ వ్యక్తికి ఆ పదవి ఇవ్వమని చెప్పాను. ఆదిరెడ్డి అప్పారావు నథింగ్. ఆయన పార్టీ మారి వచ్చారు. నన్ను ఓడించాలని పని చేశారు. ఆయన భార్యను మేయర్ చేసింది నేనే. ఇప్పుడు నన్నే రాజమండ్రి రావద్దని ఆయన కోరుకుంటున్నారు.
మీ ఇద్దరికీ పంచాయితీ ఏమిటి?
ఆయన నా సీటు అడిగారు. ఇవ్వలేదని వెలమ ద్రోహి అని ప్రచారం చేసి దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న నా ఇంటికి ఎవరూ రాకూడదని, ఫ్లెక్సీలు వేయకూడదని చెప్పారు. దాని గురించి నేను పట్టించుకోలేదు. అయితే, అచ్చెన్నాయుడు, లోకేశ్ పేర్లు వాడి కార్యకర్తలపై కేకలు వేస్తుంటే అది తప్పని చెప్పాను. రాజమండ్రిలో పార్టీ ఫౌండర్‌ని వదిలేసి బీజేపీకి సీటు ఇవ్వడం మొదటి తప్పు. నన్ను రూరల్‌కు పంపడం రెండో తప్పు. అయినా గెలిచి వచ్చాను. పొరపాటు జరుగుతుందని చెబితే పట్టించుకోలేదు. కొత్త జనరేషన్ రావాలి. ఇక లోకేశ్ వచ్చారు. పార్టీని బలోపేతం చేయాలని కొత్త జనరేషన్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పాను. పార్టీ అందరిదీ కదా.
లోకేశ్‌కు మీకు పడదు అని.. జనరేషన్ గ్యాప్ అనీ...?
లోకేశ్‌కు, నాకు పడదు అనేది లేదు. రామారావుగారి లెగసీ చంద్రబాబు. చంద్రబాబు గారి లెగసీ లోకేశ్. ఇందులో ఏం అనుమానం లేదు. కాబట్టి ఆయన అభివృద్ధి కావాలని కోరుకుంటాం. 2024లో చంద్రబాబు పేరుతోనే జనంలోకి వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే చంద్రబాబే మళ్లీ రావాలి అన్న ఫీలింగ్ జనంలో ఉంది. ఆ ట్రాక్‌లోనే వెళ్లాలి. అలా కాకుండా కొంతమంది కుర్రాళ్లు చేసే పనులు పక్క దారి పట్టించేలా ఉన్నాయి.
మీ ఫోన్ కూడా ఎత్తకుండా లోకేశ్ అవమానించారంటున్నారు?
చంద్రబాబు, లోకేశ్‌కు నేను ఫోన్ చేశాను. నేను ఏ రోజు ఎవరినీ ఇది చేయండి అని అడగలేదు. అలాంటి నేను జిల్లాల్లో కమిటీల గురించి... పార్టీ గురించే మాట్లాడతాను. ఆ విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తే... అధికారంలో ఉన్నప్పుడు బిజీ. లేనప్పుడూ బిజీ! వినతిపత్రం ఇద్దామన్నా గడప దగ్గరే ఇచ్చి వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ కేబినెట్ నిర్వహించడం ఏమిటి? పార్టీని కూడా పట్టించుకోకుండా వదిలేశారు.
జగన్ బలాలు, బలహీనతలు తెలిశాయి కదా! ఇప్పుడు మీలో ధైర్యముందా? సడలిందా?
నాకు ధైర్యం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకముంది. కానీ, కులాల ప్రభావం బాగానే ఉంది. ఎస్సీల్లో ఒక వర్గం మాకు మద్దతుగా ఉండేది. గెలిచాక వారిని పక్కన పెట్టేసారు. దాంతో వాళ్లు బాయ్‌కాట్ చేశారు.
వాళ్లిద్దరూ కూడబలుక్కుని మరీ చంద్రబాబును ఓడించారు.. ఇంటర్వ్యూ పార్ట్ -2 కోసం క్లిక్ చేయండి..