Hyderabad City లో మాయమైన మరో ప్రముఖ థియేటర్.. ఏం చేస్తారో..!
ABN , First Publish Date - 2021-11-23T12:12:50+05:30 IST
మల్టీప్లెక్స్‌లు లేని సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఈ థియేటర్‌లో...
- మెహిదీపట్నంలో ‘అంబా’ నేలమట్టం
హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం : మెహిదీపట్నం అనగానే గుర్తుకొచ్చేది అంబా థియేటర్. మల్టీప్లెక్స్‌లు లేని సమయంలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో ఈ థియేటర్‌లో సినిమా చూడాలంటే కొన్ని రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్ అప్పటి నుంచీ తెరుచుకోలేదు. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేశారు. నగరంలోని టోలిచౌకి గెలాక్సీ థియేటర్, బహదూర్‌పురాలోని శ్రీ రామ, మెహిదీపట్నంలోని అంబా, ఆర్టీసీ క్రాస్ రోడ్ మయూరి, నారాయణగూడలోని శాంతి థియేటర్లు మూత పడ్డాయి. మల్టీఫ్లెక్స్‌లతో పోటీ ఉన్నప్పటికీ ఈ ఐదు థియేటర్ల యజమానులు పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేస్తూ సామాన్యులకు వినోదాన్ని అందించేవారు. ప్రస్తుతం అంబా థియేటర్‌ను కూల్చివేశారు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తారా..? లేక మల్టీఫ్లెక్స్ నిర్మిస్తారా..? అన్నది తెలియదు.
1979లో 4,500 గజాల స్ధలంలో అంబా థియేటర్ ప్రారంభమైంది. ప్రేక్షకులు రాకపోవడంతోనే కూల్చివేశామని యజమాని డాక్టర్ బి కృష్ణారెడ్డి, నిర్వాహకుడు నిమ్మల సదానందం గౌడ్ తెలిపారు. ఓ కంపెనీ స్టోర్‌కు ఇస్తున్నామని చెప్పారు. లంగర్‌హౌస్ అలంకార్ థియేటర్ కూడా నడవడం లేదని, ఆదివారం మూడు షోలకు ప్రేక్షకులు లేకపోవడం చాలా బాధ అనిపించిందని సదానందం గౌడ్ పేర్కొన్నారు. దాన్ని కూడా వేరే సంస్థకు అప్పగిస్తామన్నారు.