అందాల పోటీల్లో రసాభాస.. బలవంతంగా కిరీటం లాక్కోవడంతో..
ABN , First Publish Date - 2021-04-08T06:08:30+05:30 IST
మన పొరుగు దేశం శ్రీలంకలో తాజాగా జరిగిన ‘మిసెస్ శ్రీలంక’ పోటీల్లో రసాభాస చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో చివరి ఘట్టం మొదలైంది.
కొలంబో: మన పొరుగు దేశం శ్రీలంకలో తాజాగా జరిగిన ‘మిసెస్ శ్రీలంక’ పోటీల్లో రసాభాస చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ అందాల పోటీల్లో చివరి ఘట్టం మొదలైంది. తీవ్ర ఉత్కంఠ మధ్య న్యాయనిర్ణేతలు పుష్పిక డి సిల్వ పేరు విజేతగా ప్రకటించారు. మిసెస్ వరల్డ్ వచ్చి ఆమె తలపై కిరీటం అలంకరించింది. ఆ తర్వాత సంతోషంతో వేదికపై నడుస్తుండగా.. ఆమె పక్కనే రన్నరప్‌లు, మిగతా వీక్షకులు ఆమెను అభినందిస్తున్నట్లుగా చూస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. 2019 మిసెస్ శ్రీలంక కిరీటం అందుకున్న కరోలిన్.. ప్రస్తుతం మిసెస్ వరల్డ్‌గా ఉన్నారు. ఆమె ఈ పోటీలో వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జూరీ వేదికపై మిసెస్ వరల్డ్ కరోలిన్ మాట్లాడుతూ.. పోటీల నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటాన్ని స్వీకరించే అర్హత లేదని పేర్కొన్నారు. ‘వివాహం చేసుకుని, విడాకులు తీసుకోకూడదనే నిబంధన ఉంది. అందువల్ల ఈ కిరీటం మొదటి రన్నరప్‌కు దక్కుతుంది’ అంటూ పుష్పిక తలపై ఉన్న కిరీటాన్ని వేగంగా తీసి, మొదటి రన్నరప్ తలపై ఉంచారు. ఆ కిరీటాన్ని బలవంతంగా తీసే క్రమంలో మిసెస్ శ్రీలంక జుట్టు కిరీటంలో చిక్కుకోవడంతో ఆమెకు వాటిని బలవంతంగా తొలగించడం జరిగింది. అవేమీ పట్టించుకోని కరోలిన్.. తనపని తాను చేసుకుపోయింది. ఆ పరిణామంతో అక్కడున్నవారందరూ విస్తుపోయారు. తీవ్ర నిరాశకు గురైన పుష్పిక వేదిక వెనకవైపు నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా జాతీయ మీడియాలో ప్రసారం అయింది.
దీనిపై ఆగ్రహానికి గురైన పుష్పిక పేస్‌బుక్‌లో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నేను విడాకులు తీసుకొని ఉంటే.. ఆ పత్రాలు చూపించాలని సవాలు విసురుతున్నా. నాకు జరిగిన అవమానానికి, అన్యాయానికి ఇప్పటికే చట్టపరంగా చర్యలు మొదలుపెట్టా’ అంటూ ఓ పోస్టు పెట్టింది. అలాగే ‘నిజమైన రాణి అంటే ఇతరుల కిరీటాన్ని దోచుకెళ్లే మహిళ కాదు’ అంటూ విమర్శించింది.
అందాల పోటీల నిర్వాహకులు కూడా ఈ ఘటనపై స్పందించారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని చెప్పడంతో పాటు ఆమెకు మళ్లీ కిరీటాన్ని అందజేశారు. అనంతరం మిసెస్ శ్రీలంక మాట్లాడుతూ.. ‘ఈ దేశంలోని ఒంటరి తల్లులందరికీ నా విజయం అంకితం’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై మిసెస్ శ్రీలంక వరల్డ్ డైరెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కరోలిన్ వ్యవహరించిన తీరు చాలా అవమానకరం. మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించింది’ అని వెల్లడించారు.