పరిటాల రవి హత్యపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2021-11-01T08:02:45+05:30 IST

అవి ఆరోపణలేనండీ. వాస్తవాలు కాదు. పరిటాల హత్య కేసును దర్యాప్తు చేసింది సీబీఐ. ప్రతిభ ఉన్న ఐపీఎస్‌లనే అందులోకి తీసుకుంటారు. పరిటాల రవి ప్రాణాలకు..

పరిటాల రవి హత్యపై ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఏమన్నారంటే..!

పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీరు అనంత ఎస్పీగా ఉన్నారు. ఆ హత్యకు మీ ప్రత్యక్ష లేదా పరోక్ష సహకారం ఉందని ఆరోపణలు వచ్చాయి.?

అవి ఆరోపణలేనండీ. వాస్తవాలు కాదు. పరిటాల హత్య కేసును దర్యాప్తు చేసింది సీబీఐ. ప్రతిభ ఉన్న ఐపీఎస్‌లనే అందులోకి తీసుకుంటారు. పరిటాల రవి ప్రాణాలకు ప్రమాదం ఉందని, దీనికి కుట్ర ఎక్కడో జైలులో జరుగుతోందని చాలా మంది చెబుతున్నారని.. రవి కూడా నాకు ఫిర్యాదు చేశారని నేను ప్రభుత్వానికి ఒక లేఖ ఇచ్చాను. ఎస్పీగా అది నా బాధ్యత. దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. హత్య జరిగిన తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ దర్యాప్తు మాత్రమే చేయగలడు. తనపై హత్యకు కుట్ర జరుగుతోందని రవికి తెలుసు. మేం కూడా ఎన్నోసార్లు చెప్పాం. నేను ప్రాణాలను ప్రేమించే మనిషిని.


ఈ గెటప్‌ ఎందుకు అలవాటు చేసుకున్నారు..?

2008-09లో నాకెందుకో ఓసారి గుండు చేసుకుంటే బాగుండనిపించింది. మొదట్లో  కొంచెం కష్టం అనిపించింది. మా పిల్లలు అభ్యంతరం చెప్పారు. తర్వాత మెల్లగా అందరికీ అలవాటైపోయింది. 


మీకు కేసీఆర్‌కి తగాదా వచ్చి రాజకీయాల్లోకి రాలేదా..?

తగాదా ఏం లేదు. నేను ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టి, వందలాది మంది డాక్టర్లను తయారు చేయగలిగాను. విద్యార్థుల కోసం లా కాలేజీలు, ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలు నిర్మించగలిగాను. ఎంతో మంది సెంట్రల్‌ యూనివర్సిటీలకు వెళ్లారు. ఈ రోజు ఇళ్లల్లో పనిచేసుకునే వారి పిల్లలు లేడీ శ్రీరామ్‌, సెయింట్‌ స్టీఫెన్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో చదువుతున్నారు. నేను దీనిపై మా మంత్రిగారితో పాటు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రజెంటేషన్‌ ఇచ్చాను. మీరు దయచేసి వీటి గురించి ముఖ్యమంత్రి గారిని అడగాలని విజ్ఞప్తి చేశాను. నేను వారికి ఒక ఆరు పాయింట్లు రాసిచ్చాను. అందులో ఇంకా ఎక్కువ స్కూళ్లు పెట్టాలని చెప్పాను. ‘ఏటా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కలిపి రూ.24 వేల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు. ఇందులో వీలైనంత వరకు విద్యాసంస్థలు పెట్టండి. బాగా చదువుకున్న టీచర్లను నియమించండి. విద్యార్థులను విదేశాలకు పంపించండి. వాళ్ల దారి వారే వెతుక్కుంటారు’ అని సూచించాను. వాళ్లు కేసీఆర్‌కు ఇచ్చారో.. లేదో నాకు తెలియదు. నాకు రూ.10లక్షలు ఇస్తే ఐపీఎస్‌ కాలేదు. మంచి విద్య ఇస్తే అయ్యాను. 


ఆ ప్రతిపాదన ఏమైంది..?

అది చెత్తబుట్టలో పడింది. అక్కడ పెద్ద దావత్‌ జరిగింది. ప్రవీణ్‌ కుమార్‌ను, ప్రశ్నించే స్వభావమున్న ఐఏఎస్‌ అధికారులను, సీఎం ఆలోచనా విధానాలను ఒప్పుకోని వ్యక్తులను పక్కన పెట్టాలని నిర్ణయించారు. తర్వాత దళిత బంధు పథకం వచ్చింది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు.. తెలంగాణలో 17 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే.. 1.7 లక్షల కోట్లు కావాలి. అసలు తెలంగాణ బడ్జెట్‌ ఎంత..? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం ఇస్తామని అంటున్నారు. ఇది ఎవరి డబ్బు..? ఏమాత్రం శాస్త్రీయమైన పరిశోధన జరగకుండా.. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఆలోచన లేకుండా.. ఒక లోతైన విశ్లేషణ లేకుండా.. పైలట్‌ ప్రాజెక్టులో ఏమీ చేయకుండా.. అకస్మాత్తుగా పది మందితో దళిత బంధును ప్రారంభించారు. తర్వాత హుజూరాబాద్‌లో మొదలు అన్నారు. అసలు ఏడేళ్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు సర్కారు కేటాయించిన డబ్బులు ఎంత..? అందులో విడుదల చేసిన నిధులు ఎన్ని..? ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్‌ వల్ల ఎంత మంది మిలియనీర్లు అయ్యారు..?  ఈరోజు ఎంత మంది ఆసరా పెన్షన్‌ కోసం, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం, మూడెకరాల భూమి కోసం ఎదురుచూస్తున్నారు..?


