మానేరులో డ్యాంలో సింగరేణి సోలార్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-08-13T04:54:31+05:30 IST

కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు డ్యాంలో నీటిపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల(డీసీ) ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సింగరేణి సన్నాహాలు వేగవంతం చేసింది.

మానేరులో డ్యాంలో సింగరేణి సోలార్‌ ప్లాంట్‌
సమావేశంలో వాట్లాడుతున్న సింగరేణి డైరెక్టర్‌ ఈ అండ్‌ ఎం డి సత్యనారాయణరావు

 ఔత్సాహిక ఏజెన్సీలతో సమావేశం

కరీంనగర్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ సమీపంలోని లోయర్‌ మానేరు డ్యాంలో నీటిపై  నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల(డీసీ) ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సింగరేణి సన్నాహాలు వేగవంతం చేసింది. ప్లాంటు నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ నియమించడం కోసం హైదరాబాద్‌ సింగరేణిభవన్‌లో గురువారం సంస్థ డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం డి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఔత్సాహిక ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ప్రముఖ టాటా కన్సల్టింగ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌, టీయూవీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బెంగుళూరు, టీయూవీ ఎస్‌యూడీ సౌత్‌ ఏషియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముంబాయి, జెన్సాల్‌ ఇంజనీరింగ్‌ అహ్మదాబాద్‌, ఎస్‌జీయుఆర్‌ఆర్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పూణె సంస్థల వారు పాల్గొన్నారు. మానేరు డ్యాంలో సింగరేణి నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల(డీసీ) సోలార్‌ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోసం సింగరేణి నివేదించగా దానికి సంబంధించిన అనుమతులు త్వరలో వచ్చే అవకాశం ఉంది. మానేరు డ్యాం విస్తీర్ణం 81 చదరపు కిలోమీటర్లు ఉండగా దీనిలో సింగరేణి సంస్థ 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూరిస్థాయి  అనుమతి లభించిన వెంటనే టెండర్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని డైరెక్టర్‌ ఈ అండ్‌ఎండి సత్యనారాయణరావు తెలిపారు. ఈ సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ సోలార్‌ డీవీఎస్‌ఎస్‌ రాజు, ఎస్‌వో(డైరెక్టర్‌ ఈఅండ్‌ ఎంఎం) విశ్వనాథ రాజు, సోలార్‌ కన్సల్టెంట్‌ మురళీధరన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-13T04:54:31+05:30 IST