HYD : వంతెనలు, చెక్‌డ్యాంలు వేర్వేరుగా.. సమగ్ర ప్రణాళిక రూపకల్పన

ABN , First Publish Date - 2021-11-12T18:16:56+05:30 IST

మూసీ, ఈసా నదుల వెంట చెక్‌డ్యాంల నిర్మాణంపై తర్జన భర్జన పడుతున్నారు...

HYD : వంతెనలు, చెక్‌డ్యాంలు వేర్వేరుగా.. సమగ్ర ప్రణాళిక రూపకల్పన

  • కనీసం 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహముండేలా డిజైన్లు
  • నీటి పారుదల శాఖ  ఇంజనీర్ల సూచనతో మారిన ప్రతిపాదన
  • మూసీ చెక్‌ డ్యాంల వద్ద బోటింగ్‌, పర్యాటక హంగులు

హైదరాబాద్‌ సిటీ : మూసీ, ఈసా నదుల వెంట చెక్‌డ్యాంల నిర్మాణంపై తర్జన భర్జన పడుతున్నారు. వంతెనలు, చెక్‌ డ్యాంలు కలిపి నిర్మించాలని భావించగా.. సాంకేతిక అవాంతరాల నేపథ్యంలో సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. వరద ప్రవాహ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా వంతెనలు, చెక్‌ డ్యాంలు వేర్వేరుగా ఉండాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. మూసీ తీర ప్రాంత అభివృద్ధికి రూపొందిస్తోన్న ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో చెక్‌ డ్యాంలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తాజాగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌హెచ్‌డీసీ) అధికారులకు సూచించారు. ల్యాండ్‌ స్కేపింగ్‌, కెఫేటెరియాలు, నడక దారులు, పార్కులు వంటివి ఉన్న చోట చెక్‌ డ్యాంలు నిర్మించి బోటింగ్‌ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యాటకులను ఆకర్షించే అవకాశముంటుందన్నది మంత్రి ఆలోచనగా తెలుస్తోంది.


14 ప్రాంతాల్లో కొత్త వంతెనలు

రెండు నదులపై ప్రస్తుతం మంచిరేవుల, ఇబ్రహీంబాగ్‌, అఫ్జల్‌గంజ్‌, చాదర్‌ఘట్‌, గోల్నాక, ముసారాం బాగ్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వంతెనలున్నాయి. పలు చోట్ల వరద ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఫ్లై ఓవర్ల పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. రెండు, మూడేళ్లుగా భారీ వర్షాలకు ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి పలుమార్లు వరద నీరు ప్రవహించింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పురానాపూల్‌, ముస్లింజంగ్‌, ఇమ్లిబన్‌ బ్రిడ్జిల వద్దా ఇదే పరిస్థితి ఉంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా రూ.350 కోట్లతో 14 ప్రాంతాల్లో కొత్త వంతెనలు నిర్మించనున్నట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు.


నదులకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు సులువైన రాకపోకల కోసమే ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా ప్రతిపాదిత వంతెనలను ప్రతిపాదిత వంతెనల నిర్మాణం ఉండాలని ఇటీవలి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం నయాపూల్‌ వద్ద 1.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తుంది. మున్ముందు ముంపు ముప్ప లేకుండా కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యముంటే ఉత్తమమని అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. చెక్‌ డ్యాంలతో కలిపి వంతెనలు నిర్మించిన పక్షంలో ఆ స్థాయిలో ప్రవాహ సామర్థ్యం ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు సూచించినట్టు తెలిసింది. దీంతో వంతెనలు, చెక్‌ డ్యాంలు వేర్వేరుగా నిర్మించాలని నిర్ణయించారు.


3 మీటర్ల మేర నీరుంటేనే..!?

మూసీ ఏటవాలుగా ఉంటుంది. దీంతో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో నీరు నిలిచే పరిస్థితి లేదు. చెక్‌ డ్యాంలు నిర్మించినా ఎక్కువ విస్తీర్ణంలో నీరు నిలిచే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. బోటింగ్‌ అందుబాటులోకి తీసుకురావాలంటే కనీసం మూడు మీటర్ల ఎత్తు, 800 నుంచి 1000 చ.మీల విస్తీర్ణంలో నీరుండాలని అధికారులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని చెక్‌ డ్యాంల వద్ద నీరు నిలిచేలా నిర్ణీత ఎత్తుతో నిర్మాణాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. నీరు నిలిచే చెక్‌ డ్యాంల వద్ద ప్రవాహ వ్యర్థాలూ మేట వేస్తాయి. వీటిని తొలగించేందుకు గేట్లు, యంత్రాలు, ఇతరత్రా ఏర్పాట్లు చేయనున్నారు. అడుగు భాగం ఎలా ఉంది..? నది వెడల్పు ఎంత..? ఎన్ని మీటర్ల మేర నీరు నిలిచే అవకాశముంది..? తదతర అంశాలను పరిశీలించి చెక్‌ డ్యాంల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రాంతాలను గుర్తించనున్నారు.


ఏకాకృతిలో ముఖద్వారాలు..

నదులపై 14 చోట్ల నిర్మించనున్న వంతెనలకు ఇరువైపులా ముఖ ద్వారాలు(ఫసాడ్‌) ఒకే ఆకృతిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గత నెలలో డిజైన్లను ఆహ్వానిస్తూ హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(హెచ్‌ఆర్‌డీసీ) ప్రకటన విడుదల చేసింది. ఆర్కిటెక్ట్‌లు, కళాశాలు, ఇతర సంస్థల నుంచి 30 వరకు డిజైన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ చారిత్రక నేపథ్యం, సంస్కృతి ప్రతిబింబించేలా ఉన్న ఆకృతులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఉన్నత స్థాయి కమిటీ త్వరలో నియమించనున్నారు.

Updated Date - 2021-11-12T18:16:56+05:30 IST