ఇది వరకు మంచి దళిత ఆఫీసర్లకు ఉన్నత పదవులు వచ్చాయి కదా..?

ఇప్పుడు పరిస్థితి చాలా దయనీయంగా, చాలా దుర్మార్గంగా ఉంది. వివక్షాపూరితంగా, కక్షపూరితంగా ఉంది. ఇప్పుడు పాడండి దొర ఏందిరో.. దొర పీకుడేందిరో అని.. నేను ఆ పాట ఎందుకు పాడానంటే.. ఆ రోజు ఆదిలాబాద్‌లోని లింగాపూర్‌ గ్రామంలో ఓ పేద వర్గం వారి ఇంట్లో లంచ్‌ చేశాను. అక్కడ ఓ పిల్లాడు గూడ అంజయ్య ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన ఇల్లు చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. కేసీఆర్‌ కంటే ముందే తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కవుల్లో గూడ అంజయ్య ఒకరు. ఆయన ఇల్లు శిథిలమైపోయి ఉంది. ఆయన చెల్లెలు ఆ ఇంటి పక్కనే ఉంటోంది. తడకల గుడిసెలో చలిలో నిద్రపోతూ ఆమె దీనావస్థలో ఉంది. నాకు చాలా కోపం, బాధ కలిగాయి. ‘మీకు ఎవరెవరో కవులు కనిపిస్తారు. ఆధిపత్య కులాల వారికి స్మృతి వనాలు కట్టిస్తారు. దొర ఏందిరో పాట రాసినందుకే గూడ అంజయ్యపై మీకు కోపమా..?’


ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..?

 నాకు అవగాహన ఉన్నంత వరకూ అలాంటిదేమీ లేదు. బహుజనులకు న్యాయం జరుగుతుందని అనుకుంటే.. ఎన్నికల తర్వాతే దానిపై పార్టీ ఆలోచిస్తుందని నా భావన.


తెలంగాణలో వివిధ వర్గాల మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఐక్యత ఎలా సాధ్యం..?

ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధ్యం అవుతుంది. నేను క్షేత్రస్థాయిలోకి వెళ్లనంత వరకూ మీలాగే అనుకున్నాను. వెళ్లాక చాలా మంచి స్పందన వస్తోంది. 


ఎన్నికల వ్యవస్థలో డబ్బు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో బీఎస్పీ మనుగడ ఎలా సాధ్యం..?

నాకు చాలా ఆశలున్నాయి. తెలంగాణలో ఆశావాదుల సంఖ్య పెరుగుతోంది. తొమ్మిదేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ విద్యార్థులను, తల్లిదండ్రులను చైతన్యవంతుల్ని చేశాను. పిల్లలను చదివిస్తూ, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి తెలంగాణ సమాజంపై పరిశోధన చేసి, నేనిప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో బీసీ సామాజిక వర్గాలు, ఆధిపత్య కులాల్లో ప్రగతిశీల భావాలున్న వ్యక్తులు ఒక కొత్త నాయకత్వం కోసం వెతుకున్నారన్న ఫీలింగ్‌ నాకు కలుగుతోంది. చాలా చోట్ల బీసీలు, ఎస్సీల మధ్య వైరుధ్యాల కంటే కలిసి పనిచేద్దామనే భావనే ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఎంబీసీ, ఇతర కులాల్లో వస్తోంది. 


మీరు ఇలా చేస్తారనే.. ముందు ఎస్సీలను పక్కకు లాగి ఉంటారు కేసీఆర్‌..?

