Amaravati Farmers padhayatra : యాత్రపై ఆగని ఆగడాలు
ABN , First Publish Date - 2022-10-28T02:53:55+05:30 IST
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అమరావతి రైతుల పాదయాత్ర వాహనాలకు కాపలాగా ఉన్న యువకులపై ఓ పోలీసు అధికారి అకారణంగా జులుం
రథం, వాహన కాపలాదార్లపై పోలీస్ జులుం
యువకులపై డీఎస్పీ పిడిగుద్దులు, లాఠీ దెబ్బలు
వాహనాల హార్డ్‌డి్‌స్కలను ఎత్తుకుపోయిన వైనం
టీడీపీ,జనసేన తదితర పార్టీల నిరసనలతో రామచంద్రపురంలో రోజంతా తీవ్ర ఉద్రిక్తత
అమలాపురం/రామచంద్రపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అమరావతి రైతుల పాదయాత్ర వాహనాలకు కాపలాగా ఉన్న యువకులపై ఓ పోలీసు అధికారి అకారణంగా జులుం ప్రదర్శించారు. వారు తనకు గౌరవం ఇవ్వలేదంటూ డీఎస్పీ బాలచంద్రారెడ్డి రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపిస్తూ దౌర్జన్యానికి దిగారు. అనంతరం వాహనాలకు ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన రెండు హార్డ్ డిస్క్‌లను తీసుకుపోయారు. రైతుల పాదయాత్రను పోలీసులు నిలిపివేసిన వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే రామచంద్రపురంలో పోలీసు అధికారి ఇలా దౌష్టానికి పాల్పడటం గమనార్హం. విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన సహా వివిధ పక్షాలకు చెందిన జేఏసీ నాయకులు అక్కడకు చేరుకుని నిరసన తెలిపారు. డీఎస్పీపై కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు. పాదయాత్ర కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో రామచంద్రపురం నియోజకవర్గం చోడవరం రోడ్డులో ఉన్న విజయ ఫంక్షన్ హాలు వద్ద యాత్రకు రైతులు తాత్కాలిక విరామం ప్రకటించారు. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు ఉన్నవారితోనే పాదయాత్ర చేయాలంటూ రామచంద్రపురం, అమలాపురం డీఎస్పీలు బాలచంద్రారెడ్డి, వై.మాధవరెడ్డి పాదయాత్ర చేస్తున్న రైతులను కదలనీయకుండా అడ్డుకోవడంతో పాటు వారిపై ఉక్కుపాదం మోపారు. దీంతో యాత్రకు నాలుగైదు రోజులు పాదయాత్రకు విరామం ప్రకటించారు. పాదయాత్రలో కీలకంగా ఉన్న వేంకటేశ్వరస్వామి రథంతో పాటు 45 వాహనాలు అప్పటినుంచి అక్కడి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రైవేటు స్థలంలో ఉన్నాయి.
రైతులు తిరిగి అమరావతికి వెళుతూ.. కోలా చైతన్య (పల్నాడు జిల్లా సత్తెనపల్లి-ఎస్సీ), వొబ్బాని రామకోటేశ్వరరావు (కారంపూడి-ఎస్టీ), ఎం.దుర్గాప్రసాద్(గుంటూరు-బీసీ) అనే యువకులను కాపలా పెట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆ వాహనాలు నిలిపి ఉంచిన గ్రౌండ్‌లోకి సివిల్ డ్రెస్‌లో వెళ్లారు. వాహనాలు పరిశీలించి కాపలాగా ఉన్న యువకులను ప్రశ్నించారు. గుంటూరు యాసలో ఇచ్చిన సమాధానాన్ని తప్పుగా భావించి.. తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారన్న కోపంతో ఆ ముగ్గురు యువకులపై చేతితోను, లాఠీతోను డీఎస్పీ కొట్టారు. పిడిగుద్దులు గుద్దుతూ, వారిపై దౌర్జన్యానికి దిగారు. అనంతరం రెండు హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లడాన్ని బాధిత యువకులు అమరావతిలో ఉన్న జేఏసీ ప్రతినిధులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రామచంద్రపురం ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకుడు కడియాల రాఘవన్, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులు రామచంద్రపురం తరలివచ్చారు. పట్టణ సీఐ శ్రీనివాస్‌కు యువకుల తరపున ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు ఇవ్వాలని టీడీపీ నాయకులు సీఐని కోరగా, వాటిని కోర్టుకు అందజేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.