విద్యాలయాల పక్కనే మద్యం షాపులు

ABN , First Publish Date - 2021-11-29T04:37:01+05:30 IST

మద్యం దుకాణాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు దగ్గరగా ఉండొద్దన్న నిబంధనలకు తిలోదకా లిస్తున్నారు.

విద్యాలయాల పక్కనే మద్యం షాపులు
అలంపూర్‌ చౌరస్తాలోని మద్యం దుకాణం వద్ద మద్యం కోసం బారులు తీరిన మందుబాబులు

అలంపూర్‌ చౌరస్తాలో ఏర్పాటు

ఏపీలో ధరలు అధికంగా ఉండటంతో ఇక్కడికి వరుస కడుతున్న మందుబాబులు

రోడ్ల వెంట, బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్‌లు

వంకర చూపులు, వెకిలి చేష్టలతో విద్యార్థినుల ఇక్కట్లు

చదువు మానేసిన పలువురు


అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 28: మద్యం దుకాణాలు విద్యా సంస్థలు, దేవాలయాలకు దగ్గరగా ఉండొద్దన్న నిబంధనలకు తిలోదకా లిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ చౌరస్తా అందుకు అద్దం పడుతోంది. అలంపూర్‌ చౌరస్తా మూడు రాష్ర్టాలకు ప్రధాన కూడలి. అష్టాదశ శక్తి పీఠలాలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయాలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక ఈ  ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు నెలకొన్నాయి. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యా బోధన అందుతోంది. అలంపూర్‌ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచే కాకుండా పెబ్బేరు, గద్వాల, ధరూరు, కొత్తకోట తదితర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యకోసం సుమారు రెండు వేలకుపైగా మంది విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు. వీరు చదువుకునే విద్యాలయాల సమీపంలోనే గత పదేళ్లుగా రెండువైన్‌ షాపులు కొనసాగుతున్నాయి. ఈ ఏడు అదనంగా మరో రెండు పెరగనున్నాయి. ఈ విషయమై దుకాణాలను తొలగించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం అలంపూర్‌ చౌరస్తాలో ఆందోళన చేశారు.


అక్కడ రేట్లు అధికంగా ఉండటంతో..

ఏపీలో జగన్‌ రెండో సారి సీఎం అయ్యాక ఆ రాష్ట్రంలో మద్యంపై ఆంక్షలు విధించి, రేట్లు భారీగా పెంచారు. దీంతో సమీప తెలంగాణ బార్డర్‌లో ఉన్న అలంపూర్‌ చౌరస్తాకు ఏపీలోని మందు బాబుల తాకిడి మూడేళ్లలో వీపరీతంగా పెరిగింది. కర్నూల్‌ నుంచి నిత్యం సుమారు 15 వేల నుంచి 25 వేల మంది వరకు మద్యం తాగేందుకు వస్తుంటారని అంచనా. మందు బాబులు విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే దారుల్లో మందు తాగుతూ, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నా రు. దీంతో కొంత మంది విద్యార్థులు చదువు మానేశారని ఆయా యాజమాన్యాలు చెబుతు న్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూల్‌ నుంచి అలంపూర్‌కు వెళ్తున్న విద్యార్థినుల స్కూల్‌ బస్సును మార్గం మధ్యలో కొందరు ఆకతాయిలు అడ్డగించారు. రన్నింగ్‌ బస్సును రౌండప్‌ చేసి, నిలిపేశారు. కొందరు బస్సులోకి ఎక్కి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచిన్న డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై ఉండవల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మద్యం షాపులను ఇక్కడి నుంచి తరలిం చాలని నాలుగేళ్లుగా ఉన్నతాధికారులకు చెబుతున్నా ఫలితం లేదని అంటున్నారు.


విద్యాలయాలకు కూతవేటు దూరంలో..

ప్రస్తుతం ఉన్న రెండు వైన్‌ షాపులకు మధ్య 30 మీటర్ల దూరం ఉంది. ఈ షాపులకు వైష్ణవి కాలేజీ, స్కూల్‌ 20 మీటర్ల దూరంలో, విశ్వశాంతి పాఠశాల 30 మీటర్ల దూరంలో, ప్రభుత్వ గురుకుల పాఠశాల ఇంకాస్త దూరంలో ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి, ఈ మద్యం దుకాణాలకు రోడ్డు మాత్రమే అడ్డంగా ఉంది. ఇక మరో వైన్‌ షాపు హైవే రోడ్డుకు కేవలం పదడుగుల దూరంలో ఉంది. విద్యా సంస్థలకు, వైన్‌ షాపులకు మధ్య బహిరంగ ప్రదేశం ఉంది. దాంతో మందు బా బులు అక్కడ కూర్చొని మందు తాగుతున్నారు. దాంతో పాటు కర్నూల్‌కు వెళ్లే సర్వీసు రోడ్డు పక్కన, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రోడ్డు పక్కన, వైన్‌ షాపులు, విశ్వశాంతి, వైష్ణవి కళాశాలల వెనకాల, పక్కన కూర్చుని మందు సేవిస్తున్నారు. విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.


కాలేజీకి రావాలంటే భయమేస్తోంది

కాలేజీకి రావాలంటే సర్వీసు రోడ్డు వెంటానే రావాలి. ఆ రోడ్డు పక్కన, రోడ్డుకు అడ్డంగా బైక్‌లు, ఆటోలు నిలిపి మందు తాగుతుంటారు. మేము దూరంగా వెళ్తున్నా కామెంట్లు చేస్తుంటారు. మా ఫ్రెండ్స్‌ ఒకసారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రోడ్డు వెంట వస్తుంటే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కాలేజీకి రావాలంటేనే భయమేస్తోంది. ఇద్దరు ముగ్గురం కలిసి వస్తున్నాం. కలెక్టర్‌ గారే చొరవ తీసుకుని, మద్యం షాపులను ఇక్కడ నుండి తరలించాలి

- ఓ విద్యార్థిని


చాలా సార్లు ఫిర్యాదు చేశాం

మద్యం దుకాణాలను ఇక్కడి నుంచి తరలించాలని అలంపూర్‌ చౌరస్తాలో ఉన్న విద్యాసంస్థల ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం. వారం కిందట కుడా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చాం. మందు బాబుల చేష్టల వల్ల తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేస్తున్నారు.

- మురళీధర్‌రెడ్డి, విశ్వశాంతి విద్యాసంస్థల యజమాని 


దుకాణాలను తొలగిస్తాం

అలంపూర్‌ చౌరస్తా: ప్రస్తుతం అలంపూర్‌ చౌరస్తాలో ఉన్న రెండు వైన్‌ షాపులను నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేశామని, అయినా ప్రజలు, విద్యార్థుల డిమాండ్‌ మేరకు వాటిని తొలగిస్తామని ఎక్సైజ్‌ సూపరిం టెండెంట్‌ సైదులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం దుకాణాలను తొలగించాలని విద్యార్థులు శనివారం ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన టెండరుదారులు అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తా మని కోరినా అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.




Updated Date - 2021-11-29T04:37:01+05:30 IST