నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు
ABN , First Publish Date - 2021-07-07T04:51:23+05:30 IST
దళితుల అభ్యున్నతికి నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఇది అదనం
- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- అంబేడ్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
గద్వాల రూరల్, జూలై 6 : దళితుల అభ్యున్నతికి నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇవి ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనపు నిధులని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవనం నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాంలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.24 వేల కోట్లు విద్యుత్‌పై ఖర్చు చేశామని, తాగునీటి కోసం రూ.36 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. ఇక నుంచి పేదల సంక్షేమం కోసం బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. అత్యంత పేదరికంలో ఉన్న దళితుల కోసం ఈ ఏడాది రూ.1200 కోట్లు, రెండవ, మూడవ సంవత్సరాల్లో రూ.8,000 కోట్లు, చివరి ఏడాది రూ.20,000 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు నేరుగా అందిస్తామని చెప్పారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేని ఈ సహాయంతో జీవనోపాధి పొంది వారు ఆఽర్థికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. జోగు ళాంబ రిజర్వాయరు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలనను ప్రజల వద్దకు తెచ్చామని, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగును పెంచి వలసలను నివారించామన్నారు.
భవన నిర్మాణానికి రూ.కోటి
జిల్లా కేంద్రంలో ఎస్సీలకు కమ్యూనిటీ హాలు కావాలని కోరిన వెంటనే వారం రోజుల్లోనే రెండు ఎకరాల భూమిని కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రెండు ఎకరాల్లో అంబేడ్కర్ భవన నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేయించినట్లు తెలిపారు. దళిత సాధికారత పథకానికి నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్‌పర్సన్ సరిత, మునిసిపల్ చైర్మన్ బీ.ఎస్.కేశవ్, మాజీ ఎంపీ మందా జగన్నాథ్, కన్జ్యూమర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ రామేశ్వరమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు సుభాన్, తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
మండలంలోని గోనపాడులో మంగళవారం కొవిడ్ వ్యాక్సినేషన్ సెంబర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలు వీడి ప్రతీ ఒక్కరు టీకా తీసుకోవాలని సూచించారు. అనంతరం టీకాపై ప్రజలకు డీఎంహెచ్‌వో చందూనాయక్ అవగాహన కల్పించారు. మొదటి టీకాను సర్పంచ్ మాజిద్‌కు వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్వాల్ ప్రతాప్ గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.