రౌడీషీటర్లపై నజర్
ABN , First Publish Date - 2021-12-10T06:03:18+05:30 IST
రౌడీషీటర్లపై నజర్
చట్టవ్యతిరేక కార్యకలాపాలు మానకుంటే పీడీ యాక్ట్
భూ దందాలు చేయకుండా అడ్డుకట్ట
పద్ధతి మార్చుకోవాలని వరుస కౌన్సెలింగ్‌లు
సీపీ ఆదేశాలతో కదిలిన పోలీసు అధికారుల కార్యాచరణ
వరంగల్ క్రైం, డిసెంబరు 9: నగరంలోని రౌడీషీటర్ల ఆగడాలపై పోలీస్ బాస్ నిఘా పెంచారు. రౌడీలుగా చలామణి అవుతున్న వారి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీ్‌సస్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలిస్తూ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమకు తాముగా మారితే రౌడీషీట్ తొలగిస్తామని, లేకుంటే పీడీయాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల పోలీసు అధికారులు విడతల వారీగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషితో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ గైక్వాడ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నా రు. అయితే ఈ కౌన్సెలింగ్‌కు కొందరు పేరుమోసిన రౌడీషీటర్లు హాజరు కాలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ముసుగులో కొందరు గైర్హాజరయ్యారనే ప్రచారం జరిగింది. అధికార పార్టీలో కొనసాగుతున్నందున పోలీస్ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపించాయి.
అసాంఘిక శక్తులపై నజర్
వరంగల్‌లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ మాఫియా జడలు విప్పింది. ప్రధానంగా పలువురు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాలను చక్కబెట్టేందుకు గతంలో రౌడీషీటర్లుగా చలామణిలో ఉన్నవారిని వాడుకుంటున్నట్లు సమాచారం. వారిని తమ అనుయాయులుగా పేర్కొంటూ భూదందాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో కొందరు రౌడీషీటర్లు భూ దందాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అధికార పార్టీ నేతల పక్కన చేరిన కొందరు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
అమాయకులను బెదిరించి భూములను గుంజుకోవడం లేదా తక్కువ ధరకే విక్రయించాలని భయబ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు అందులో తిష్టస్తున్నారు. ఆ స్థలం తమదేనంటూ గోడలపై పేర్లు రాసుకుంటున్నారు. అయితే ఇలాంటి కబ్జారాయుళ్లకు కొందరు పోలీసు అధికారులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారి జాబితా సిద్ధం చేసే పనిలో నిఘా వర్గాలు బిజీ అయినట్లు తెలుస్తోంది.
అక్రమాలకు చెక్...?
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గుట్కా, మట్కా, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. కల్తీ కల్లు, పేకాట, వ్యభిచారం, భూ కబ్జాల నియంత్రణకు చర్యలు ప్రారంభించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటున్నారు. సీపీ తరుణ్‌జోషి పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ టీం.. అవినీతి అక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల నగరంలోని పోలీ్‌సస్టేషన్ల వారీగా రౌడీషీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒక్కొక్కరి పేరిట నమోదైన కేసుల వారీగా విచారణ చేశారు.
ఈ మధ్యకాలంలో వారు ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దిగుతున్నారా.? లేదా సాధారణ జీవితం గడుపుతున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. రౌడీషీటర్లను ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించిన నేపథ్యంలో ఏ, బీ గ్రేడ్‌లో ఉన్నవారిపై ప్రధానంగా దృష్టి సారించాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. రౌడీషీటర్లు రియల్‌ఎస్టేట్ వ్యాపారం పేరిట భూకబ్జాలకు పాల్పడుతున్నారా అనేదానిపై కూడా దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇంకా ఏదైనా చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారా అనే విషయాలపైనా ఆరా తీయాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక మేరకు ఇటీవల పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి రౌడీలతో సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన నేరాలు, శిక్షల నుంచి గుణపాఠం నేర్చుకుని మంచిగా ఉంటే రౌడీషీట్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. తిరిగి నేరాలకు పాల్పడితే కఠినమైన చట్టాలు ప్రయోగించి శిక్షిస్తామని హెచ్చరించారు.