జంక్ ఫుడ్ యాడ్స్‌ను నిషేధించిన బ్రిటన్.. కారణమేంటంటే..
ABN , First Publish Date - 2021-06-26T02:33:03+05:30 IST
జంక్ ఫుడ్ అనేది ఎంత హానికరమో అందరికీ తెలిసిందే.
జంక్ ఫుడ్ అనేది ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. ఊబకాయానికి, పలు అనారోగ్యాలకు జంక్ ఫుడ్ తినడమే కారణమని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలా మంది చిరు తిండిగా జంక్ ఫుడ్‌నే తీసుకుంటారు. ఇక, చిన్న పిల్లలనైతే జంక్ ఫుడ్ నుంచి దూరం చేయడం చాలా కష్టం. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం ఓ ముందడుగు వేసింది.
జంక్ ఫుడ్స్‌కు సంబంధించిన ప్రకటనలు చిన్నారుల కంట పడకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ యాడ్స్‌ను నియంత్రించే కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం తీపి, ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించిన ప్రకటనలను రాత్రి 9 గంటల ముందు ప్రసారం చేయకూడదు. వచ్చే ఏడాది చివరి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.
అక్కడ తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం.. నాలుగేళ్ల లోపు పిల్లలో 10 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇక, 10 ఏళ్ల వయసు దాటిన వారిలో అది 20.2 శాతానికి పెరిగింది. ప్రతి నలుగురిలో ఒకరికి ఊబకాయం ఉన్నట్టు తేలడంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ పాలసీని ప్రకటించింది.