బీఎస్పీ నుంచి, ప్రవీణ్‌ కుమార్‌ నుంచి అర్జెంటుగా ఈ దళిత సమాజాన్ని లాక్కోవాలంటే కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. ఏడేళ్లలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలకు, చేస్తున్న వాటికి పొంతన లేదు. హుజూరాబాద్‌లో పేద ముదిరాజ్‌ కులం నుంచి లేక లేక ఎమ్మెల్యే వచ్చారు. మీ మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ, ఆయనను ఓడించాలని సర్వ శక్తులు ఒడ్డి, ప్రజల కష్టార్జితమైన డబ్బుతో దళిత బంధు పెట్టారు. వాసాలమర్రిలో రూ.3 కోట్లతో ప్రజలకు దావత్‌ ఇచ్చారు. ఇప్పుడు చాలా శాఖల్లో ఉద్యోగులకు జీతాలు లేవు. వాళ్ల నోట్లో మన్ను కొట్టి, ఒక బీసీ ఎమ్మెల్యేను ఓడించడానికి రూ.వెయ్యి కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి..? అది ఎవరి సొమ్ము. నేను బీఎస్పీలోకి వచ్చింది ప్రజల కష్టార్జితాన్ని అన్ని వర్గాల వారి విద్య, వైద్యం కోసం సమానంగా ఖర్చు పెట్టడం కోసం. బంగారు తెలంగాణలో 50 వేల సంచార జాతుల కుటుంబాలు కనీసం తిండి, బట్టలు లేకుండా అడుక్కు తింటున్నాయి. మరి అంతే తక్కువ జనాభా ఉన్న వెలమ కుటుంబాల్లో ఆగర్భ శ్రీమంతులు ఉన్నారు. నేను కులాలకు వ్యతిరేకం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన డబ్బుల్లో సగం వీళ్ల అభివృద్ధి కోసం పెట్టి ఉండొచ్చు కదా.


జయాపజయాలకు సిద్ధమై వచ్చారా.? ఒకవేళ విజయం సాధించని పక్షంలో ఇదే పాత్రలో కొనసాగుతారా..?

అన్నింటికీ ప్రిపేరై వచ్చాను. నాకు ఒక లక్ష్యం ఉంది. వంద శాతం కొనసాగుతాను.



తొమ్మిదో తరగతిలో కొంత లోకజ్ఞానం ఉంటుందిగా.. వివక్షలు ఎదురైనప్పుడు తుపాకీ పట్టాలనిపించలేదా?

లేదండీ.. కోపం ఉంటుంది. కానీ హింస అనేది సీరియస్‌ ఆప్షన్‌ కాదు. రెండోది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మావోయిస్ట్‌ కల్చర్‌ ఇంకా అడుగుపెట్టలేదు. అది వచ్చి ఉంటే బహుశా ఏమయ్యేదో..? 1984లో రాజేంద్ర నగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిస్థితి చూసి నేను షాకయ్యాను. బాత్‌ రూముల మీద ఇది ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడ్డది అని రాసి ఉంది. అగ్రకులస్థులు ర్యాగింగ్‌లో ఎస్సీ, ఎస్టీలను టార్గెట్‌ చేసేవాళ్లు. డైనింగ్‌ టేబుల్‌ మీద వీళ్లు ఒకవైపు, వాళ్లు ఒకవైపు కూర్చునే వాళ్లు. ఇక కొట్టుకోవడం, తన్నుకోవడం మామూలే. నేను తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాను. మా అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చింది. ఆవిడ సర్దిచెప్పడంతో మళ్లీ యూనివర్సిటీకి వచ్చాను. ఇలాంటి వాటి వల్లే అణచివేయబడ్డ వర్గాల్లో భయం ఉంటుంది. వాటిని ప్రతిసారీ చాలెంజ్‌ చేయాలనిపించేది. ఇప్పుడు చాలెంజ్‌ చేసే స్థితికి వచ్చాను. అప్పుడు మాత్రం చాలెంజ్‌ చేయలేదు.. యూనివర్సిటీలో ఎదుర్కొన్నాం. అలా చేయకపోతే బతికేవాళ్లం కాదు. మనం ఇక్కడే ఉండాలి. మన హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం వచ్చేకొద్దీ అలాంటివన్నీ ఆపేశాం. నేను ఐపీఎస్‌ అయితే మా ప్రొఫెసర్‌ పద్మావతి గారు నమ్మలేదు. ‘ప్రవీణ్‌ నువ్వు ఐపీఎస్‌ అయ్యావా..? నువ్‌ పెద్ద రౌడీవో, గూండావో అవుతావనుకున్నాం’ అని అన్నారు. 


స్వాతంత్య్రానికి పూర్వం దారుణ అవమానాలకు గురైన రోజుల్లోనే అంబేడ్కర్‌ ఆ స్థాయికి ఎదిగారు. ఇన్ని సౌకర్యాలున్న సమాజంలో అణగారిన వర్గాలు ఎందుకు ఎదగలేకపోతున్నాయి?

చాలా కారణాలున్నాయి. ఆయన దార్శనికతతో వచ్చిన మేధావులు వాళ్ల కుటుంబాలకే చాలా వరకు పరిమితం కావడం. వాళ్లేమైనా చేయాలనుకున్నా ఇప్పుడు రాజ్యం కూడా అంతకంటే ఎక్కువ తెలివిగా ఉంది. అప్పట్లో అంబేడ్కర్‌ ప్రత్యర్థి వర్గంలోనూ కొంత ప్రజాస్వామ్య విలువలు ఉండేవి. ఆయనతో ఏకీభవించినా, విభేదించినా చివరికి మనమంతా మిత్రులమేనన్న భావనతో ఉండేవారు. 1960-70 వచ్చేసరికి దౌర్జన్యంగా కేసులు పెట్టడం లేకపోతే ప్రమోషన్లు ఆపడం, వర్సిటీల్లో సీట్లు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు.  

Updated Date - 2021-11-01T08:02:45+05:30 IST