వర్షం పడితే బకెట్లు.. డస్ట్‌బిన్లు.. ఇంకెన్నాళ్లిలా..!?

ABN , First Publish Date - 2021-07-15T19:29:23+05:30 IST

నాంపల్లి ఏరియా ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది...

వర్షం పడితే బకెట్లు.. డస్ట్‌బిన్లు.. ఇంకెన్నాళ్లిలా..!?

  • కురుస్తున్న ఆపరేషన్‌ థియేటర్లు 
  • భయపడుతున్న వైద్యులు, సిబ్బంది
  • ఇదీ.. నాంపల్లి ఏరియా ఆస్పత్రి దుస్థితి

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : నాంపల్లి ఏరియా ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా మారింది. వర్షం వచ్చిన ప్రతిసారీ థియేటర్లు కురుస్తున్నాయి. ఆస్పత్రి భవనంలో తరచూ పెచ్చులూడి పడుతుండటంతో వైద్యులు, సిబ్బంది, పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. నగర నడిబొడ్డున ఉన్న నాంపల్లి ఏరియా ఆస్పతిలో 100 పడకలు ఉన్నాయి. నిత్యం 150 మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. అందుకు తగ్గట్లుగానే అధికారులు అదనపు పడకలను ఏర్పాటు చేసి మరీ రోగులను అడ్మిట్‌ చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో నిత్యం 10 నుంచి 12 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. అవసరమైన గర్భిణులకు సిజేరియన్లు చేసేందుకు, ఇతర సర్జరీలు చేసేందుకు మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా, ప్రతి థియేటర్‌లో రెండు టేబు ళ్లు ఉన్నాయి. ఆపరేషన్‌ థియేటర్లు ఉన్న భవనం దశాబ్దాల క్రితం నిర్మించింది కావడంతో స్లాబ్‌ పెచ్చులూడి పడుతోంది.


ఏడాది కాలంగా పలుమార్లు పెచ్చులూడి పడడంతోపాటు వర్షం పడిన ప్రతిసారీ లీకేజీల కారణంగా థియేటర్లలోకి నీరు చేరుతోంది. దీంతో వైద్యులు, సిబ్బంది థియేటర్‌లోని ఆపరేషన్‌ టేబుళ్లను మూలకు జరిపి సర్జరీలు చేసేందుకు తంటాలు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఇక్కడి సిబ్బంది వాపోతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ థియేటర్లు కురుస్తుండడంతో బకెట్లు, డస్ట్‌బిన్‌లను నీరు కారే ప్రాంతంలో పెడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


వార్డుల్లోనూ అదే దుస్థితి..

మూడు భవనాలు ఉన్న నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో సుమారు 150 మంది వరకు ఇన్‌పేషెంట్లు చికిత్సలు పొందుతుంటారు. తప్పని పరిస్థితుల్లో వైద్యులు రోగులను అడ్మిట్‌ చేసుకుంటుంటారు. వార్డులలో పెచ్చులూడి, ఇనుపరాడ్లు తేలి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. వార్డుల్లోని గోడలన్నీ వర్షానికి తడిసి పగుళ్లు రావడంతో ఇటీవలే ఆయా వార్డుల నుంచి రోగులను ఇతర వార్డుల్లోకి తరలించారు. ఓపీ, ఐపీ భవనాల్లో పరిస్థితి ఇదే మాదిరిగా ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళన చెందుతున్నారు. 


ఓపీ భవనంలోనూ..  

ఆస్పత్రి ఓపీ భవనం ఫ్లోర్‌ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. నిత్యం ఓపీ చికిత్స కోసం సుమారు వెయ్యి మంది వస్తుంటారు. భవనంలో ఫ్లోరింగ్‌ రాళ్లు కుంగిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆస్ప త్రి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఆస్పత్రిలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సునీత తెలిపారు.

Updated Date - 2021-07-15T19:29:23+05:30 IST